WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

చీరల స్కామ్‌లో ఎవరికెంత...!?

ఏదో చేద్దామనుకుంటే..ఇలా అయిందేమిటని...తెలంగాణ రాష్ట్ర సమితి వర్గాలు కిందా మీదా అవుతున్నాయి. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ మహిళలను బహుమతుల రూపంలో సంతృప్తి పరచాలని భావిస్తే అది ఎదురు తిరిగి శాపనార్థాలకు కారణమవడం టిఆర్‌ఎస్‌ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. బతుకమ్మ పండగకు దారిద్య్రరేఖకు కింద ఉన్న మహిళలకు చీరలు పంచాలని కెసిఆర్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఇచ్చే చీరలు నాణ్యంగా ఉంటాయని కూడా ముందు ప్రభుత్వ వర్గాలు ప్రచారం చేశాయి. సిరిసిల్ల చీరలంటూ టిఆర్‌ఎస్‌ వర్గాలు ఊదరగొట్టాయి. దీంతో మహిళలు పండగకు కొత్తచీరలు కట్టుకుని మురిసిపోదామని భావించారు. ప్రభుత్వం చెప్పినట్లే..పండగకు ముందే చీరలు వచ్చేశాయి..ఇంకేముంది...ఆహా కెసిఆర్‌ సారూ...ఎంత మంచోడో..అంటూ అందరూ చీరల పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరారు. కానీ చీరల బాగోతం దాన్ని అందుకుని తీసుకుని చూసిన తరువాత కానీ అర్థం కాలేదు..తెలంగాణ మహిళలకు తామెంత మోసపోయామోనని...రూ.50లు కూడా విలువ చేయని చీరలు తమకు అంటగట్టారని, ఆగ్రహం, అక్రోశంతో వాటిని నడిరోడ్డుపై తగులపెట్టారు. కొన్ని చోట్ల చీరలను కుప్పలుగా పోసి 'బతుకమ్మ'ను ఆడారు...! మరి కొన్ని చోట్ల ఈ చీరను కెసిఆర్‌ కుమార్తె 'కవిత' కట్టుకుంటుందా..? ఆమె ఈ చీరతో 'బతుకమ్మ' ఆడుతుందా..? అంటూ ప్రశ్నించి 'కెసిఆర్‌'పై దుమ్మెత్తిపోశారు. 

  దీంతో టిఆర్‌ఎస్‌ పెద్దలు సంబంధిత మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగకు కొత్త చీర ఇస్తే మురిసిపోకుండా..ఈ తగులబెట్టుడేందని...? టిఆర్‌ఎస్‌ ముఖ్యనాయకుడు మీడియా సాక్షిగా ఆగ్రహోదులయ్యారు. అంతే కాకుండా చీరలను తగులపెడున్న మహిళలను కేసులు పెడతామని హెచ్చరించారు...అంతటితో ఆగారా..లేదూ.....! చీరలను తగులపెడుతున్న మహిళల దృశ్యాలను టీవీలో చూపిస్తే మీ అంతు తేలుస్తానని హెచ్చరికలు జారీ చేశారు. అసలే 'దొర' కనసన్నల్లో నడుస్తున్న టీవీలు, పేపర్లు అమాంతం ఆ వార్తలను కట్టగట్టి గట్టునపారేశారు...! కొన్ని పత్రికలయితే...అసలు మహిళలు చీరలు తగులపెట్టిన వార్తను ప్రచురించలేదు..సరికదా...మహిళలు సంబరాలు చేసుకుంటున్నారని వార్తలు వండి తమ విధేయతను చాటుకున్నారు. ఇంకొన్ని మాత్రం అటూ...ఇటూ కాకుండా గొణిగాయి..! మొత్తం మీద 'చీరలు' తగులబెడుతున్న దృశ్యాలు బయటకు రాకుండా చాలా వరకు జాగ్రత్తలు తీసుకుని 'యువరాజు' సఫలీకృతులయ్యారు...! అయితే అసలు ప్రశ్నేమిటంటే...ఇంత నాసిరకం చీరలు రావడానికి కారణమెవరు...? ప్రభుత్వం ఈ చీరల కోసం దాదాపు రూ.220కోట్లు మంజూరు చేస్తే...దానిలో ఖర్చు చేసినదెంత...? మిగిలిన సొమ్ము మింగి తెలంగాణ ఆడపడుచులను దారుణంగా మోసం చేసిన పెద్దలెవరు..? ఒకవైపు వేలకోట్లు అడ్డూఅదుపూ లేకుండా దోచుకుంటూనే... ఆడపడుచుల చీరల సొమ్ముకూడా మింగాలా..? ఈ మొత్తం స్కామ్‌కు సూత్రధారులెవరు..? అనే ప్రశ్న తెలంగాణ సమాజం నుంచి వస్తోంది. అయితే ఈ స్కామ్‌ 'ముఖ్య'మైన వ్యక్తుల కనసన్నలోనే జరిగిందని టిఆర్‌ఎస్‌ వర్గాలు గుసగుసలాడు కుంటున్నాయి.  దాదాపు ఈ స్కామ్‌లో రూ.150కోట్ల వరకు కొట్టేసినట్లు ఆ వర్గాలు అంటున్నాయి. అతి 'ముఖ్యమైన' వ్యక్తి దీనిలో ఉన్నారని, అందుకే దీనిపై ప్రభుత్వం ఏమీ జరగనట్లే వ్యవహరిస్తుందని వారు చెబుతున్నారు. మొత్తం మీద తెలంగాణ ఆడపడుచుల 'బతుకమ్మ' సంబరాల్లో నిప్పులు పోశారని ఆ వర్గాలు కూడా నిందిస్తున్నాయి.


(దావులూరి హనుమంతరావు)


(381)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ