‘బిజెపి’తో ‘పవన్’ తెగతెంపులు..!?
మంగళగిరిలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో ‘పవన్‌కళ్యాణ్’ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నాయి. ‘జగన్’ వ్యతిరేక ఓటు చీలిపోకుండా తాను కృషి చేస్తానని, అన్ని పార్టీలను ఒక దారిలోకి తెచ్చుకుని అధికార వైకాపాను వచ్చే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిస్తామని అన్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే తమతో పొత్తులో ఉన్న ‘బిజెపి’ తనకు ఓ రోడ్‌మ్యాప్ ఇవ్వాలని ఆయన కోరారు. మొదట్లో ఆయన రోడ్‌మ్యాప్ అన్న మాటను రాజకీయపార్టీలు, నాయకులు రకరకాలుగా అర్థం చేసుకున్నారు. టిడిపితో పొత్తు విషయంలో ‘పవన్’ ‘బిజెపి’ని రోడ్‌మ్యాప్ అడిగారని కొందరు, మూడు పార్టీలు కలిసిపోటీ చేసే విషయం గురించి వారిని ఒప్పించడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని మరి కొందరు భావించారు. అయితే ఇప్పుడు ‘రోడ్‌మ్యాప్’ అంటే అసలు అర్థం తెలుసుకుని ‘బిజెపి’ నాయకులు కిందా మీదా అవుతున్నారు. ‘రోడ్‌మ్యాప్’ అంటే ‘జగన్’ విషయంలో ఏవిధంగా వ్యవహరిస్తారో ‘బిజెపి’ తేల్చుకోవాలన్న భావన ఉండడంతో ‘బిజెపి’లోని కొందరు నాయకులు ఈ విషయంపై నోరెత్తడం లేదు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తనకా విషయం తెలియదని ‘పవన్’ ఏదైనా మాట్లాడుకోవాలంటే అగ్రనేతలతో మాట్లాడుకోవాలని అన్నారు. అంతే కాకుండా ‘టిడిపి’తో కలిసిపోటీ చేసే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. దీంతో ఇప్పటికిప్పుడు ‘పవన్’ అడిగిన రోడ్‌మ్యాప్‌ను బిజెపి విడుదల చేయదు.
‘పవన్’ ఉద్దేశ్యంలో ‘రోడ్‌మ్యాప్’ అంటే ‘జగన్’ పార్టీతో ‘బిజెపి’ పెద్దలు కుదుర్చుకున్న లోపాయికారి ఒప్పందాలే. రాష్ట్రంలో ‘జగన్’ ఏం చేస్తున్నా, ఎన్ని అక్రమాలకు పాల్పడుతున్నా, వ్యవస్థలను అడ్డగోలుగా వాడుతున్నా..ఎడాపెడా అప్పులు చేస్తున్నా, రాజధాని విషయంలో పిల్లిమొగ్గలు వేస్తున్నా, అభివృద్ధిని పట్టించుకోకుండా కేవలం సంక్షేమ కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇస్తూ ఓట్ల రాజకీయం చేస్తున్నా ‘బిజెపి’ కిమ్మనడం లేదు. ఆయనకు అన్ని విధాలుగా మద్దతు ఇస్తున్న బిజెపి పెద్దలు ఇక ఈ విషయంపై ఏమి చేస్తారో..తేల్చుకోవాలన్నదే ‘పవన్’ ఉద్దేశ్యంలో రోడ్‌మ్యాప్ అంటే. ‘బిజెపి’ ‘జగన్’తో సన్నిహిత సంబంధాలను ఇంకా కొనసాగించాలనే ఉద్ధేశ్యంతో ఉంటే తన దోవ తాను చూసుకుంటాననేదే ‘పవన్’ అభిప్రాయమని ప్రచారం జరుగుతోంది. ‘జగన్’పై ‘బిజెపి’పెద్దల ఒక నిర్ణయం తీసుకుంటేనే తాను రంగంలోకి వస్తానని, అలా కాకుండా ఇలా ముసుగులోనే వ్యవహారాలు నడిపితే తనకు నష్టం వస్తుందన్న భావన ‘జనసేన’ అధినేతలో ఉంది. ఒకవైపు ‘జగన్’ను అన్నిరకాలుగా ప్రోత్సహిస్తూ మరోవైపు తనను ఆయనపైకి ప్రయోగించడంలో ‘బిజెపి’ ఉద్ధేశ్యం ఏమిటో ‘పవన్’కు అర్థం కావడం లేదు. దీంతో ‘బిజెపి’ ఈ విషయంలో స్పష్టత ఇస్తే..తరువాత తాను ఏం చెయ్యాలో అది చేస్తానని ‘పవన్’ చెబుతున్నారట. అయితే ఇప్పటికప్పుడు తమకు అన్ని విధాలుగా సహకరిస్తోన్న ‘జగన్’ను వదులుకోవడానికి ‘బిజెపి’ సిద్ధంగా లేదు. దీంతో ‘పవన్’ అడిగిన రోడ్‌మ్యాప్‌ను బిజెపి ఇవ్వదు. ‘బిజెపి’ తనతోనూ, ‘జగన్’తోనూ ఆడుకుంటుందని, ఎన్నికల వరకూ ఇలాగే చేసి, తనతో పొత్తుపెట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చి ‘జగన్’కు బిజెపి మేలు చేస్తుందేమోనన్న సందేహం ‘పవన్’లో ఉంది. అలా చేస్తే రాజకీయంగా తాను కనుమరుగు అవుతాననే భావన ‘పవన్’లో ఉంది. మొత్తం మీద..‘జగన్’ విషయంలో స్పష్టత ఇవ్వకుండా ఇలాగే ముసుగు వ్యవహారాలను ఇంకా కొనసాగిస్తే ‘బిజెపి’తో ‘పవన్’ తెగతెంపులు చేసుకోవడం ఖాయమనే అభిప్రాయం ఆయన సన్నిహిత వర్గాల ద్వారా వ్యక్తం అవుతోంది.