లేటెస్ట్

‘ఆప్‌’ను చూసి ‘బాబు’ నేర్చుకోవాలి...!

నిన్న వచ్చిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు పెద్దగా ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. ఎందుకంటే పోలింగ్‌కు చివరి రోజు అయిన 7వ తేదీన వెలువడిన ఎగ్జిట్‌ ఫలితాలు అన్నీ బిజెపి గెలుపును చెప్పినవే. ఎగ్జిట్‌ ఫలితాలు వచ్చిన తరువాత వచ్చిన ఫలితాలు కూడా అలానే ఉండడంతో  చాలా మంది ముందునుంచి అనుకున్నదే కదా..అన్నట్లు ప్రవర్తించారు. అయితే ఈ ఎన్నికల ఫలితాల్లో ఎక్కువ మందిని ఆశ్చర్యపరిచింది మాత్రం పంజాబ్‌లో ‘ఆప్‌’ గెలుపే. ‘పంజాబ్‌’లో ‘ఆప్‌’ గెలుస్తుందని దేశ వ్యాప్తంగా పెద్దగా ఎవరికీ అంచనాలు లేవు. అక్కడ కాంగ్రెస్‌కే మరోసారి అవకాశం ఉంటుందన్న భావన ఉంది. ఎందుకంటే గత రెండేళ్ల నుంచి వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని పంజాబ్‌ రైతులు సుధీర్ఘంగా ఉద్యమాలు నిర్వహించారు. వారి ఉద్యమం దెబ్బకు‘మోడీ’ ప్రభుత్వం దిగి వచ్చింది. దాంతో ఈసారి పంజాబ్‌లో కాంగ్రెస్‌కు అవకాశం ఉంటుందని, ఒక వేళ వారు గెలవకపోతే కనీసం హంగ్‌ వస్తుందనే భావన ఉంది. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చాపకింద నీరులా ‘ఆప్‌’ పంజాబ్‌ను ఊడ్చేసింది. పంజాబ్‌ ఫలితాలపై ఎగ్జిట్‌ ఫలితాలు వచ్చేవరకూ ‘ఆప్‌’పై ఎవరికీ అంచనాలు లేవు. కానీ..ఎగ్జిట్‌ ఫలితాల తరువాత వచ్చిన అసలు ఫలితాలు చూసిన తరువాత చాలా మంది అవాక్కవుతున్నారు.  ఒక్కసారిగా ఇదెలా సాధ్యం అయింది..? అసలు పంజాబ్‌లో ఏమి జరిగింది..? కేజ్రీవాల్‌ తన ఢిల్లీ మార్కు రాజకీయాలను ‘పంజాబ్‌’లో ఎలా అమలు చేశారు..? అనే చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది. 


రాజకీయాల్లో పెద్దగా హడావుడి చేయకుండా ఫలితాలు ఎలా సాధించాలో చాలా మంది రాజకీయనాయకులు ‘ఆప్‌’ను చూసి నేర్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా 40ఏళ్ల ఇండస్ట్రీగా చెప్పుకునే ‘చంద్రబాబు’ ‘ఆప్‌’ను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మూస రాజకీయాలకు కాలం చెల్లిందని ఆయన తెలుసుకోవాలి. ఎప్పుడో సాధించిన వాటిని ఇప్పటికీ చెప్పుకుంటూపోతే..వినేవారికి విసుగువస్తుంది తప్ప..ఉపయోగం ఉండదు. క్షేత్రస్థాయిలో పనిచేసే వారు ఎవరు..? పార్టీ నాయకులు ఎవరేం చేస్తున్నారు..? ఎటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం..? ప్రజలు ఏమనుకుంటున్నారు..? అనే విషయాలను ఎప్పటికప్పుడు నమ్మకమైన వారి ద్వారా సేకరించుకోవాలి. అంతా తనకే తెలుసు..? తనకంటే అనుభవజ్ఞులు పార్టీలో ఎవరు ఉన్నారు..? అనే ‘చంద్రబాబు’ అహం పార్టీ కొంపముంచుతుంది. అన్నీ తానే చూసుకోవాలనుకోవడం, ఎవరినీ విశ్వాసంలోకి తీసుకోకపోవడం చంద్రబాబులో ఉన్న ప్రధాన సమస్య. వీటికి తోడు ఆయన చుట్టూ ఉన్న భజనబ్యాచ్‌.  పంజాబ్‌లో చక్కటి ఫలితాలు సాధించిన ‘ఆప్‌’ నాయకత్వం ఎటువంటి హడావుడి చేయకుండా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలపై, వాటిపై ప్రజల్లో ఉన్న స్పందన ఏమిటని తెలుసుకుంటూ దాన్ని తమకు ఎలా అనుకూలంగా మలచుకోవాలో అంచనాలు వేసి అమలు చేస్తుంది. నమ్మకస్తులకు బాధ్యతలు అప్పచెప్పి వారిచేత ఫలితాలను సాధిస్తుంది. కానీ టిడిపిలో అంతా మూసధోరణి. అధినేత చెబితేనే చేయాలి..? చేస్తే నాకేమి వస్తుందనే భావన..తప్ప పార్టీ కోసం చేయాలనే భావన ఎవరిలో ఉండడం లేదు. గతంలో ఉన్న కోటరీనే..ఇప్పుడూ పెత్తనం చెలాయిస్తుంది. నమ్మకమైన కార్యకర్తలు చెప్పేది ఎవరూ వినిపించుకోరు. అధినేత చంద్రబాబు వద్ద, ఆయన కుమారుడు ‘లోకేష్‌’ వద్ద వ్యక్తిగత సహాయకులుగా పనిచేసేవారు ఎవరినీ దరిచేరనీయరు..? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అధినేతల దగ్గరకు తీసుకెళ్లనీయరు..? అంతా వాళ్ల హవానే..? ప్రత్యర్థులకు లీకులు ఇవ్వడం..పార్టీని ఇరుకునపెట్టడం ఇదే ధోరణి. ప్రస్తుతం రాజకీయాలు గతంలో వలే ఉండడం లేదు. డైనమిక్‌గా మారిపోయాయి. ఏ గంటకు ఏమి జరుగుతుందో..? తెలియని పరిస్థితులు ఉన్నాయి. నిత్యం రాజకీయాలను ఊపిరిగా భావించే ‘చంద్రబాబు’ గతంలోకంటే డైనమిక్‌గా మారితే తప్ప ప్రస్తుత రాజకీయాల్లో విజయం సాధించడం సాధ్యం కాదు.  

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ