WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సోషల్‌మీడియాలో 'బిజెపి'కి ఎదురుగాలి...!

'నీవు నేర్పిన విద్యే నీరజాక్షి' అన్నట్లు బిజెపి నేర్పిన బాటలోనే కాంగ్రెస్‌ పయనిస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు సోషల్‌మీడియాను ఆధారంగా చేసుకుని కాంగ్రెస్‌ పార్టీపై చెలరేగిపోయిన బిజెపిపై ఇప్పుడు కాంగ్రెస్‌ అదే అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ సోషల్‌మీడియాను బాగా వాడుకుంటూ అధికార బిజెపిపై విరుచుకుపడుతుంది. కాంగ్రెస్‌ చేస్తోన్న ప్రచారానికి నెట్‌జన్లు నుంచి అనూహ్యమైన మద్దతు లభిస్తోంది. గత మూడున్నర సంవత్సరాల బిజెపి పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, మోడీ ఆయన మంత్రివర్గ సహచరులు ప్రచారానికే పరిమితమయ్యారని, ఈ మూడేళ్లలో వాళ్లు చెప్పుకోదగిన పని ఒకటీ చేయలేదని విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్‌కు మద్దతుగా ఓ టీం  సోషల్‌మీడియాలో ప్రచారం నిర్వహిస్తోంది. ఈ ప్రచారం అధికార బిజెపికి చికాకులు సృష్టిస్తోంది. చివరకు ఈ ప్రచారంపై బిజెపి జాతీయ అధ్యక్షుడు 'అమిత్‌షా'కు బెంబేలు ఎత్తిపోతున్నారు. ఇటీవల ఆయన అహ్మదాబాద్‌లో బిజెపి కార్యకర్తలతో సమావేశమైనప్పుడు సోషల్‌మీడియాలో కాంగ్రెస్‌ చేస్తోన్న ప్రచారం గురించి చర్చకు వచ్చింది. ఆ ప్రచారాన్ని పట్టించుకోవద్దని...కార్యకర్తలు మనస్సు పెట్టి పనిచేయాలని సూచించారు. నిన్న మొన్నటి దాకా బిజెపి మాత్రమే సోషల్‌మీడియా హల్‌చల్‌ చేసేది. ముఖ్యంగా యువత, ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాలను సోషల్‌మీడియా ప్రచారం ద్వారా ఆకట్టుకున్న 'బిజెపి'పై ఇప్పుడు అదే వర్గాలు విరుచుకుపడుతున్నాయి. నోట్లరద్దు, జిఎస్‌టి, పెట్రోలియం ఉత్పత్తులు ధరలు, టెలికాం రంగంలో అవినీతి, బొగ్గుగనుల వేలం తదితర అంశాలపై కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ప్రచారం మధ్యతరగతిని ఆకట్టుకుంటోంది.

  ముఖ్యంగా ప్రధాని మోడీ, ఆయన మంత్రివర్గ సహచరులు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, రక్షణశాఖమంత్రి 'నిర్మలాసీతారామన్‌', రాజనాథ్‌సింగ్‌, విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. ట్విట్టర్‌లో ప్రతి గంటకు 18 ట్వీట్లు ప్రధాని మోడీకి వ్యతిరేకంగా వస్తుండగా అదే స్థాయిలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి వ్యతిరేకంగా వస్తున్నాయి. ఈ ట్వీట్లు పలుసార్లు నెట్‌జెన్‌లు రీట్వీట్‌ చేస్తున్నారు. అరుణ్‌జైట్లీ తరువాత బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు వ్యతిరేకంగా ట్వీట్లు వస్తున్నాయి. ఆయన తరువాత స్థానంలో నిర్మలా సీతారామన్‌, రాజ్‌నాథ్‌సింగ్‌, సుష్మాస్వరాజ్‌లు ఉన్నారు. అభివృద్ధి పేరుతో బిజెపి పిచ్చెక్కిస్తోందన్న 'కాంగ్రెస్‌' ప్రచారం రోజురోజుకు ఊపందుకుంటోంది.

   గత సెప్టెంబర్‌ 14 నుంచి 30 వరకు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, గుజరాత్‌ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పలువురు నెట్‌జన్‌లు విరుచుకుపడుతున్నారు. గతంలో వీరికి అనుకూలంగా స్పందించే నెట్‌జన్‌లు ఇటీవల కాలంలో వారికి వ్యతిరేకంగా మెమ్స్‌, వైరల్‌ వీడియోలు, వ్యంగ్య చిత్రాలను నెట్‌లో షేర్‌ చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా సోషల్‌మీడియాలో బిజెపిపై కాంగ్రెస్‌ పైచేయి సాధించింది. నిన్న మొన్నటి దాకా సోషల్‌మీడియాలో రారాజుగా ఉన్న 'బిజెపి' ఇప్పుడా స్థానాన్ని కాంగ్రెస్‌కు సునాయాసంగా కోల్పోయింది. ప్రజల మద్దతును అనూహ్యంగా కోల్పోతున్న బిజెపి.... సోషల్‌మీడియా మద్దతు కోల్పోవడం సహజమేనని 'త్రిపాఠీ' అనే సోషల్‌మీడియా వ్యక్తి తెలిపారు.


(158)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ