WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'నల్లగొండ'పై 'కెసిఆర్‌' వ్యూహం ఇదా...!?

తెలంగాణలో త్వరలో మరోసారి ఉపఎన్నికలు జరగబోతున్నాయని, అధికారపార్టీకి చెందిన ఓ ఎంపి, మరో ఇద్దరు ఎమ్మెల్యేల చేత కెసిఆర్‌ రాజీనామా చేయించి ఎన్నికలు ఎదుర్కోబోతున్నారని ఓ ప్రధాన పత్రికలో వార్త వచ్చింది. దీనిపై తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తనకు ప్రజల్లో ఉన్న బలం నిరూపించుకోవడానికే ఈ ఎన్నికలను తెస్తున్నారని ఆ పత్రిక రాసింది. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన నంద్యాల,కాకినాడ ఎన్నికల తరువాత అధికారపార్టీ బలంగా ఉందని తేలిందని, తద్వారా రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ ఘనవిజయం సాధించడానికి కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని కెసిఆర్‌ భావిస్తున్నారని ఆ పత్రిక పేర్కొంది. 'నంద్యాల' ఓటర్లు ఇచ్చిన తీర్పే...నల్లగొండ ఓటర్లు ఇస్తారని తద్వారా రాబోయే సార్వత్రిక ఎన్నికలను మరింత ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవచ్చన్నది ఆయన అభిప్రాయమని  పేర్కొంది.

  దీనిపై అధికార టిఆర్‌ఎస్‌లోనూ, ప్రతిపక్ష పార్టీల్లోనూ విస్తృతమైన చర్చ జరుగుతోంది.ప్రధాన పత్రిక రాసిన వార్తను అటు అధికారపార్టీ నేతలు ఖండించడం లేదు. అంటే ఆ వార్త నిజమేనని భావించవచ్చు. అయితే ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉన్న పరిస్థితుల్లో ఉపఎన్నికలకు కెసిఆర్‌ వెళితే లాభం జరుగుతుందా..? లేదా అనే దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది. నల్లగొండ వంటి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీని ఎదుర్కొని విజయం సాధించడం ఆషామాషీ విషయం కాదనేది కొందరి అభిప్రాయం. కాంగ్రెస్‌ పార్టీ నుంచి అధికార టిఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన 'గుత్తా సుఖేందర్‌రెడ్డి' రాజీనామాతో ఎన్నికలు జరగనున్నాయి కనుక...ఇక్కడ కాంగ్రెస్‌ సర్వశక్తులు ఒడ్డుతుంది. తమ సీటును కాపాడుకోవడానికి ఆ పార్టీ తమ సత్తామేరకు పోరాడుతుందనడంలో సందేహం లేదు. అదే సమయంలో రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో తమ ప్రభుత్వం ఏర్పడుతుందని గొప్పలు చెప్పుకుంటున్న బిజెపి కూడా ఇక్కడ గట్టిపోటీ ఇవ్వబోతోంది. ఇక ప్రాభవం కోల్పోయినా...కార్యకర్తల బలంతో టిడిపి కూడా గట్టిపోటీనే ఇవ్వవచ్చు. ఉప ఎన్నికలు జరిగితే ఇక్కడ చతుర్ముఖ పోటీ ఖాయమన్నమాట. ఈ పోటీలో ఎవరు గెలుస్తారు..ఎవరు ఓడతారు..అనేదాని కన్నా అధికారపార్టీ గెలవకపోతే ఆ పార్టీ పతనం ప్రారంభమైనట్లే...! ఎందుకంటే ఇక్కడ కావాలని ఉపఎన్నికలు సృష్టించింది అధికారపార్టీనే. ఉపఎన్నికలు ఏదైనా పరిస్థితుల్లో వస్తే దానికి ఎవ్వరూ అభ్యంతర పెట్టాల్సిన అవసరం ఉండదు. కానీ తమ బలం నిరూపించుకోవడానికి ఎన్నికలకు సిద్ధపడి ఓడిపోతే ఆ పార్టీకి దెబ్బే. ఇప్పటికే తెలంగాణలో అధికారపార్టీకి ఎదురు గాలివీస్తుందన్న ప్రచారం దీనికి బలం చేకూరుస్తుంది.

  అయితే ఈ వాదనలను కెసిఆర్‌ సన్నిహితులు కొట్టేస్తున్నారు. ఉపఎన్నికల ఛాంపియన్‌ అయిన కెసిఆర్‌ 'నల్లగొండ'లోనూ సునాయాసంగా విజయం సాధిస్తారని అంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే గ్రూపుల గోలతో చీలికపేలికలైందని, ఆ పార్టీతో అసలు పోటీయే ఉండదని, పోటీ అంతా టిఆర్‌ఎస్‌,బిజెపిల మధ్యే ఉంటుందని ఆయన అంటున్నారట. నల్లగొండ ఉపఎన్నికల ఫలితాలతో ఒకేదెబ్బకు మూడు పిట్టలను కొట్టాలనేది ఆయన ధ్యేయమట. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఈ సీటును గెలవడం ద్వారా తెలంగాణలో కాంగ్రెస్‌ ఇంకా పుంజుకోలేదని నిరూపించడం, ఆ పార్టీ రాబోయే ఎన్నికల్లోనూ గెలవలేదని చూపించడం ఒకటి కాగా...! బిజెపికి తెలంగాణాలో అంతసీన్‌ లేదని చెప్పటం రెండోదట. ఎందుకంటే నల్లగొండ జిల్లాల్లో టిఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌ పార్టీయే బలంగా ఉందని, పోటీలో టిఆర్‌ఎస్‌ మొదటి స్థానంలో ఉంటుందని, కాంగ్రెస్‌కు రెండోస్థానం దక్కుతుందని, బిజెపిది మూడోస్థానమేనని నిరూపించాలనేది ఆయన ధ్యేయమట. దీని ద్వారా బిజెపి పెద్దలు వేస్తున్న ఎత్తులకు చెక్‌ చెప్పాలన్నది మూడోదట. ఉపఎన్నికల్లో ఎటూ అధికారపార్టీకే అనుకూలమైన పరిస్థితి ఉంటుందని కనుక...ఎలాగైనా తామే గెలుస్తామనేది ఆయన విశ్వాసమట. అయితే దీనిపై మరో వాదన కూడా వినిపిస్తోంది. అదేమిటంటే కాంగ్రెస్‌ పార్టీ నుంచి  అధికార టిఆర్‌ఎస్‌ పార్టీలోకి ఫిరాయించిన 'గుత్తా సుఖేందర్‌రెడ్డి'పై త్వరలో లోక్‌సభ స్పీకర్‌ వేటు వేయబోతున్నారని, ఆమె వేటు వేయక ముందే ఆయనతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలనేది కెసిఆర్‌ ఆలోచనట. ఆయనేమీ కావాలని ఎన్నికలకు వెళ్లడంలేదని, తప్పని సరి పరిస్థితుల్లోనే ఎన్నికలకు వెళుతున్నారని వారు చెబుతున్నారు. అయితే 'గుత్తా'తో పాటు తెలుగుదేశంపార్టీ నుంచి ఫిరాయించిన 'మల్లారెడ్డి', వైకాపా నుంచి ఫిరాయించిన 'పొంగులేటి శ్రీనివాసరెడ్డి'లపై కూడా వేటుపడితే ఎలా అని పార్టీలో మరో వర్గం అంటుంది. అయితే 'మల్లారెడ్డి, పొంగులేటి'లతో రాజీనామా చేయించకుండా కేవలం 'గుత్తా'తోనే ముందు పనికానివ్వాలనేది కెసిఆర్‌ వ్యూహమట. మరి చూద్దాం..ఆయన వ్యూహం ఎంత వరకు ఫలిస్తుందో...!?


(369)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ