WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

డికె భూముల్లో చేపల చెరువులా...!?

వంద ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా...!

నిబంధనలకు విరుద్ధంగా చేపల పెంపకం..!

మానవ వ్యర్థాలు,మురుగునీరుతో చెరువుల నింపకం...!

వినుకొండ పట్టణంలోనే అరాచకం...!

చెరువు వద్ద వ్యక్తుల అనుమానాస్పద మృతి...!

పట్టించుకోని అధికార గణం...!

అమ‌రావతి:తాము పేదవారిమని, బతుకుతెరువు లేదని...ప్రభుత్వం దయతలచి భూమి ఇస్తే వాటిలో పంటలు పండించుకుని బతుకుతామని ప్రభుత్వ భూములు పొందిన కొందరు..తరువాత ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి...ఆ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా చెరువులు తవ్వి చేపల పెంపకాన్ని చేపట్టారు. అదీ మానవులు విసర్జించిన వ్యర్థాలు, కలుషిత మురుగునీరుతోనే ఈ చేపల పెంపకాన్ని చేపట్టారు. దాదాపు 40సంవత్సరాల నుంచి ఈ అరాచకం పట్టణంలో జరుగుతున్నా ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదు..అటు రెవిన్యూ అధికారులు కానీ..ఇటు మత్స్యశాఖ అధికారులు కానీ దీనిపై స్పందించడం లేదు.


వినుకొండ పట్టణంలోని 771/5.1ఎ. య.2.52 సెంట్లు..771/5 1బి 2.52 సెంట్లు, 771/5 1.సి 2.52 సెంట్ల భూమి ప్రభుత్వానికి చెందిన పోరంబోకు భూమి. ఈ భూమిని అప్పట్లో భూములు లేని పేదలకు ప్రభుత్వం మంజూరు చేసింది. వాస్తవానికి భూములు పొందిన వారు దీనిలో పంటలు పండించుకుని కుటుంబాన్ని పోషించుకోవాల్సి ఉంది. అయితే ప్రభుత్వ ఉద్దేశాలకు తూట్లు పొడుస్తూ ఈ భూముల్లో చెరువులను తవ్వి చేపల పెంపకాన్ని చేపట్టారు సదరు లబ్దిదారులు. 'పూజారి బాల' అనే వ్యక్తి దీనిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ముందుగా డికె భూములను పొందిన ఇతను తరువాత మరి కొందరి భూములను కారుచౌకగా తన పేరున రాయించుకుని చేపల చెరువులతో చేపల వ్యాపారం ప్రారంభించారు. తనకు ప్రభుత్వం కేటాయించిన భూమితో పాటు మరో వంద ఎకరాలు ఇతన తన అధీనంలో ఉంచుకుని చేపల వ్యాపారం నిర్వహిస్తూ కోట్లాది రూపాయలను కూటబెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి.


వినుకొండ పట్టణ శివారులోని నూజెండ్ల వెళ్లు రహదారి రైల్వే ట్రాక్‌ పక్కనే ఉన్న ముట్లకుంట చెరువు ఉంది. పట్టణంలోని మానవులు విసర్జించిన వ్యర్థాలు, మురుగునీరు కాల్వల ద్వారా వచ్చే నీటిని ఈ చెరువుకు  తరలిస్తున్నారు. తీవ్ర కలుషితమైన నీటిలోనే చేపల పెంపకాన్ని చేపడుతున్నారు. విషమయమైన జలాలతో పెంచిన చేపలను తిన్న వారు పలువురు అనారోగ్యానికి గురవుతున్నారు. వాస్తవానికి చేపల చెరువుల త్రవ్వకానికి ప్రభుత్వం అనుమతితో పాటు మత్స్యశాఖ అనుమతి అవసరం. అయితే వీరెవరి అనుమతులు ఈ  చెరువులకు లేవు. పట్టణం నుంచి వచ్చే వ్యర్థ జలాలు పట్టణంలో ఉన్న ముట్లకుంట చెరువుకు చేరతాయి.ఈ చెరువుకు పెద్ద కరకట్ట ఏర్పాటు చేసి సదరు వ్యక్తులు చేపల పెంపకాన్ని చేపట్టారు. చేపలు పట్టుకునేందుకు వలలు, పడవలు, చెరువుకు కాపాలా కాసేందుకు వ్యక్తులు, చేపలకు ఆహారం సరఫరాచేసేందుకు కూలీలు, కాపాలాదారులను ఏర్పాటు చేసుకున్నారు. బయట వ్యక్తులను ఇక్కడకు రాకుండా ఫోటోలు తీయకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్నారు. ఎటువంటి సురక్షితమైన చేపల పెంపక విధానాలు చేపట్టకుండా...మురుగునీటిలోనే చేపలను పెంచుతూ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. చిన్న కుంటను తవ్వాలంటేనే సవాలక్ష నిబంధనలతో అడ్డుకునే ప్రభుత్వాధికారులు..ఇక్కడ మాత్రం వందల ఎకరాల్లో చేపల చెరువులు తవ్వుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారన్న ప్రశ్నకు వారి వద్ద నుంచి సమాధానం రావడం లేదు. చేపల చెరువులు ఏర్పాటు చేయాలంటే రెవిన్యూశాఖ అనుమతితో పాటు మత్స్యశాఖ అనుమతి అవసరం. అంతే కాకుండా కొంత మంది సభ్యులు మత్స్యకారులుగా ఉండాల్సి ఉంటుంది. వారంతా కలసి ఒక సొసైటీని ఏర్పాటు చేసుకోవాలి. వారందరూ ఇదే వృత్తిపై జీవించేవారయి ఉండాలి...మున్సిపాల్టీ, గ్రామ పంచాయితీ సభ్యుల తీర్మానం కూడా ఉండాలి. ప్రతి ఏటా అధికారుల సమక్షంలో వేలం పాటలు నిర్వహించి..అందులో కొంత భాగాన్ని మున్సిపాల్టీ/గ్రామ పంచాయితీకి చెల్లించాలి..నిబంధనలు ఈ విధంగా ఉంటే...అవేవీ పట్టించుకోకుండా...యధేచ్చగా చెరువుల తవ్వుకుని చేపల పెంపకం చేసి వాటిని హైదరాబాద్‌, విజయవాడ వంటి ప్రాంతాలకు తరలించి సొమ్ములు చేసుకుంటున్నారు సదరు వ్యక్తులు. ఇప్పటికే ఈవిషయంపై పలు పత్రికల్లో కథనాలు వచ్చినా సదరు అధికారులు స్పందించడం లేదు.కొంత మంది అధికారులు మాత్రం వారి వద్ద నుండి లంచాలు తీసుకుని...'ఏదో చేసుకుంటున్నారుగా...చేసుకోనీయండి...' అంటూ సులభంగా తీసివేస్తున్నారు.


గతంలో ఇదే చెరువు వద్ద ఓ వ్యక్తి మరణించడం సంచలనం సృష్టించింది. మసీదు మాన్యంలో నివసిస్తున్న 'వెంకటేష్‌' అనే వ్యక్తిని చెరువులో దింపి అతని మృతికి వీరు కారణమయ్యారనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. 'వెంకటేష్‌'కు మద్యం తాగించి...చెరువులోని తూమును ఎత్తడానికి దించారని...అయితే చెరువులో ఉన్న బురదలో అతను కూరుకుపోయి మరణించారని వారి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే అతని మృతి వివాదం అవుతుందని భావించిన ఈ అక్రమణదారులు వెంటనే వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి లక్షల్లో ముట్టచెప్పారని ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంలో పోలీసు శాఖ ఉన్నతాధికారులు కూడా కీలకంగా వ్యవహరించారని, వారు కూడా చేపల చెరువుల యాజమాన్యం వద్ద నుంచి భారీగా లాగారని ప్రచారం జరుగుతోంది. ఆ వ్యక్తి మృతితోనే ఇది ఆగిపోలేదు. తరువాత మరి కొందరు కూడా మృత్యువాతపడ్డారని తెలుస్తోంది.అయినా ఇక్కడ ప్రభుత్వ అధికారులు ఎవరూ స్పందించడం లేదు. దీనికంతటికీ కారణం వారందరికీ చెరువు యాజమాన్యం నెల నెలా మామూళ్లు ఇవ్వడమనే ఆరోపణలు వస్తున్నాయి. కాగా ఈ చెరువులో వ్యర్థ జలాల వల్ల కలుషితమైన నీరు వల్ల ఇక్క దుర్గంతం వ్యాపిస్తోంది. ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే సామాన్య ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. దోమలు, విషపురుగులు భారీగా చేరి వారిని అనారోగ్యానికి గురి చేస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు అనారోగ్యం వల్ల చనిపోయారని...వెంటనే ఈ చెరువుకు సంబంధించిన తూమును బద్దలు కొట్టి మురుగు నీరును వదిలిపెట్టాలని ఇక్కడ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. దీని వల్ల తాము నిత్యం భరిస్తోన్న దుర్గధం నుంచి విముక్తిపొందుతామని అంటున్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. కాగా ఇప్పుడిప్పుడే వినుకొండ పట్టణం బాగా విస్తరిస్తుందని, దీనిలో భాగంగా అనేక మంది రియల్‌ఎస్టేట్‌ వ్యాపారాలు ఇక్కడ వెంచర్లు వేస్తున్నారని, చెరువు వల్ల వ్యాప్తి చెందుతున్న దుర్గంధం వల్ల వీటిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదట. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడీ చెరువు వల్ల కాలుష్యం అయిపోయిందనే ఆరోపణలు సర్వత్రా వ్యాప్తిచెందుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దీనిపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


(348)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ