లేటెస్ట్

చేతులు కాలాక..ఆకులు పట్టుకున్న ‘చంద్రబాబు’...!

మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత ‘నారా చంద్రబాబునాయుడు’ ఎంతసేపూ, అభివృద్ధి, సంక్షేమం, పని..పనీ అంటూ నిరంతరం సమీక్షలు చేసుకుంటూ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి..? ప్రజలకు మెరుగైన పాలన ఎలా ఇవ్వాలి..? యువతను ప్రయోజకులుగా చేయడానికి ఏం చేయాలి..? సంక్షేమాన్ని, అభివృద్ధిని మిళితం చేసి దేశంలో రాష్ట్రాన్ని మిన్నగా నిలబెట్టాలనే తపన తప్ప ఆయన వెనుక ఏం జరుగుతుందో..? ఆయనపై ఏవిధంగా ప్రచారం చేస్తున్నారో..? ఎప్పుడూ చూసుకోలేదు. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడూ, తరువాత 2014లో మరోసారి ముఖ్యమంత్రి అయినప్పుడూ ఆయనపై విపరీతమైన దుష్రృచారాన్ని ఆయన వ్యతిరేకులు, ఇతర పార్టీలు చేసుకుంటూ వెళ్లాయి. అయితే అప్పట్లో ఆయన వాటిపై పెద్దగా స్పందించి తిప్పికొట్టిన పాపాన పోలేదు. ఆయన ఖండిరచకపోవడం, ఆయన పార్టీ పట్టించుకోకపోవడంతో ప్రత్యర్థులు చేసిన ప్రచారమే నిజమేమోనన్నట్లు ప్రజలు నమ్మారు. దాంతో ఆయన ఎంత అభివృద్ధిచేసినా, సంక్షేమం చేసినా..అవి ప్రజల దృష్టిలో పడలేదు. 1995లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనపై నాటి కాంగ్రెస్‌ చేసిన ప్రచారం ఏమిటంటే ‘వ్యవసాయం దండగ’ని ‘చంద్రబాబు’ అన్నారని, ఆయన రైతు వ్యతిరేకి అని యధేచ్చగా ప్రచారం చేశారు. అప్పట్లో ఆయన అన్నది రైతు కుటుంబాల యువత బాగా చదువుకుని ఐటి,బీటి రంగంలోకి వెళ్లాలని తద్వారా తమ కుటుంబాలు అభివృద్ధిచెందడమే కాకుండా రాష్ట్రాభివృద్ధికి కృషిచేసినవారు అవుతారని అన్నారు. అయితే దీన్ని పక్కన పెట్టి ఆయనను రైతు వ్యతిరేకిగా చిత్రీకరించి 2004ఎన్నికల్లో ఓడిరచారు. సరే..అప్పట్లో తనపై జరిగిన ప్రచారంతో అయినా 2014లో ‘చంద్రబాబు’ కళ్లు తెరిచారా..? అంటే అదీ లేదు. 


విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ‘చంద్రబాబు’ రాష్ట్రానికి మధ్యలో రాజధానిని నిర్మిస్తుంటే..అది తన కులం కోసం నిర్మిస్తున్నారని ప్రతిపక్షపార్టీ అయిన వైకాపా, దాని అనుబంధ మేధావులు, పవన్‌కళ్యాణ్‌ లాంటి వ్యక్తులు యధేచ్చగా అబద్దాలను ప్రచారం చేస్తుంటే పట్టించుకోకుండా వదిలేశారు. రాజధాని ‘అమరావతి’లో ‘కమ్మ’ సామాజికవర్గం ‘రెడ్డి’ ‘కాపు’, ఎస్సీల కంటే తక్కువగా ఉన్నారు. వాస్తవం అదయితే..‘కమ్మ’ రాజధాని అని ప్రచారం చేస్తుంటే అధికారంలో ఉండి వాస్తవాలు చెప్పకుండా మీనమేషాలు లెక్కించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైకాపా మొదలుపెట్టిన ఈ ‘కమ్మ’ రాజధాని ముద్ర ఇప్పటికే రాచపుండులా ఆ ప్రాంతాన్ని బాధిస్తూనే ఉంది. టిడిపి ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత ‘కమ్మ’ సామాజికవర్గం ఎంత ఉందో లెక్కలు తీసి చెప్పింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వైకాపా రాజధాని విషయంలో ‘కమ్మ’ సామాజికవర్గం అస్త్రం ప్రయోగించినప్పుడు అసెంబ్లీలో కులాల లెక్కతీసి...అక్కడ ఏ కులానికి చెందిన వారు ఎంత ఉన్నారో..? ఏ కులానికి చెందిన వారు రాజధాని కోసం ఎంత భూములు ఇచ్చారో..వీరిలో ఎస్పీ, మైనార్టీకి చెందిన పేదలు ఎంతమందో చెప్పి ఉంటే..నాటి వారి విషప్రచారానికి తెరపడేది. కానీ ‘చంద్రబాబు’ కాని ఆయన మంత్రులు కానీ దీనిపై కనీసం స్పందించలేదు.


దాని సంగతిని పక్కనపెట్టి ‘కమ్మ’ సామాజికవర్గానికి చెందిన 36మంది డిఎస్‌పీలకు ‘చంద్రబాబు’ ప్రయోషన్లు ఇచ్చుకున్నారని నాటి ప్రతిపక్షనేత, నేటి ముఖ్యమంత్రి ‘హస్తిన’ సాక్షిగా విషప్రచారం చేశారు. అప్పట్లో ఆయన ఒక పెద్ద బృందాన్ని తీసుకెళ్లి రాష్ట్రపతిని, ఇతర పెద్దలను కలసి ఒక లిస్ట్‌ ఇచ్చి వీరందరూ ‘చంద్రబాబు’ సామాజికవర్గానికి చెందిన వారంటూ ప్రెస్‌మీట్‌ పెట్టి పెద్దఎత్తున ప్రచారం చేసుకున్నారు. ‘చంద్రబాబు’ తన కులానికి చెందిన వారికే ముఖ్యమంత్రిగా ఉన్నారంటూ ప్రచారం చేశారు. అయితే ఆయన చేసిన ఆరోపణలు శుద్ధఅబద్దమని నాడు అందరికీ తెలుసు. ఈ విషయం తెలిసినా నాటి హోంమంత్రి ఒక ప్రెస్‌స్టేట్‌మెంట్‌తో ఖండిరచి వదిలేశారు. రాష్ట్రపతి స్థాయిలో ప్రతిపక్షనేత ఆరోపణలు చేస్తే..అది అసత్యమని తెలిసినా..నాడు ‘చంద్రబాబు’ ఆ విషప్రచారాన్ని అడ్డుకోలేదు. దాంతో ఎన్నికల్లో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నాటి వైకాపా ఆరోపణలను నేడు టిడిఎల్‌పి ఉపనేత ‘నిమ్మల రామానాయుడు’ సభలో ప్రశ్న రూపంలో ప్రజల ముందుకు తెచ్చారు. దాదాపు మూడేళ్ల తరువాత ఈ విషయంలో వాస్తవం ఏమిటో నాడు ఆరోపణలు చేసిన వారే అసలు సత్యాన్ని చెప్పారు. 36మంది డిఎస్‌పిల్లో 5 మంది మాత్రమే ‘కమ్మ’ సామాజికవర్గానికి చెందిన వారు ఉన్నారని నేటి ప్రభుత్వం అసెంబ్లీలో స్పష్టం చేసింది. అంటే అప్పట్లో తాము చేసిన ఆరోపణలు అసత్యాలని వారే అంగీకరించారు. మూడేళ్ల తరువాత అసలు సత్యం బయటపడితే ఉపయోగం ఏముంది. జరగాల్సిన నష్టం జరిగిన తరువాత. ఇదొక్కటేనా..? తిరుపతి వెంకన్న పింక్‌డైమండ్‌పోయిందని, అది ‘చంద్రబాబు’ ఇంట్లో ఉందని, ముఖ్యమంత్రి జగన్‌ బాబాయిని ‘టిడిపి’ హత్య చేయించిందని, పోలవరం, పట్టిసీమల్లో అవినీతి జరిగిందని, చీకటి జీవోలు ఇస్తున్నారని, చంద్రబాబు ఆరు లక్షలకోట్లు సంపాదించారని ఇలా ఒకటేమిటి..ఎన్నెన్నో అసత్య ఆరోపణలు చేసుకుంటూ నాటి వైకాపా పార్టీ విషం వెదజిమ్మినా ‘చంద్రబాబు’ నోరెత్తలేదు. నాడు వైకాపా చేస్తోన్న ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఖండిరచి, వాస్తవాలను ప్రజలకు సాక్ష్యాలతో వివరించి ఉంటే టిడిపికి ఇప్పటి పరిస్థితి ఉండేది కాదు. నాడు చేసిన పొరపాట్లపై నేడు తీరిగ్గా వాపోతున్నారు. చేతులు కాలాక వాస్తవాలు బయటకు వస్తే ఉపయోగమేమిటి ‘చంద్రబాబుగారూ’...!

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ