WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'వెల్‌కమ్‌'తో 'టిడిపి'కి అనర్థమే...!

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోసారి 'టిడిపి'పై నైతికంగా విజయం సాధించారు. తాజాగా కెసిఆర్‌ విసిరిన వలలో టిడిపి నేతలు అడ్డంగా దొరికిపోయారు. రాజకీయంగా తాను ఎంత ముందుగా ఆలోచిస్తారో...తాజాగా ఆయన తెరపైకి తెచ్చిన 'వెల్‌కమ్‌'తో అర్థమవుతోంది. తెలంగాణలో 'రెడ్డి' వర్గం తనకు పూర్తిగా దూరం అయిన నేపథ్యంలో దాదాపు 20 నుంచి 30 నియోజకవర్గాల్లో గెలుపోటములపై ప్రభావం చూపనున్న 'కమ్మ' వర్గంపై ఆయన దృష్టిపెట్టారు. 'కమ్మ'లను దగ్గరకు తీస్తున్నట్లు వ్యవహరించి, టిడిపితో పొత్తు పెట్టుకోబోతున్నట్లు ఆ వర్గాలకు సంకేతాలు పంపించారు. ఈ సంకేతాలు ప్రస్తుతం తెలంగాణ టిడిపిని సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. కొందరు తెలంగాణ టిడిపి నేతల అత్యుత్సాహం, స్వార్థం కూడా దీనికి కారణం అవుతున్నాయి.

  తెలంగాణలో టిడిపి పని అయిపోయిందని ప్రచారం చేస్తూ ఇప్పటికే టిడిపిని దెబ్బకొట్టిన కెసిఆర్‌..తాజా ప్రచారంతో టిడిపిని పూర్తిగా నేలమట్టం చేయబోతున్నారు.రాబోయే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌తో..టిడిపి పొత్తు వల్ల టిడిపికే నష్టం ఎక్కువనే విషయం...తెలంగాణలో ఎవరినడిగినా చెబుతారు. ఎందుకంటే ఇప్పటికే ప్రజల ఆగ్రహాన్ని తీవ్రంగా చవిచూస్తున్న టిఆర్‌ఎస్‌  వల్ల టిడిపికి మేలు జరిగే పరిస్థితి లేదు. అంతే కాకుండా నాయకులు ఎంత మంది ఫిరాయించినా...టిడిపి ద్వితీయ శ్రేణులు ఇంకా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నాయి. వారంతా టిఆర్‌ఎస్‌ వ్యతిరేకులే...ఇటువంటి కార్యకర్తల మనోభిష్టానికి వ్యతిరేకంగా పొత్తుకు వెళితే కాస్తా కూస్తో మిగిలిన పార్టీ పూర్తిగా పతనం ఖాయం. ఒకవేళ టిఆర్‌ఎస్‌తో టిడిపి పొత్తు పెట్టుకున్నా టిడిపికి కెసిఆర్‌ ఇచ్చే స్థానాలు ఎన్ని. మహా అయితే పది నుంచి పదిహేను ఇస్తాడేమో...! అదీ కష్టమే...కెసిఆర్‌తో బేరం ఆడగల శక్తి తెలంగాణ టిడిపి నాయకులు ఉందా...? ఈ సీట్ల కోసం పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా చంపేయాల్సిన అవసరం ఏముంది...? ఒంటరిగా పోటీ చేస్తే ఈ మాత్రం సీట్లు టిడిపి ఎలాగూ సాధించగలదు. కాంగ్రెస్‌,టిఆర్‌ఎస్‌ హోరాహోరి పోరులో ఈ సీట్లే నిర్ణయాత్మకశక్తిగా కాగలవు. అయితే ఇవన్నీ వదిలేసి...'వెల్‌కమ్‌' పేరిట పొత్తు అంటూ వెంపర్లాడడం టిడిపికి హితవు చేయదు.

    2009లో కొంత మంది టిడిపి నాయకుల స్వార్థం కోసం టిఆర్‌ఎస్‌తో బలవంతంగా పొత్తు పెట్టుకుని పార్టీ తీవ్రంగా నష్టపోయింది. అప్పటి తెలంగాణ టిడిపి నాయకులు 'ఎర్రబెల్లి దయాకర్‌రావు, కంభంపాటి రామ్మోహన్‌రావు, గరికపాటి రామ్మోహన్‌రావు, సిఎం రమేష్‌ వంటి నేతలు తమ స్వార్థం కోసం పొత్తు పెట్టుకోవాలని టిడిపి అధినేత చంద్రబాబునాయుడుపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. కొందరు పొత్తు పెట్టుకోకపోతే తాము పార్టీని వీడిపోతామని బెదిరించారు. వీరి బెదిరింపులతో భయపడిన 'చంద్రబాబు' నాడు టిఆర్‌ఎస్‌తో పొత్తుకు ఓకే అన్నారు. అయితే దీన్ని అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి బాగా వాడుకున్నారు. ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న ఆంధ్రా ప్రజలను టిఆర్‌ఎస్‌,టిడిపి పొత్తును బూచిగా చూపించారు. తెలంగాణ వస్తే హైదరాబాద్‌లో ఆంధ్రాప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటారని, హైదరాబాద్‌ రావాలంటే పాస్‌పోర్టులు తీసుకోవాల్సి ఉంటుందని ప్రచారం నిర్వహించారు. దీంతో ఆంధ్రా ప్రాంతంలో టిడిపి గణనీయంగా నష్టపోయింది. టిఆర్‌ఎస్‌తో అప్పుడు కనుక పొత్తు ఉండకపోతే ఆ ఎన్నికల్లో టిడిపి గెలిచి ఉండేది...లేకపోతే కాంగ్రెస్‌కు సమానమైన సీట్లు సాధించి ఉండేది. కాని వ్యక్తుల స్వార్థం కోసం, తమ వ్యాపారాల కోసం టిఆర్‌ఎస్‌తో వెళతామని పోరిన వారి వల్ల తీవ్ర నష్టం జరిగిపోయింది. ఇది చివరకు రాష్ట్ర విభజనకు కూడా కారణమైంది. ఇప్పుడూ అదే విధంగా ఈ వ్యక్తుల తమ స్వార్థ ప్రయోజనాల కోసం 'వెల్‌కమ్‌' పేరిట నాటకాలు ఆడుతున్నారు.

   ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో కెసిఆర్‌ వేసిన ఎత్తులతో పాటు, తెలంగాణలో తమ స్వార్థ ప్రయోజనాలను కాపాడుకోవాలనుకునే 'కమ్మ' వర్గం నేతలు, 'కమ్మ' వ్యాపారస్తులు మరోసారి పార్టీని తాకట్టుపెట్టబోతున్నారనే విమర్శలు పార్టీలో వినిపిస్తున్నాయి. దీని వల్ల కేవలం తెలంగాణలోనే పార్టీ దెబ్బతినదని, ఆ ప్రభావం ఆంధ్రా రాజకీయాలపై కూడా ఉంటుందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో 'రెడ్డి' సామాజికవర్గాన్ని అడ్డుకోవడానికే 'కెసిఆర్‌' 'వెల్‌కమ్‌'ను సృష్టించారని,దీని వల్ల 'రెడ్డి' సామాజికవర్గంలో ఓ అభద్రత, ఆందోళన, అదే సమయంలో కసి పెరిగిపోయాయని, రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ వర్గం అధికారానికి దూరంగా ఉందని, ఎలాగైనా అధికారం సాధించి తీరాలన్న కాంక్ష వారిలో పెరిగిపోతోంది. 'రెడ్డి' సామాజికవర్గంలో రోజు రోజుకు పెరిగిపోతున్న ఐక్యత వల్ల...అది ఆంధ్రాలోనూ ప్రభావం చూపే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల దాకా 'ఆంధ్రా'లో 'రెడ్డి' సామాజికవర్గం 'జగన్‌'పై ఆశలు వదిలేసుకుని టిడిపితో వెళ్లిపోవడానికి మానసికంగా సిద్ధం అయిపోయింది. 'జగన్‌' పంచన ఉన్న నేతలు కూడా ఆయనపైనమ్మకం లేక టిడిపిలో చేరుతున్నారు. అయితే ఆ వర్గానికి చెందిన సామాన్య కార్యకర్తలు, సానుభూతిపరులు ఇంకా 'జగన్‌' వైపే ఉన్నా..ఇప్పుడిప్పుడే ఆయనను వదలి టిడిపి వైపు అడుగులేస్తున్నారు. ఇటువంటి సమయంలో కెసిఆర్‌ సృష్టించిన కులాల కుంపటి ప్రభావం ఆంధ్రా తెలుగుదేశంపై తీవ్రంగా పడే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై అధినేత 'చంద్రబాబు' ఒక స్పష్టమైన నిర్ణయానికి రావాల్సి ఉంది. కొందరు వ్యక్తుల స్వార్థం కోసం సృష్టించిన 'వెల్‌కమ్‌' నుంచి పార్టీ క్యాడర్‌ను బయట పడేయాల్సిన అవసరం ఉంది. ఒక వేళ ఇదే ప్రచారానికి అధినేత ఊతమిస్తే మరోసారి 2009 ఫలితాలు పునరావృతం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


(528)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ