WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మంత్రి 'పుల్లన్న'ను లెక్కచేయని 'రామ్‌గోపాల్‌'...!

ఆంధ్రప్రదేశ్‌ పౌరసరఫరాల సంస్థలో అవినీతి విలయతాండవం చేస్తుందని, ఆ సంస్థ ఎండి 'రామ్‌గోపాల్‌' పేరుతో కోట్లాది రూపాయలు అక్రమంగా వసూలు చేయటం జరిగిందని, ఆ సంస్థకు చెందిన నిధులు కూడా దుర్వినియోగం అయ్యాయని, సిఎంఒకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇంత వరకు దానిపై ఎటువంటి విచారణ కానీ,వివరాలు తెలుసుకునేందుకు కానీ ఈ శాఖను పర్యవేక్షించే సిఎంఒ అధికారి పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. శాఖకు మంత్రిగా ఉన్న 'పుల్లారావు' ఆదేశాలను కానీ, సూచనలను కానీ ఎండి 'రామ్‌గోపాల్‌' పట్టించుకోవడం లేదు. ఒక్కోసారి మంత్రి ఆయనను పిలిచినా మంత్రి కార్యాలయానికి ఆయన రావడం లేదట. సిఎంఓ అధికారి అత్యంత సన్నిహితంగా 'రామ్‌గోపాల్‌' మెలుగుతుండడంతో మంత్రి పుల్లారావు కూడా వెనకడుగేస్తున్నారు. ఈ రెండేళ్లలో ఆ సంస్థలో జరిగిన నిధుల దుర్వినియోగం, ఇతర అక్రమాలపై దర్యాప్తు జరిపితే వెలుగులోకి రాని విషయాలు బయటకు రావడం ఖాయం. 

  సంస్థ ఎండి 'రామ్‌గోపాల్‌' పేరిట జరుగుతున్న వసూళ్ల కార్యక్రమం ఆయనకు తెలిసి జరుగుతుందా...? తెలియకుండా జరుగుతుందా? అనే విషయంపై ఏ ఒక్కరూ పెదవి విప్పడం లేదు. సిఎంఓ అధికారి అండదండలతో 'రామ్‌గోపాల్‌' మంత్రి పుల్లారావును కూడా ఖాతరు చేయకపోవడం, ఆ అధికారి వ్యవహారశైలిని, ఆ సంస్థలో జరుగుతున్న ఆరోపణలు, నిధుల దుర్వినియోగంపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాల్సిన మంత్రి పుల్లారావు దానిపై మౌనం వహిస్తున్నారు. ఇంతకు ముందే 'రామ్‌గోపాల్‌'ను బదిలీ చేయాలని ముఖ్యమంత్రి భావించినప్పటికీ ఆఖరు నిమిషంలో సిఎంఒ అధికారి అడ్డుపడ్డారని ప్రచారం జరిగింది. ఆధారాలతో ఫిర్యాదులు చేసినా, కోట్లాది రూపాయల నిధుల దుర్వినియోగం జరుగుతున్నా ముఖ్యమంత్రి దృష్టికి ఏ ఒక్కరూ తీసుకెళ్లడం లేదు..మంత్రిపుల్లారావు పట్టించుకోవడం లేదు.(మంత్రంటే 'రామ్‌గోపాల్‌'కు లెక్కలేదు) పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ ఆ సంస్థ ఎండిగా 'రామ్‌గోపాల్‌'నే కొనసాగించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

(137)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ