లేటెస్ట్

‘బిజెపి’లో చేరిపో...!

ఆయనో మాజీ ఎమ్మెల్యే. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో బాగానే హవా సాగించాడు. రాజకీయ కుటుంబానికి చెందిన ఈ మాజీ ఎమ్మెల్యే ‘చంద్రబాబు’కు అతి సన్నిహితుడనే పేరు ఉంది. ‘చంద్రబాబు’ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తన  నియోజకవర్గానికి చెందిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తెచ్చుకుని,నియోజకవర్గాన్ని ఉన్నతంగా అభివృద్దిచేశాడు. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా బలహీనవర్గాలకు పది ఎకరాల్లో ఇళ్లు నిర్మించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న పట్టణంలో ఆరకంగా ఇళ్లు నిర్మించి పేదలకు ఇవ్వడం ఎప్పుడూ జరగలేదు. ఎవరు పిలిచినా పలుకుతాడనే మంచిపేరూ సంపాదించుకున్నాడు. అర్థరాత్రి వరకూ పనిచేస్తాడని, మంచివాడని, అవినీతికి పాల్పడలేదనే పేరుకూడా ఉంది. అయితే ఆయనపై ఉన్న ఆరోపణల్లా ఉదయం 12గంటల వరకూ ఎవరినీ కలవడనేదొక్కటే. అయితే ఆయన ఎన్ని మంచిపనులు చేసినా ఎన్నికల్లో మాత్రం ఆయనను ప్రజలు ఓడించారు. ఓడిస్తే ఓడించారు..గెలిపించిన అభ్యర్థి ఏమైనా ప్రజల గురించి ఆలోచించే వ్యక్తా అంటే అదీకాదు. ఎన్నికలకు ఆరు నెలల ముందు హైదరాబాద్‌ నుంచి వచ్చి ‘జగన్‌’ గాలిలో గెలిచారు. దీంతో ఓడిపోయిన టిడిపి ఎమ్మెల్యే డంగైపోయారు. ఎంత చేసినా తనను ప్రజలు ఓడించారని, రాజకీయాల్లోకి వచ్చి అప్పులు పాలయ్యానని కొన్నాళ్లు నియోజకవర్గ ప్రజలపై అలిగి హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. అయితే ఇటీవల కాలంలో ‘చంద్రబాబు’ ఆయనను పిలిపించి ఎందుకు క్రియాశీలకంగా ఉండడం లేదని ప్రశ్నించడంతో తనకు నియోజకవర్గ ప్రజల గురించి ఆవేదనగా చెప్పారట. అయితే రాజకీయాల్లో ఇవన్నీ సహజమని, రాష్ట్రం కోసం ఎంతో కష్టపడితే మన పార్టీని ఓడించలేదా..? అవన్నీ మనస్సులో పెట్టుకోవద్దు..మళ్లీ చురుగ్గా పనిచేయాలని చెప్పడంతో అప్పటి నుంచి ఆయన మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు.


అయితే ఇటీవల జరిగిన ఓ సంఘటన ఆయనను అయోమయానికి గురిచేసిందట. అదేమిటంటే...! భారత అధికార వ్యవస్థలో రెండోస్థానంలో ఉన్న ఓ నాయకుడి సదరు ఎమ్మెల్యే మర్యాద పూర్వకంగా కలిశారట. ఈ సందర్భంగా రాజకీయాల గురించి ప్రస్తావన వచ్చిందట. ‘బిజెపి’ ఏ ప్రాంతీయపార్టీలను బతకనీయదని, ‘చంద్రబాబు’కు తాను ముందే ‘బిజెపి’తో విభేదాలు తెచ్చుకోవద్దని చెప్పానని, అయినా ఆయన తన మాట వినకుండా, వారితో శత్రుత్వం పెంచుకున్నారని, ఇప్పుడు ‘బిజెపి’ ‘చంద్రబాబు’ను ఇంకా అణిచివేయడానికి ప్రయత్నిస్తుందనిచెప్పారట. ‘నీవు ‘టిడిపి’లో ఉంటే ‘భవిష్యత్‌’ ఉండదు..? వెంటనే ‘బిజెపి’లో చేరిపో..? అని చెప్పారట. దీంతో ఆశ్చర్యపోవడం ఆ మాజీ ఎమ్మెల్యే వంతైందట. ఈ విషయం నిన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత జరిగిన చర్చల్లో కొందరు రాజకీయ విశ్లేషకులు ప్రస్తావించుకున్నారు. ‘చంద్రబాబు’ కొందరు పార్టీ నాయకుల తప్పుడు సలహాలతో ‘బిజెపి’తో వైరం పెంచుకున్నారని, దాని వల్లే పార్టీకి ఈ స్థితి వచ్చిందనే చర్చ 2019 ఎన్నికల ఫలితాల తరువాత నుంచీ జరుగుతున్నదే. వారు ఎంత బలవంతులో, వ్యవస్థలను ఎలా గుప్పెట్లో పెట్టుకున్నారో..అప్పట్లో ‘చంద్రబాబు’కు అర్థం కాలేదని, కానీ నిన్నటి ఫలితాలతో అది పూర్తిగా అర్థం అయిందంటున్నారు. దేశంలో ప్రాంతీయపార్టీలన్నింటినీ నాశనం చేసేదాకా ‘బిజెపి’ ఊరుకోదని, ఇక ప్రాంతీయపార్టీలకు భవిష్యత్‌లేదని అధికారపరంగా రెండో ఉన్నతస్థాయిలో ఉన్న నాయకుడి మాట అట. చూద్దాం..‘బిజెపి’ ప్రాంతీయ పార్టీలను ఏమి చేస్తుందో..?

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ