WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'సర్వశిక్ష'కు 'సరైనోడు'...!

సమర్థుడైన పాలకులకు...సమర్థులైన, నిజాయితీపరులైన అధికారులు దొరికితే అద్బుతాలు సృష్టిస్తారు. అటువంటి సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో అటువంటి అరుదైన సందర్బాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు ఆశయాలకు అనుగుణంగా సర్వశిక్షాఅభియాన్‌ సంస్థ అద్బుతాలు సృష్టిస్తోంది.ఈ అద్బుతాలను సాధించడంలో ఆ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ జి.శ్రీనివాస్‌ ఎంతోగానో కృషి చేశారు. రాష్ట్ర సర్వశిక్షాఅభియాన్‌ డైరెక్టర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఆ శాఖలో గణనీయమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వివిధ వినూత్న కార్యక్రమాలతో ఆయన శాఖను అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళుతున్నారు. ఆయన చేస్తున్న కృషికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచీ అవార్డులు,రివార్డులూ దక్కుతున్నాయి. తాజాగా వచ్చిన అవార్డు అదే కోవలోనిదే. దేశంలోనే సంక్షేమ పథకాల అమల్లో ఎపి సర్వశిక్షా అభియాన్‌కు తొలి ర్యాంక్‌ దక్కింది. మొత్తం గ్రేడింగ్‌ కోసం పది అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ర్యాంక్‌ను ప్రకటించారు. పది అంశాల్లో 91శాతం పురోగతి సాధించి ఆంధ్రప్రదేశ్‌ తొలి ర్యాంక్‌ను ఎగరేసుకుపోయింది. తరగతి వారీగా విద్యార్థులు నేర్చుకున్న అంశాలను నోటీస్‌బోర్డులో ప్రదర్శించడం, విద్యార్థుల వివరాలను ఆధార్‌కు అనుసంధానించడం, ప్రభుత్వ-ప్రైవేట్‌ పాఠశాలల మధ్య అనుసంధానం, ఎలిమెంటరీ పాఠశాలల ఉపాధ్యాయుల ఫోటోలను స్కూలు గోడలపై అతికించడం, ప్రత్యేక అవసరాలుండే పిల్లలకు అవసరమైన పరికరాలు అందజేత, విద్యార్థులకు యూనిఫాం పంపిణీ, అవసరమైన పాఠ్యపుస్తకాలు అందించడం, ఉపాధ్యాయులకు సర్వీస్‌ ట్రైనింగ్‌, బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్చడం, స్కూళ్లకు విడుదలయ్యే గ్రాంట్‌ను అందించడం వంటివాటిపై పురోగతి ఆధారంగా కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఈ ర్యాంక్‌ను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌కు ఈ ర్యాంక్‌ రావడంలో ఈశాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ జి.శ్రీనివాస్‌ కృషే కారణమని అధికారవర్గాలతో పాటు, ఈ సంస్థ ఉద్యోగులు, వివిధ టీచర్ల సంఘాల నేతలు చెబుతున్నారు.

   నిజాయితీపరుడు, సమర్థుడు,సౌమ్యుడు,వివాదరహితుడైన అధికారిగా జి.శ్రీనివాస్‌కు అధికార వర్గాల్లో పేరుంది. మౌనంగా ఆయన తన పని తాను చేసుకుంటూ పోతారు. లక్ష్యాలను పెట్టుకుని పనిచేయటం..వాటిని సాధించే క్రమంలో ఎన్ని అవరోధాలు వచ్చినా తట్టుకుని ముందుకెళ్లడం ఆయన నైజం. మొదటి నుంచీ సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్న ఆయన సర్వశిక్షాఅభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌గా మరింత సమర్థవంతంగా పనిచేస్తున్నారు. శాఖ పనితీరుపై ఎప్పటికప్పుడు మదింపు వేసుకుంటూ..ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఆయనే ముందుంటూ లక్ష్యాలను సాధిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కస్తూరా స్కూల్‌ పనితీరు, ఉపాధ్యాయుల సర్వీసును మెరుగుపర్చడం, విద్యార్థులకు యూనిఫామ్స్‌ సరిగా అందించడం, విద్యార్థుల్లో నేర్చుకునే అభిలాషను పెంపొందింపచేయటం, వారు నేర్చుకున్న విషయాలపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించడం వంటి వాటిపై దృష్టిసారించారు.

   ముఖ్యంగా బాలికల చదువుపై ఆయన ప్రత్యేక శ్రద్ద చూపెట్టారు. వీరి కోసం 'కస్తూరి' పేరిట దైమాసిక బాలికల విద్యాపత్రికను తీసుకొచ్చారు. దీని ద్వారా బాలికల చదువు ఎంత అవసరమో వివరిస్తున్నారు. అదే విధంగా బడిమానేసిన విద్యార్థుల కోసం మళ్లీ వారిని బడిబాట పట్టించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. వివిధ మాధ్యమాల ద్వారా వీరి చదువుపై ప్రత్యేక ప్రచారాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సినీనటి 'అమల' ద్వారా ఈ కార్యక్రమాలపై ప్రచారం చేయిస్తున్నారు. ఆమె చేస్తోన్న ప్రచారంపై ప్రజలను ఆకర్షిస్తోంది. అదే కాకుండా బాల్యవివాహాలపై నిర్వహిస్తోన్న ప్రచారం ఆకట్టుకుంటోంది. బాల్యవివాహాలపై ఆటోలపై నిర్వహించిన ప్రచారంపై మంచి స్పందన కనిపిస్తోంది. దీని ద్వారా పలు గ్రామాల్లో బాల్యవివాహాలను అధికారులు ఆపగలిగారు. తద్వారా వారిని మళ్లీ బడికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఎస్సీ,ఎస్టీ పిల్లల చదువుల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ద చూపిస్తున్నారు. వారికి చదువు అవసరాన్ని తెలిపే కార్యక్రమాలను విస్తృతంగానిర్వహిస్తున్నారు. అందరూ చదవాలి...అందరూ ఎదగాలనే నినాదం ప్రజల్లోకి బాగా వెళ్లింది. ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు అందుకు తగ్గట్లు కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తున్నారు. వారిని బడికి రప్పించేందుకు ప్రత్యేక వాహనాలను కూడా సమకూరుస్తున్నారు. ఆదర్శ పాఠశాల విషయంలో 'శ్రీనివాస్‌' తీసుకున్న శ్రద్ధపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆదర్శపాఠశాల విద్యార్థుల యూనిఫామ్‌ దగ్గర నుంచి వారికి ప్రత్యేకంగా ఇంగ్లీషులో ఇస్తున్న శిక్షణ కూడా ఆకట్టుకుంటోంది. ప్రైవేటు విద్యాసంస్థలకు తీసిపోని రీతిలో ఆదర్శపాఠశాలలను తీర్చిదిద్దారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు ఆంగ్లంలో ప్రత్యేక బోధనా తరగతలు నిర్వహిస్తున్నారు. ఇవే కాకుండా బడిమానేసిన పిల్లలను మళ్లీ బడికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వివిధ గ్రామాల్లో బడిమానేసి చిన్న చిన్న పనులు చేస్తోన్న చిన్నారులను మళ్లీ బడికి రప్పిస్తున్నారు. వారికి అవసరమైన తిండి, వసతి, ఇతర అవసరాలకు ఆగమేఘాలపై తీరుస్తున్నారు.

  ఇవే కాకుండా రాష్ట్రంలోని వివిధ సర్వశిక్షాఅభియాన్‌ కేంద్రాలను ఎప్పటికప్పుడు సందర్శించడం, అక్కడ పనిచేయని వారిని క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి వెనుకాడడం లేదు శ్రీనివాస్‌. ఎవరైతే విధులను సరిగా నిర్వర్తించరో వారిపై ఎటువంటి శభిషలకు తావులేకుండా వేటు వేస్తున్నారు. కొందరిపై తీసుకుంటున్న క్రమశిక్షణా చర్యల వల్ల మిగతా వారు కూడా  తమ విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారు. తాను ఎటువంటి పరిస్థితుల నుంచి వచ్చానో..ఆ పరిస్థితులను మరిచిపోకుండా తన వంటి విద్యార్థులను పైకి తేవడానికి శ్రమిస్తున్నారు ఆయన. అతి పేదరికం నుంచి వచ్చిన ఆయన తన మూలాలను ప్రతి ఒక్కరికీ వివరిస్తూ, చదువు ఆవశ్యకతను వివరిస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు చదువు అవసరాన్ని ప్రత్యేకంగా వివరించి చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక ఉదాశీనమైన పనిగా కాకుండా దానిపైనే మనసా,వాచా,కర్మణా దృష్టిపెట్టి పనిచేస్తున్నారు శ్రీనివాస్‌. ఈ పనిలోనే ఆయన ఆనందాన్ని వెతుకుంటున్నారు. ఇతర ఐఎఎస్‌ అధికారుల వలే ఆడంబరాలకు పోకుండా, నిరాడంబరంగా, క్రమశిక్షణతో పనిచేస్తూ రాష్ట్రాన్నికి దేశస్థాయిలో నెంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందించారు ఆయన. ఆయన కృషిని ఇప్పుడు ప్రభుత్వంతో పాటు, సాటి ఐఎఎస్‌ అధికారులు కూడా ప్రశంసిస్తున్నారు. ఇంతకు ముందు ఇదే సర్వశిక్షాఅభియాన్‌లో పనిచేసిన అధికారులే 'శ్రీనివాస్‌' చూడడానికి నెమ్మదస్తుడిలా ఉంటారు..భలే పనిచేస్తున్నారే...అని ఆశ్చర్యపోతూ ప్రశంసలు కురిపిస్తున్నారు. రాష్ట్రానికి డిప్యూటేషన్‌ వచ్చిన ఆయన ఇతర ఐఎఎస్‌ అధికారులకు మార్గదర్శకంగా ఉంటుందంటే అతిశయోక్తి లేదేమో..!


(429)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ