WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆంధ్రా పాల‌కులే న‌యం...!

మూడున్నరేళ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్ పరిస్థితి ఎలా తయారైందంటే.. భారీ వర్షం పడితే ఇళ్లల్లో నుంచి ప్రజలు బయటకు రావొద్దంటూ ముఖ్యమంత్రే స్వయంగా సూచించే పరిస్థితికి దిగజారి పోయామని చెప్పక తప్పదు. ఇదే మాటలు ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పి ఉంటే కేసీఆర్ ఎంతలా విరుచుకుపడే వారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండేదికాదు.ఉమ్మడి రాష్ట్రంలో ఏ చిన్న విషయం చోటు చేసుకున్నా అంతెత్తున ఎగిరిపడి.. ఆంధ్రా పాలకులు అంటూ విరుచుకుపడటమే కాదు.. హైదరాబాద్ మహానగరాన్ని నాశనం చేశారంటూ కేసీఆర్ ఆవేశపడటం అందరికి గుర్తుండేది. అంతదాకా ఎందుకు.. వర్షం పడితే చాలు నగరం ఆగమాగం అయిపోవటం ఏంటి? ఇదంతా సీమాంధ్రుల పాలన దుర్మార్గానికి నిలువెత్తు నిదర్శనమంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడే కేసీఆర్.. ఇప్పుడు తన మాటల్ని తానేమర్చిపోయారా?అనిపించకమానదు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ సమస్యల్ని తాము తీరుస్తామని.. విశ్వనగరంగా మారుస్తామని బీరాలు పలికారు.అధికారం చేపట్టి ఏడాదో.. ఏడాదిన్నరో అయి ఉన్నప్పుడు తాను అనుకున్న మార్పులు చేయటం సాధ్యం కాదని అనుకోవచ్చు. కానీ.. మూడున్నరేళ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్ నగర పరిస్థితి మరింత దిగజారిందని చెప్పక తప్పదు. గతంలో భారీ వర్షాలు కురిస్తే కొన్ని ప్రాంతాలు నీట మునిగేవి. కేసీఆర్ హయాంలో అలాంటి ప్రాంతాలు మరిన్ని కొత్తగా చేరాయని చెప్పాలి. తాజా పరిస్థితి చూస్తున్న చాలామంది హైదరాబాదీయులు ఆంధ్రా పాలకుల హాయంలోనే హైదరాబాద్ సిటీ బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం కావటం గమనార్హం.

   సివరేజ్ సిస్టం దాదాపుగా నగరంలో స్తంభించిపోయిందని చెప్పాలి. తాజాగా కురిసిన భారీ వర్షం.. మహానగరంలోని చాలా ప్రాంతాల్లో వరద మాదిరి పోటెత్తిన పరిస్థితి గా మారింది. జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో వరద పోటును అక్కడి వారు చూడాల్సి వచ్చిందంటే.. సివరేజ్ సిస్టం ఎంత దారుణంగా మారిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.దశాబ్దాల తరబడి పాలించిన సీమాంధ్ర పాలకుల్లో ఏ సీఎం కూడా వర్షం కారణంగా ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని.. అత్యవసరమైతే బయటకు అడుగు పెట్టాలని చెప్పటం కనిపించదు. అలాంటి మాట సీఎం కేసీఆర్ నోట తాజాగా వచ్చింది. తన మూడున్నరేళ్ల పాలనలో హైదరాబాదీయుల్ని ఏస్థాయికి తీసుకొచ్చారన్నది కేసీఆర్ తాజా మాటలే నిదర్శనమని చెప్పకతప్పదు. మహానగరాన్ని ముదరష్టపు నగరంగా మార్చిన ఘనత కేసీఆర్కే చెల్లుతుందన్న అభిప్రాయం పలువురి నోట వినిపిస్తోంది. మొన్నామధ్యనే కోట్లాది రూపాయిలతో వేసిన రోడ్లలో చాలావరకు తాజా వర్షాలతో నాశనమైపోయాయి. హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో ప్రయాణం ఇప్పుడు కష్టంగా మారింది. గుంతలతో నిండిన రోడ్ల మీద ప్రయాణికులకు సరికొత్త నరకం కనిపిస్తోంది. కోటికి పైగా ఉన్న మహానగరం ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లోకి వెళ్లిపోయిందని చెప్పాలి. ప్రతిపక్షాల నుంచి ఎలాంటి సవాళ్లు ఎదురుకాని కేసీఆర్ కు ప్రకృతి విసిరిన సవాలు షాకింగ్ గా మారిందని చెప్పక తప్పదు. తన పాలనా సమర్థతను ప్రదర్శించుకోవటానికి.. హైదరాబాద్ మహానగర రూపురేఖలు మార్చటానికి కేసీఆర్ కు లభించిన ఒక సదవకాశంగా చెప్పక తప్పదు. మరి.. ఆయన సక్సెస్ అవుతారా? ఫెయిల్ అవుతారా? అన్నది కాలమే తేల్చాల్సి ఉంటుంది.

 

(372)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ