లేటెస్ట్

‘మోహన్‌బాబు’ను మోసం చేసిందెవరు..!?

వివాదాస్పద నటుడు, వివాదాలకు దగ్గరగా ఉండే ‘మోహన్‌బాబు’ తనను కొందరు మోసం చేశారని ఒకటే బాధపడిపోతున్నాడు. తనను అందరూ వాడుకున్నారని, తన సేవలను వాడుకుని తరువాత తనను పట్టించుకోవడం లేదని ఆయన బాధపడిపోతున్నారు. సినిమాల్లో హీరోగా, విలన్‌గా,సహాయనటుడిగా పలుపాత్ర చేసిన ఆయన మంచి నటుడిగా పేరుతెచ్చుకున్నారు. దాసరి నారాయణరావు ఆశీస్సులతో సినీరంగంలో ఎదిగిన ఆయన తరువాత ‘ఎన్టీఆర్‌’ వద్దకు చేరారు. ఎన్టీఆర్‌తో ‘మేజర్‌ చంద్రకాంత్‌’ సినిమా నిర్మించి గొప్ప హిట్‌ కొట్టారు. 1994 అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఆయన ‘టిడిపి’కి ప్రచారం చేశారు. అందుకు ప్రతిఫలంగా ఆయనను ‘ఎన్టీఆర్‌’ రాజ్యసభకు పంపించారు. ఎన్టీఆర్‌ నుంచి చంద్రబాబు పగ్గాలు అందుకున్నప్పుడు ఆయన ‘చంద్రబాబు’కే మద్దతు పలికారు. అయితే అందుకు కూడా ప్రతిఫలం పొందారు. అయితే ఆ తరువాత ఎందుకో ‘చంద్రబాబు’తో ఆయనకు విభేదాలు వచ్చాయి. దాంతో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చారు. అసలు తెలుగుదేశం పార్టీనే తనదని, ‘చంద్రబాబు’ పార్టీని లాక్కున్నారని అప్పట్లో ఆయన ఆరోపించారు. ఆ తరువాత ‘చంద్రబాబు’తో సర్దుకుపోయారు.


2004 ఎన్నికల్లో ‘చంద్రబాబు’ ఓడిపోయిన తరువాత ‘మోహన్‌బాబు’ ‘రాజశేఖర్‌రెడ్డి’కి టచ్‌లోకి వెళ్లారు. అదే సమయంలో రాజశేఖర్‌రెడ్డి తమ్ముడి కుమార్తెతో తన కుమారుడి పెళ్లి జరిపించి ‘వై.ఎస్‌’ కుటుంబానికి బంధువు అయ్యారు. 2014 ఎన్నికల ముందు వైకాపాకే ఆయన మద్దతు పలికారు. అయితే ఆ ఎన్నికల్లో వైకాపా ఓడిపోయింది. అయినా అప్పటి నుంచి ‘జగన్‌’తో బాగానే ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు తన విద్యాసంస్థలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదని, ‘చంద్రబాబు’ ప్రభుత్వం విద్యావ్యవస్థను నాశనం చేసిందని ఆరోపిస్తూ నడిరోడ్డుపై పడుకుని నిరసన తెలియచేశారు. ఆయనే కాకుండా ఆయన పుత్రరత్నాలు కూడా ఆయనకు మద్దతుగా రోడ్డుపైకి వచ్చారు. ఎన్నికల ముందు ‘జగన్‌’ చేత వైకాపా కండువా వేయించుకున్నారు. ఆ ఎన్నికల్లో తనకు ‘జగన్‌’ పోటీ చేసే అవకాశం ఇస్తారేమోనని ఎదురుచూశారు. అయితే ‘జగన్‌’ ముందు ఆయన ఆటలు సాగలేదు. టిక్కెట్‌ రాకపోయినా ‘మోహన్‌బాబు’ ఆయన కుటుంబం వైకాపా గెలుపుకోసం గట్టిగానే పనిచేశారు. ఇటువంటివారి కృషి, ఒకసారి చూద్దామనుకున్న ప్రజల ఆలోచనతో ‘జగన్‌’ బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చారు.


తన బంధువు అధికారంలోకి వచ్చినా ‘మోహన్‌బాబు’కు ఒరిగిందేమీలేదు. విద్యాసంస్థలకు రావాల్సిన బకాయిలు రాలేదు. ఈ విషయంపై ‘జగన్‌’ను కలవాలని భావించినా అక్కడ నుంచి అపాయింట్‌మెంట్‌రాలేదు. దీనిపై ఏబీఎన్‌ రాధాకృష్ణ ఇంటర్వ్యూలో ‘మోహన్‌బాబు’ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే..అంతా అధికారులు చేశారు..‘జగన్‌’కు ఏమీ తెలియదని తనను తాను ఓదార్చుకున్నారు. తనతోపాటు ఎన్నికల్లో ప్రచారం చేసిన, ఇతరత్రా సహాయం చేసిన వారందరినీ ఏదో పదవితో అందలం ఎక్కించిన ‘జగన్‌’ తనకు మాత్రం మొండిచేయి చూపడంతో ఏమి చేయాలో తోచక ‘మోహన్‌బాబు’ దిక్కులు చూస్తున్నారు. ‘జగన్‌’ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా..తననే దేకకుండా పక్కన పెట్టడంతో ఏమీ చేయలేక, ఆయనను ఏమీ అనలేక, అంటే ఏమి జరుగుతుందో ఆయనకు బాగానే తెలుసు..అందుకు అందరూ తనను వాడుకుని మోసం చేశారని నర్మగర్భవ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో అయితే ‘చంద్రబాబు’పై ఒంటికాలిపై వెళ్లే ‘మోహన్‌బాబు’ ‘జగన్‌’ను ఏదైనా అనాలంటే జడుసుకుంటున్నారు. మొత్తం మీద..మోసం చేసినవారెవరో..ఆయనకు తెలుసు..అయినా పైకిచెప్పుకోలేని అసహాయత ఆయనిది. ఏమి చేస్తాం చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ