లేటెస్ట్

మంత్రివర్గంలోకి ‘సజ్జల’...!?

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి తన మంత్రివర్గాన్ని త్వరలో విస్తరిస్తానని చెప్పడంతో..మంత్రి పదవుల కోసం పలువురు ఎమ్మెల్యేలు పోటీపడుతున్నారు. వచ్చే రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన ఎన్నికల క్యాబినెట్‌ను ‘జగన్‌’ ఏర్పాటు చేసుకోబోతున్నారని, సమర్థులైనవారికి మంత్రి పదవులు కట్టబెట్టబోతున్నారని వైకాపాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో అరడజన్‌ మంది మంత్రులను కొనసాగిస్తారని, మిగతా వారిని తొలగించి వారి స్థానంలో వేరే వారికి అవకాశం ఇస్తారని వైకాపా నాయకులు చెబుతున్నారు. అయితే మరో ఆసక్తికరమైన వార్త ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్‌ తరువాత అన్నీ తానై పెత్తనం చేస్తోన్న ప్రభుత్వ సలహాదారు ‘సజ్జల రామకృష్ణారెడ్డి’ మంత్రివర్గంలోకి వస్తారని ఆ వార్తల సారాంశం. ‘జగన్‌’ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అన్ని విషయాల్లో కీలకంగా వ్యవహరిస్తోన్న ‘సజ్జల’ తనపై పడ్డ రాజ్యాంగేతర శక్తి అనే అపవాదును తుడిచేసుకోవడానికి మంత్రివర్గంలో చేరాలని భావిస్తున్నారట. వాస్తవానికి ఇటీవల కాలంలో ఆయన రాజ్యసభకు వెళతారని వార్తలు వచ్చాయి. అయితే తనకు రాజ్యసభకు వెళ్ళే ఉద్ధేశ్యం లేదని, రాష్ట్రంలోనే కొనసాగుతానని, తనకు మంత్రి పదవి ఇస్తే తనపై ప్రచారం చేస్తోన్న వారికి సమాధానం చెప్పినట్లు అవుతుందనే భావనతో ఆయన మంత్రి పదవిని కోరారని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వంలో అన్ని విషయాల్లో ఆయనే కీలకంగా వ్యవహరిస్తున్నారు. సమస్య ఏదైనా, ప్రభుత్వ పాలసీ అయినా, ఉద్యోగుల సమస్యలు అయినా, పోలీసుశాఖ విషయం కానీ, విషయం ఏదైనా ముఖ్యమంత్రి కన్నా ముందే ‘సజ్జల’ వద్దకు వెళుతుంది. ఆయన దానికి పరిష్కారం కనుగొని తరువాత ముఖ్యమంత్రి వద్దకు విషయాన్ని తీసుకెళుతున్నారు. దీంతో ఆయన రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలతో పాటు, పార్టీలోని కొంత మంది నాయకులు అంతరంగిక సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు. మంత్రి పదవి తీసుకుంటే ఇక ఇటువంటి వ్యాఖ్యలకు అవకాశం ఉండదని ముఖ్యమంత్రి కూడా భావిస్తున్నారట. మొత్తం మీద ‘సజ్జల’ త్వరలో మంత్రి కానున్నారని తెలుస్తోంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ