పొత్తులు ఎవరికి అవసరం...!?
‘మంగళగిరి’లో పార్టీ వ్యవస్థాపక సభలో పొత్తులపై ‘జనసేన’ అధినేత ‘పవన్‌కళ్యాణ్’ సంకేతాలు ఇస్తారని ‘జనమ్‌ఆన్‌లైన్.కామ్’ మార్చి11వ తేదీన ఒక కథనాన్ని ప్రచురించింది. ‘జనమ్‌ఆన్‌లైన్.కామ్’ చెప్పినట్లే వ్యవస్థాపక సభలో పొత్తులపై కొన్ని సంకేతాలను బలంగా ఇచ్చారు. కేవలం సంకేతాలు ఇవ్వడమే కాదు..వచ్చే ఎన్నికల్లో ‘జగన్’ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఓడిస్తామని, ప్రభుత్వ వ్యతిరేకత ఓటును చీలిపోనీయమని ఆయన ఆ సభలో స్పష్టం చేశారు. అంతే కాదు..తమతో పొత్తులో ఉన్న ‘బిజెపి’ ఒక రోడ్‌మ్యాప్‌ను ఇస్తే ఆ విధంగా ‘జగన్’ ప్రభుత్వాన్ని దించడానికి చేయాల్సింది చేస్తానని ప్రకటించారు. ఆయన ప్రకటన తరువాత రాష్ట్రంలో పొత్తులపై ఒకటే చర్చ జరుగుతోంది. ‘పవన్’ సభ తరువాత ‘జనసేన,టిడిపి’బిజెపి’లు వచ్చే ఎన్నికల్లో కలిసిపోటీ చేస్తాయనే భావన ప్రజల్లో ప్రబలింది. అయితే ‘జనసేన’తో పొత్తులో ఉన్న ‘బిజెపి’ మాత్రం తామిద్దరమే కలిసి పోటీ చేస్తామని, ‘టిడిపి’ని తమతో జతకలుపుకోమని ప్రకటించారు. మరోవైపు ‘పవన్’ ప్రకటనను వైకాపా వ్యతిరేక పార్టీలన్నీ స్వాగతించాయి. అయితే ‘పవన్’ ప్రకటన తరువాత ‘జనసేన’, బిజెపిలోని కొంత మంది నాయకులు ఇక తమకు ఎవరూ అవసనరం లేదని, వచ్చే ఎన్నికల్లో తామే గెలుస్తామని, ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తున్నారు. కొందరు నేతలు అప్పుడే తమ నేత ‘పవన్’ ముఖ్యమంత్రి అయిపోయినట్లు, తాము మంత్రులమైపోయినట్లు భావిస్తూ ప్రకటనలు విడుదల చేస్తున్నారు. కొందరు ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు ‘పవన్’ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని బోర్డులు కూడా తయారు చేయించారు. బిజెపిలో కొంత మంది నాయకులు ఇంతకన్నా ఎక్కువ హడావుడే చేస్తున్నారు. ఉత్తరాది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ఇక ‘తెలంగాణ’లో, ‘ఆంధ్రా’లో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని చంకలు గుద్దుకుంటున్నారు.
ఈ రెండు పార్టీలుచేస్తోన్న హడావుడి మిగతా పార్టీల్లో చర్చకు కారణం అవుతోంది. గత ఎన్నికల్లో 0.5శాతం ఓట్లు సాధించిన ‘బిజెపి’, 5.54శాతం ఓట్లుసాధించిన ‘జనసేన’లు వచ్చే ఎన్నికల్లో 49.95శాతం,39.26శాతం ఓట్లు సాధించిన ‘వైకాపా, టిడిపి’లను ఎలా ఓడిస్తారని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి గత మూడేళ్లలో ప్రజల తరుపును ఏ సమస్యపైనా అయినా ఈ రెండు పార్టీలు పోరాడాయా..? కనీసం గతంలో కేంద్రం ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని అయినా నెరవేర్చగలిగేలా చేయగలిగాయా..? అంటే లేదనే సమాధానం వస్తోంది. మరి అలాంటప్పుడు ఈ రెండు పార్టీలు ఎలా అధికారంలోకి వస్తాయో ఎవరికీ అర్థం కావడం లేదు. దీని సంగతిని పక్కన పెడితే ‘పొత్తుల’ విషయంలో ఎవరికి ఏ పార్టీతో పొత్తులు అవసరం అనే చర్చ కూడా జరుగుతోంది. గత ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన ‘టిడిపి, వైకాపా, బిజెపి’లు ఎవరితో పొత్తు పెట్టుకోకుండా పోటీ చేశాయి. ‘జనసేన’ మాత్రం కమ్యూనిస్టుపార్టీలతో పొత్తుపెట్టుకుని పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తుపెట్టుకోని వైకాపా ఘనవిజయం సాధించింది. టిడిపి 23 సీట్లు సాధించి ప్రతిపక్షంలో కూర్చుంది. ఇక కమ్యూనిస్టులతో పొత్తుపెట్టుకున్న ‘జనసేన’ కేవలం ఒక్క సీటును మాత్రమే సాధించింది. ఆ పార్టీ అధినేత ‘పవన్’ తాను పోటీ చేసిన రెండుచోట్లా ఓడిపోయారు. బిజెపికి అయితే కనీసం నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు స్వంతగా పోటీ చేసి గెలుస్తారంటే నమ్మకం కలగడం లేదు. వాస్తవ పరిస్థితి చూస్తే మిగతా పార్టీలకంటే అధికారంలోకి రావాలనుకుంటున్న ఈ రెండు పార్టీలకే పొత్తుల అవసరం ఎక్కువ ఉంది. తాము సాధించాల్సిన లక్ష్యాలను వారు ఒంటరిగా సాధించే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో దాదాపు 40శాతం ఓట్లు ఉన్న ‘టిడిపి’ అవసరమే వీరికి ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా ‘టిడిపి’కి ‘జనసేన’ అవసరం ఉంది. ‘బిజెపి’ అవసరం మాత్రం లేదు. టిడిపికి, జనసేనకు పొత్తులు ఉభయతారకం. ‘బిజెపి’తో పొత్తు ఆత్మహత్యాసదృశ్యం. మొత్తం మీద..ఈ పార్టీలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయనడం మాత్రం ఎవరూ కాదనలేని సత్యం.