లేటెస్ట్

‘టిడిపి’ని వెంటాడుతోన్న 2009 పొత్తుల భయాలు...!?

‘జనసేన’తో పొత్తు పెట్టుకోవాలని, ఆ పార్టీతో కలిసి నడవాలని టిడిపిలోని ఓ వర్గంతో పాటు కొంత మంది కార్యకర్తలు కూడా కోరుకుంటుండంపై ఆ పార్టీలో చర్చ సాగుతోంది. ‘జగన్‌’ను ఓడిరచాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తంగా టిడిపికి పడాలని, అటువంటప్పుడే ‘టిడిపి’ ఘనవిజయం సాధిస్తుంది వారు చెబుతున్నారు. నిరంకుశ ప్రభుత్వంపై పోరాటంలో ప్రతిపక్షపార్టీలన్నింటిని భాగస్వాములను చేయాలని, తద్వారా సమాజంలోని అన్ని వర్గాల ఆందోళనలు ప్రతిఫలిస్తాయని, కులం,మతం,వర్గాలుగా విడిపోయిన ‘ఆంధ్రా’ సమాజాన్ని ఏకతాటిపై తేవడానికి ఇదే మార్గమని వారు టిడిపి అధినేత ‘చంద్రబాబునాయుడు’కు సూచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పొత్తులపై చర్చలు సాగుతున్నాయని, దీనిపై త్వరగా క్లారిటీ ఇస్తే బాగుంటుందని, పొత్తులు ఖరారు అయితే ప్రభుత్వ దూకుడు కూడా తగ్గుతుందని వారు చెబుతున్నారు. అయితే ఈ పొత్తులను కొందరు టిడిపి నాయకులు, కార్యకర్తలు బలంగా వ్యతిరేకిస్తున్నారు. పొత్తుల వల్ల టిడిపికి నష్టం కలుగుతుందని, గతంలో అన్ని పార్టీలతో కలిసి పొత్తులు ఏర్పాటు చేసుకుని ఎన్నికలకు వెళితే ఓడిపోయామని, ఈసారి కూడా అటువంటి స్థితే వస్తుందని, ఒంటరిగానే పోటీ చేయాలని వారు అధినేతకు సూచిస్తున్నారు. వారి వాదనలకు బలంగా 2009 ఎన్నికలను వారు ఉదహరిస్తున్నారు.


2009 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ కాంగ్రెస్‌ను ఓడిరచడానికి ‘టిడిపి,టిఆర్‌ఎస్‌, వామపక్షాలతో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్లారు. అప్పట్లో తెలంగాణ కోసం ఉద్యమిస్తోన్న ‘టిఆర్‌ఎస్‌’తో పొత్తుపెట్టుకోవాలని ఆ ప్రాంత సీనియర్‌ నాయకులు, ‘ఆంధ్రా’కు చెందిన ‘టిడిపి’ మేధావంతులమనుకునే నాయకులు అధినేతపై ఒత్తిడి తెచ్చారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న ‘టిడిపి’ ‘టిఆర్‌ఎస్‌’తో పొత్తుపెట్టుకుంటే పార్టీకి తీవ్రమైన కష్టాలు వస్తాయని, పొత్తు వద్దని చాలామంది నాయకులు, కార్యకర్తలు అధినేతకు చెప్పారు. అయితే 2004లో కాంగ్రెస్‌ పార్టీ ఇదే ‘టిఆర్‌ఎస్‌’తో పొత్తుపెట్టుకుందని, మనం పెట్టుకుంటే మనకు కూడా లాభమని ‘చంద్రబాబు’పై ఒత్తిడి తెచ్చి పొత్తుపెట్టుకున్నారు. అయితే ఈ పొత్తుల సందర్భంగా టిఆర్‌ఎస్‌ అధినేత ‘చంద్రశేఖర్‌రావు’ ఎక్కువ సీట్ల కోసం టిడిపిపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి దాదాపు 44 సీట్లకు పోటీ చేశారు. అంతే కాకుండా చివరి నిమిషం వరకూ పొత్తులు ఉంటాయా..? లేదా అనేది తేల్చకుండా, పార్టీ నాయకులకు, కార్యకర్తలను అయోమయంలో పడేశారు. ఒక వైపు వామపక్షాలు తమకు సీట్లు పెంచాలనే ఒత్తిడి, మరో వైపు టిఆర్‌ఎస్‌ బెదిరింపులతో పొత్తుపొడుపులోనే అపశకునాలు ఎదురయ్యాయి. దీంతో అన్నిప్రతిపక్ష పార్టీలతో మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసినా ‘టిడిపి’కి ఓటమే మిగిలింది.


2009లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందనుకున్న టిడిపి, నాటి పొత్తులు కుదరక ఓటమి పాలయింది. అప్పటి రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా దాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకోలేక మహాకూటమి చతికిలపడిరది. ఇప్పుడు కూడా అదే రీతిలో జరుగుతుందేమోనన్న బెంగ సగటు టిడిపి కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది. ‘జనసేన’‘బిజెపి’తో పొత్తు తమకు మేలు చేయదనే వారే ఎక్కువ మంది ఉన్నారు. వారితో పొత్తు పెట్టుకుంటే వారు అడిగే గొంతెమ్మ కోర్కెలను తీర్చాల్సి ఉంటుందని, దాని వలన ‘టిడిపి’కి మరోసారి నగుబాటు ఎదురవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. ఒక వేళ పొత్తు పెట్టుకోవాలంటే ముందుగానే వారితో ఒప్పందానికి రావాలని పరిమితమైన సీట్లు ఇవ్వాలని, అదీ ‘జనసేన’ పార్టీతోనే పొత్తుఉండాలని వారు కోరుతున్నారు. అలా కాకుండా ‘బిజెపి’ని కూడా కలుపుకుంటే 2009 ఫలితాలు పునరావృతం అవుతాయనే భావన ఎక్కువ మంది కార్యకర్తల్లో ఉంది. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ