WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జగన్‌' బాటలోనే 'అమిత్‌షా' కుమారుడు...!

మన దేశంలో రాజకీయ పార్టీల నాయకుల వారసులు...వారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే వారు చేసే వ్యాపారాలు ఒక్కసారిగా వృద్ధి చెందుతాయి. అధికారంలోకి లేనప్పుడు...కనీసం ఉండడానికి ఇళ్లు కూడా లేని పరిస్థితులు..ఒక వేళ ఇళ్లు ఉన్నా..అవి తాకట్టులో ఉండే పరిస్థితులు ఉంటాయి. వారు కనుక ఒక్కసారి అధికారంలోకి వచ్చారంటే...ఇక వారి వ్యాపారాలు జెట్‌ స్పీడ్‌లో దూసుకెళతాయి. ఇది కేవలం కొందరిని ఉద్దేశించి మాత్రమే కాదు...దేశంలోని అన్ని రాజకీయపార్టీల పరిస్థితి ఇంచుమించూ అంతే...! దీనికి ఎటువంటి మినహాయింపులు లేవు... కాంగ్రెస్‌,బిజెపి వంటి జాతీయ పార్టీలైనా...కమ్యూనిస్టులైనా...చివరకు ప్రాంతీయపార్టీల నాయకులైనా ఇంతే...! నిన్నటి దాకా తాము నీతిమంతులం...అని ఒకటే కథలు చెప్పిన కాషాయినేతల బండారం ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తమ మూడేళ్ల పాలనలో ఒక్క కుంభకోణం లేదని విర్రవీగిన బిజెపి పెద్దలు...ఇప్పుడు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కుమారుడు 'జయ్‌ అమిత్‌షా'పై వచ్చిన ఆరోపణలపై సమాధానం చెప్పకుండా ఎదురు దాడి చేస్తోంది. మూడేళ్ల క్రితం ఆయన కుమారుడి సంస్థలు నష్టాల్లో ఉండగా ఇప్పుడు మాత్రం అమాంతం 16 వేల రెట్లు వృద్ధితో దూసుకుపోయాయి. ఇదెలా సాధ్యమో చెప్పమంటే కేసులు వేస్తామని కాషాయి దళాలు బెదిరిస్తున్నాయి.

  గతంలో ఆంధ్రప్రదేశ్‌లో కీ.శే.వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుమారుడు వై.ఎస్‌.జగన్‌ ఆస్తులు ఏ విధంగా పెరిగాయో...ఆయన రాత్రికి..రాత్రికి అపర కుభేరుడు ఎలా అయ్యాడో...అదే రీతిలో ఇప్పుడు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కుమారుడు కూడా కోటీశ్వరుడయ్యారు. వై.ఎస్‌.అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎడాపెడా దోపిడీకి పాల్పడి ఆస్తులు పోగేసుకున్న 'జగన్‌'కు 'అమిత్‌షా' కుమారునికి పెద్ద తేడాలేదు. నాడు పారిశ్రామికవేత్తలకు అడ్డగోలుగా ప్రయోజనాలు కల్పించి...వారి చేత తన బోగస్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించుకుని తండ్రీకొడుకులు ఆస్తులు సంపాదించుకున్నారు. రాత్రికి రాత్రి కంపెనీలు సృష్టించి వాటి ద్వారా వచ్చిన నిధులను మళ్లించుకుని 'వై.ఎస్‌. ఆయన తనయుడు' వేలాది కోట్ల రూపాయలు సంపాదించారని కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికీ ఆ కేసులుపై ఇంకా కోర్టుల్లో విచారణ జరుగుతూనే ఉంది. ఈ కేసుల విషయంలో వై.ఎస్‌.జగన్‌ కొన్నాళ్లు జైలులో కూడా ఉన్నారు. అక్రమాస్తులకు సంబంధించి కొన్ని కేసుల్లో రుజువులు కూడా సంపాదించింది సీబీఐ. కొన్ని ఆస్తులను కోర్టులు అటాచ్‌చేశాయి. అయినా తాను నీతిమంతుడిని అన్న రీతిలో వై.ఎస్‌.జగన్‌ చెప్పుకుంటున్నారు. తనకు ఇన్ని కోట్ల ఆస్తులు ఎక్కడ నుంచి వచ్చాయో చెప్పమంటే మాత్రం చెప్పకుండా...కాంగ్రెస్‌, చంద్రబాబు తనపై కుట్ర చేసి కేసులు పెట్టించారని సాకులు చెపుతుంటారు. ఒకప్పుడు తనకు ఉన్న అప్పులను తీర్చడానికి ప్రభుత్వం ఇచ్చిన జాగాను అమ్ముకోవాలని వై.ఎస్‌ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. అదే వై.ఎస్‌ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలోనే దేశంలోనే అత్యంత ధనవంతుడిగా కుమారుని తీర్చిదిద్దారు. అధికారం లేనప్పుడు ఆస్తులు అమ్ముకోవాలని భావించిన ఆ కుటుంబం...అధికారం దక్కిన తరువాత మాత్రం అత్యంత ధనిక కుటుంబంగా మారిపోయింది. ఇదంతా ఎలా జరిగిందంటే అధికార మహిమే...! ఇప్పుడు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కుమారుడు కూడా 'జగన్‌'ను ఫాలో అవుతున్నారు. అదెలాగో చూడండి..!


   'అమిత్‌షా' కుమారుడు 'జైఅమితాభాయి షా' 'టెంపుల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌' అనే కంపెనీకీ డైరెక్టర్‌గా ఉన్నారు. 2014 ఎన్నికలకు ముందు ఈ కంపెనీ తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయిందని ఆ కంపెనీ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌(ఆర్‌సి)కు ఇచ్చిన నివేదిక స్పష్టం చేస్తోంది. 2012-13లో ఈ కంపెనీ రూ.6230/- లాస్‌లో ఉన్నట్లు చూపించారు. టర్నోవర్‌ మాత్రం చూపించలేదు. అదే 2013-14లో రూ.1724 నష్టాల్లో ఉన్నట్లు తెలపగా 2014-15 సంవత్సరంలో రూ.18,728/- లాభాల్లో ఉన్నట్లు చూపించి, అదే సమయంలో టర్నోవర్‌  రూ.50,000/-లుగా చూపించారు. ఇక 2015-16 సంవత్సరంలో లాభ నష్టాలను చూపించకుండా ఏకంగా వార్షిక టర్నోవర్‌ రూ.80,50,00,000/-లు చూపించారు. అంటే ఇది  16వేల రెట్ల వృద్ధి. గత రెండేళ్లలో ఇంత వృద్ధి ఎలా సాధ్యమయిందన్న ప్రశ్నకు అధికార పార్టీ నుంచి సమాధానం రావడం లేదు. 2015-16 సంవత్సరాల్లో అంత టర్నోవర్‌ సాధించిన కంపెనీ హఠాత్తుగా తన వ్యాపారాన్ని మూసేసింది. ఎందుకు ఒక్కసారిగా ఈ కంపెనీ మూతపడింది. 16వేల రెట్ల అభివృద్ధి సాధించిన సంస్థ ఒక్కసారిగా మూతపడే అవకాశమే లేదు. మరి ఇది ఎందుకు జరిగిందంటే దీనిలో అక్రమాలు ఎక్కడ బయటపడతాయనే భయంతోనే ఈ విధంగా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. రాత్రికి రాత్రి కోట్లు కంపెనీల్లోకి దొర్లించి...మళ్లీ అదే సమయంలో వెనక్కు తసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై విచారణ జరిపించమంటే...విచారణ కాదు కదా...వార్త రాసిన వారిపై కేసులు పెడతామని 'బిజెపి' బృందం బెదిరిస్తోంది. అంతే కాకుండా వార్త రాసిన సంస్థపై వంద కోట్ల పరువు నష్టం దావా వేస్తామని చెబుతోంది. గతంలో వై.ఎస్‌ కూడా ఇదే విధంగా బెదిరించేవారు..ఇప్పుడు 'అమిత్‌షా' కూడా అదే రూట్‌ను ఎన్నుకున్నారు. మొత్తం మీద అధికార పార్టీ వారసులు చేస్తున్న వ్యాపారాలు రాత్రికి రాత్రే వేల రెట్లు అభివృద్ధి సాధిస్తుండగా...సామాన్యులు, ఎటువంటి రాజకీయ అండలేని వ్యాపారస్తులు మాత్రం నష్టాల బారిన పడి కంపెనీలు మూతవేసుకుంటున్నారు. అంతా 'మోడీ' బిజెపి పెద్దల దయ...!


(388)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ