WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'మోడీ' పతనం ప్రారంభమైందా...!?

తాగనేర్వని పిల్లి పాలు ఒల‌క‌పోసుకుంద‌న్న‌ చందంగా...అపారమైన అధికారం చేతిలో పెట్టి పాలించమంటే..అడ్డదిడ్డమైన నిర్ణయాలతో తాను పతనం అంచున నిలవడమే కాకుండా, దేశ ప్రజలనూ నిలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. పదేళ్ల కాంగ్రెస్‌ నిర్వాహకంపై అంతులేని ఆగ్రహంతో 'మోడీ'కి జేజేలు  కొట్టిన ప్రజలు...నేడు 'మోడీ' నిర్వాహకం చూసి లబోదిబోమంటున్నారు. వాగాడంబరం, వాచాలతో ఇదే పరిపాలన అంటూ చెలరేగిన 'మోడీ' గణం..చివరకు దేశాన్ని ఊబిలోకి దించి ఇప్పుడు తీరిగ్గా చేతులు నులుపుకుంటూ...ఎవరు కాపాడతారన్నట్లు దిక్కులు చూస్తున్నారు. 

   అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాగాడాంబరం తప్ప...దేశ ప్రజలకు పనికి వచ్చే ఒక్కపని చేపట్టిన పాపానపోలేదని దేశ ప్రజలు తూర్పారపడుతున్నారు. ఈ మూడున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం సాధించింది ఇదీ...అని చెప్పడానికి ఒక్కటీ లేదు...! అన్ని రంగాలు తిరుగోమన దిశలో దూసుకుపోతున్నాయి. వ్యవసాయం,బ్యాంకింగ్‌,ఉత్పత్తి,సేవా రంగం, పరిశ్రమలు ఒకటేమిటి అన్ని రంగాలు కింది చూపులు చూస్తున్నాయి. ఆగని రైతుల ఆత్మహత్యలు...నిరుద్యోగసమస్య, రుణాల సమస్య, నోట్ల సమస్యలతో సగటు ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఇన్ని సమస్యలు ఉన్నా గత కొన్నాళ్లుగా జరిగిన ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడంతో...అందరూ ఆహో..ఓహో అన్నారు..కానీ..దేశాన్ని చుట్టుముడుతున్న సమస్యపై ఎవరూ పెదవి విప్పడానికి సాహసం చేయలేదు..దీనికి ఎవరికి కావాల్సిన కారణాలు వారికి ఉన్నాయనుకోండి...కాంగ్రెస్‌కు అసమర్థమైన నాయకత్వం సమస్య కాగా...కమ్యూనిస్టులను ప్రజలు పట్టించుకోవడం మానేశారు...చివరకు ప్రాంతీయ పార్టీలైనే చెబుతాయనుకుంటే వాటికి ఉండాల్సిన సమస్యలు వాటికి ఉన్నాయి. దేశం ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తుందని గత ఏడాదిన్నర నుంచి ఆర్థికవేత్తలు, ఇతర విశ్లేషకులు చెబుతున్నా...ఆ మాట 'మోడీ' ఎదుట అనడానికి, రాయడానికి కూడా ఎవరూ సాహసించలేదంటే 'మోడీ' ఎంతగా భయపెడుతున్నాడో అర్థం అవుతుంది. ఇప్పుడు మాజీ ఆర్థికమంత్రి, బిజెపి నాయకుడు 'యశ్వంత్‌సిన్హా' ఈ అంశంపై ఒక పత్రికలో వ్యాసం రాసిన తరువాత ఒక్కొక్కరూ నోరు మెదుపుతున్నారు. కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, ఇతర బిజెపి నేతలు ఈ విషయంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే 'యశ్వంత్‌సిన్హా' విమర్శలను ఇప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదనుకోండి...ఆయన రాజకీయనిరుద్యోగి అంటూ ఆర్థిక మంత్రి 'అరుణ్‌జైట్లీ' తోసేసుకుపోతున్నారు. ఆయన దోవలోనే మరి కొందరు బిజెపి మంత్రులు 'సిన్హా'పై విమర్శలు చేస్తున్నారు. అయితే ఎవరు విమర్శలు చేసినా, దాడులు చేసినా...వాస్తవాలు అందరికీ తెలిసినవే. సమస్యను తోసివేసి ముందుకు వెళ్లాలనుకోవడం మూర్ఖత్వమే..! ఇవన్నీ ఇలా ఉంటే 'మోడీ' ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముడిచమురు రూపంలో లభించిన లక్షలు కోట్లు ఏమయ్యాయనే ప్రశ్నలకు మాత్రం అధికారపార్టీ నుంచి జవాబు లభించడం లేదు.

లక్షల కోట్లు ఎక్కడికి వెళ్లాయి...!

కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న చివరి రోజుల్లో ఆ ప్రభుత్వానికి ముడి చమురు ధరల సమస్యే ఎక్కువగా ఉండేది. ఎలా అంటే అప్పట్లో ముడిచమురు ధర బ్యారెల్‌ దాదాపు 130 డాలర్లకు పైగా ఉండేది. నాడు ముడి చమురు దిగుమతులకే ఖజానా నుంచి ఎక్కువ ఖర్చుచేయాల్సి వచ్చేది. అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ తరచూ దీనిపై వేదన చెందుతూ ఉండేవారు. ఆయన తరువాత పాలనలోకి వచ్చిన 'మోడీ' ఈ విషయంలో చింతలేకుండా పోయింది. ఎందుకంటే అంతర్జాతీయ పరిస్థితుల వల్ల ముడిచమురు ధరల రేటు అమాంతం పడిపోయింది. గతంలో బ్యారెల్‌ 130 డాలర్లకు పైగా ఉండే ధర హఠాత్తుగా కనిష్టంగా బ్యారెల్‌ 25 డాలర్లకు కూడా పడిపోయింది. ప్రస్తుతం కొంత అటూ ఇటుగా ఉన్నా 35డాలర్ల మధ్య కొట్టుమిట్టాడుతుంది. మూడున్నరేళ్ల క్రితం బ్యారెల్‌ 130 డాలర్లు ఉంటే దేశీయ మార్కెట్‌లో పెట్రోల్‌,డీజిల్‌ ధరలు దాదాపుగా రూ.65 నుంచి రూ.70/- వరకు ఉండేవి...కానీ ఇప్పుడు కూడా అవే ధరలు దేశ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి లేక పెరుగుతున్నాయి. ఒక వైపు ముడిచమురు ధరల తగ్గినా...దేశీయంగా ఎందుకు వాటి ధరలు తగ్గడం లేదు..! ముడిచమురుపై వస్తున్న లక్షల కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాలోకి అప్పనంగా వచ్చి చేరిపోయింది. మరి ఈ మూడేళ్ల నుంచి వచ్చిన ఈ సొమ్మంతా ఏమైపోయింది. ఎవరి జేబులోకి చేరింది. ధరలు తగ్గితే..ఆ ప్రభావం సామాన్యులపై పడకుండా ఉండాలి కదా..కనీసం ధరలు పెరగకుండా ఉన్నా...సామాన్యులు సంతృప్తి చెందేవారు..కానీ..ఇక్కడ పూర్తి విరుద్ధంగా చమురు ధరలు ఉన్నాయి.పైగా రోజుకో ధరతో అమ్ముతూ సగటు వినియోగదారులను కొల్లగొడుతున్నారు. ఇదేనా అచ్చాదిన్‌ అంటే అని సామాన్యులు ప్రశ్నించుకుంటున్నారు.

అస్తవ్యస్థమైన బ్యాంకింగ్‌ రంగం...!

60 సంవత్సరాల క్రితం భారత్‌లో బ్యాంకింగ్‌ సేవలు మొదలైన కొత్తల్లో బ్యాంకులపై ప్రజలకు సదాభిప్రాయం ఉండేది కాదు..! బ్యాంకుల్లో సొమ్ములు దాచుకోవాలంటే భయపడేవారు..! ఎందుకంటే..తాము కష్టపడి సంపాదించిన సొమ్ము బ్యాంకులు తినేస్తాయనే భయం...! దాంతో బ్యాంకుల జోలికి వెళ్లేవారు..కాదు..అప్పటి ప్రజలు..! కొంత మంది ఎవరైనా బ్యాంకులకు వెళ్లినా...! ఉదయం సొమ్ము ఖాతాలో వేసి..గంటకోసారి..తమ సొమ్ము ఉందా...? పోయిందా..? అని బ్యాంకులు చుట్టూ తిరిగేవారని ఓ మాజీ ఉన్నతోద్యోగి నాతో మాటల సందర్భంగా చెప్పారు. అప్పట్లో వారి అమాయకత్వానికి నవ్వుకున్నా...ఇప్పుడు..అది అమాయకత్వం కాదని...బ్యాంకులు నిలువునా ముంచుతాయని ఇప్పుడు వాటి పనితీరు చూస్తే అర్థం అవుతుంది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత బ్యాంకులపై ఇంత అపనమ్మకం ఏర్పడడం ఇదే తొలిసారీ...ఇక చివరి సారీ అవుతుందేమో...! బ్యాంకింగ్‌ రంగంపై ప్రభుత్వ అజమాయిషీ, రిజర్వ్‌బ్యాంక్‌ను ఆట బొమ్మలా ఆడుకున్న 'మోడీ'చేష్టలు చూస్తుంటే బ్యాంకు అంటేనే సగటు పౌరుడిలో తీవ్రమైన అసహనం వ్యక్తం అవుతుంది. ఎడాపెడా ఛార్జీలతో, ఖాతాలో ఉన్న సొమ్ములను చెప్పా పెట్టకుండా కోతేస్తున్న తీరు మధ్యతరగతి జీవుల్లో తీవ్ర ఆవేదనకు కారణమవుతోంది. ఒక వైపు మధ్యతరగతి వారిపై ఇంతటి కాఠిన్యం చూపిస్తున్న బ్యాంకులు...మరో వైపు సంపన్నులకు మాత్రం దోచిపెడుతున్నాయి. వారికి ఉదారంగా రుణాలు ఇస్తూ...వారు వాటిని తీర్చకపోయినా..వాటిని రద్దు చేస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు బందిపోటు ముఠాలను తలపిస్తోంది. ఇంతటి అస్తవ్యస్థమైన బ్యాంకింగ్‌ వ్యవస్థ ఇంతకు ముందెన్నడూ కనిపించలేదు...!

రైతుల ఆత్మహత్యలు...!

దేశంలో దాదాపు 60శాతం మంది ఆధారపడ్డ రంగంపై ప్రభుత్వం శీత కన్ను వేసింది. తాను అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల ఆత్మహత్యలే ఉండవన్న ప్రధాని మోడీ...దానిపై మాట మాత్రంగానైనా స్పందించడం లేదు. దేశ వ్యాప్తంగా వేల సంఖ్యల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీస ఓదార్పు మాటలు కూడా చెప్పడం లేదు. రైతుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. వీటిలో బిజెపి ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలే ఎక్కువ.అయినా వాటి గురించి పట్టించుకునే తీరకే లేదు. పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు వేల కోట్ల రుణాలను రద్దు చేస్తున్న ప్రభుత్వం..రైతుల వ్యవసాయరుణాలను రద్దు చేయమంటే మాత్రం ఎకసెక్కాలు ఆడుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని, రైతుల రుణాల మాఫీ కోసం సహాయం చేయాలన్న విజ్ఞప్తిని తోసిరాజని, రైతు రుణాల మాఫీ సరికాదంటూ హితవు పలికింది.

కుదేలైన పారిశ్రామిక రంగం...!

నాటకీయ పక్కీలో తీసుకున్న నోట్ల రద్దు వ్యవహారంతో మొదలై..చివరకు జీఎస్టీతో వేల కొద్ది పరిశ్రమలు మూతబాటపట్టాయి. ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే ఈ ఏడాదిన్నరలో వేల సంస్థలు మూసివేయబడ్డాయి. తొలుత నోట్ల రద్దు వల్ల మార్కెట్‌లో మొదలైన నగదు సమస్య చివరకు సంస్థల మూసివేతకు కారణమయ్యాయి. నగదు లభ్యత లేకపోవడం...అదే సమయంలో మార్కెట్‌లో నగదు నిల్వలలు లేక పోవడం సమస్యలకు కారణమయింది. మూలిగే నక్కపై తాడిపండు సామెతలా నోట్ల రద్దుకు జీఎస్టీ తోడైంది. అసలు జీఎస్డీ అంటే ఏమిటో ఇప్పటికీ సగటు ఛార్టెటెడ్‌ ఎకౌంటెంట్‌లు చెప్పలేకపోతున్నారు. ప్రతి చిన్న వ్యాపారదారు జీఎస్టీతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ పన్నులు తట్టుకోలేక చివరకు వ్యాపారాలు మానుకోవాల్సిన పరిస్థితి వారికి ఎదురవుతోంది..!

పెరిగిన నిరుద్యోగ సమస్య...!

'మోడీ'ని అందలం ఎక్కించిందే యువకులు, నిరుద్యోగులు, మధ్యతరగతి వారు. అటువంటి వారే ఇప్పుడు 'మోడీ' పేరు చెబితేనే మండిపడిపోతున్నారు. 'మోడీ' అధికారంలోకి వస్తే తమకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వీరందరూ భావించారు. కానీ దానికి విరుద్ధంగా ఉన్న ఉపాధి ఊడితున్న చందం. వ్యాపారసంస్థల మూసివేత,పెట్టుబడుల ఉపసంహరణ తదితర కారణాలతో వేలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారు. ఇదే సమయంలో నూతన ఉపాధి దొరికే మార్గాలు కనిపించక దిక్కుతోచని స్థితిలో యువత ఉంది. చివరకు వారి ఆలోచనలు ఎంత దూరం వెళుతున్నాయంటే...'మోడీ' కంటే...కాంగ్రెస్‌ నయం అన్న రీతిలో ఉంది. ఇదొక్కటే కాదు..అన్ని వైపులా 'మోడీ' పాలనపై అపనమ్మకం రోజు రోజుకు పెరిగిపోతోంది. ఆవు మాంసం రవాణా చేస్తున్నారన్న కారణాలతో కొంత మంది చంపివేయడం, కాషాయికరణ వల్ల మైనార్టీల్లో అభద్రతాభావం, పొరుగు దేశాలతో సరిహద్దు సమస్యలపై రోజుకో రకంగా వ్యవహరించి, యుద్ధవాతావరణం సృష్టించడం, నాటకీయ పరిణామాలకు పాల్పడడం వంటి చర్యల వల్ల సగటు పౌరుల్లో 'మోడీ'పై రోజు రోజుకు వ్యతిరేకత పెరిగిపోతోంది. గత మూడున్నరేళ్ల నుంచి కొద్ది..కొద్దిగా వ్యక్తం అవుతున్న అసంతృప్తి..ఇప్పుడు తుఫాన్‌గా మారుతుంది. ఆ తుఫాన్‌లో 'మోడీ' కొట్టుకుపోతారా..? చూద్దాం...ఏమి జరుగుతుందో...!?


(దావులూరి హనుమంతరావు)


(1471)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ