WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సీనియర్‌ ఐఎఎస్‌ల్లో భారీగా మార్పులు..చేర్పులు...!

రవాణా,రోడ్లు,భవనాలశాఖ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ కేంద్ర సర్వీసులకు వెళ్లిన మహిళా అధికారి స్థానంలో అదనపు బాధ్యతలను సిసిఎల్‌ఎ 'పునీతా'కు అప్పచెప్పడం జరిగింది. అంతకు ముందు సచివాలయంలో సర్వీసుశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ కేంద్ర సర్వీసులకు వెళ్లారు 'కిశోర్‌'. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ రెండు పోస్టులను ప్రభుత్వం త్వరలో భర్తీ చేయనుంది. సిఎం కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 'సతీష్‌చంద్ర' శిక్షణ కోసం వెళ్లారు. ఆయన తిరిగి వచ్చాక ఈ పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ రెండు పోస్టులను భర్తీ చేయాలంటే మరి కొంత మంది సీనియర్‌ ఐఎఎస్‌లను బదిలీ చేయాల్సి ఉంటుంది. శాఖాధిపతిగా ఎవరిని నియమించాలనే విషయంపై ఎటువంటి స్పష్టత రావడం లేదు. కార్మికశాఖాధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న 'నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌'కు ఆయన హోదాకు తగ్గపోస్టు ఇవ్వాల్సి ఉంటుంది. 

  కార్మికశాఖకు కార్యదర్శి హోదాలో ఉన్నవారు మాత్రమే ఇంతకు ముందు బాధ్యతలు నిర్వహించారు. అదే విధంగా కొంత మంది శాఖాధిపతులు తమను బదిలీ చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిసింది. ఎవరెవరు ఆ విధంగా కోరారో..బయటకి పొక్కనప్పటికీ కొంత మంది శాఖాధిపతులపై ఆగ్రహంగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని బదిలీ చేయాలని భావిస్తున్నారు. ఎవరెవరికి ఏ శాఖాధిపతిగా నియమించాలనే విషయంపై గతంలో చర్చ జరిగినా ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నవారిలో (అవినీతి ఆరోపణలు, అక్రమాలకు పాల్పడని ఆరోపణలు లేని వారు) కొందరికి ప్రాధాన్యత కలిగిన పోస్టులు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 'దినేష్‌కుమార్‌' సిఎంఒ ప్రత్యేక కార్యదర్శి సతీష్‌చంద్రతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులు ఆలోచిస్తున్నారు. యువజనులు, క్రీడల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి.సుబ్రహ్మణ్యంను అదే పోస్టులో కొనసాగించే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఆయనకు ప్రాధాన్యత కలిగిన పోస్టు వచ్చే అవకాశం లేదు. సిసిఎల్‌ఎగా బాధ్యతలు నిర్వహిస్తున్న 'పునేతా'ను సచివాలయంలో శాఖాధిపతిగా నియమిస్తే ఆయన స్థానంలో మరో సీనియర్‌ ఐఎఎస్‌ అధికారిని నియమించాల్సి ఉంటుంది. ఇందులో ఖాళీగా ఉన్న పోస్టును భర్తీ చేసినా, కొంత మంది శాఖాధిపతులను తప్పించినా, అనేక మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంటుంది. దీనిపై వచ్చేవారంలో కానీ స్పష్టత రాదు.

(274)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ