WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సరైన సమయంలో 'రాహుల్‌'కు పట్టాభిషేకం...!

కలసివచ్చే సమయం వచ్చినప్పుడు...నడిచొచ్చే పుత్రుడు జన్మిస్తాడనట్లుంది...ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పరిస్థితి. నిన్న మొన్నటి దాకా మరో ఐదేళ్లు...లేదా మరో పదేళ్ల దాకా హస్తిన అధికారంపై ఆశలు వదిలేసుకున్న 'రాహుల్‌'కు కాలం కలసి వచ్చింది. ఆశించకుండానే అధికారం వెలగబెట్టమని..అశేషభారతావని...'మోడీ'ని నమ్మి అధికారం అప్పగిస్తే...పాలించడం చేతకాక.. అసత్యాలతో, అర్థసత్యాలతో నిత్యం ప్రజలకు నరకం చూపిస్తున్న ఆయనకు ప్రత్యామ్నాయం 'రాహుల్‌బాబే' అన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. ఇదే అదనులో పార్టీ పగ్గాలు చేపట్టి...ప్రధాని పదవి చేపట్టాలని 'రాహుల్‌' సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.

  పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న 'రాహుల్‌గాంధీ'కి పార్టీ అధ్యక్ష పదవి అప్పచెప్పడానికి కాంగ్రెస్‌ శ్రేణులు సిద్ధమైపోయాయి. ఇప్పటికే రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్‌ శాఖలు ఆయనకు అధ్యక్షపదవి ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానం చేశాయి. న్యూఢిల్లీలో వివిధ రాష్ట్రాలకు చెందిన శాఖలు ఇప్పటికే సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఆయనకు మద్దతుగా తీర్మానాలు చేశాయి. వీటిలో ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ఢిల్లీలు కూడా ఉన్నాయి. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా తనయునికి పదవి ఇవ్వడంపై ప్రకటన చేశారు. అన్ని రాష్ట్రశాఖలు దీనిపై ఎన్నికలు నిర్వహించుకుని చివరకు అధ్యక్షుడిని ఎన్నుకుంటారని ఆమె తెలిపింది. రాజస్థాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు 'సచిన్‌ పైలట్‌' పిటిఐతో మాట్లాడుతూ దీపావళి తరువాత కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడిగా 'రాహుల్‌గాంధీ' పగ్గాలు స్వీకరిస్తారని తెలిపారు. దీనిపై పార్టీలో ఎవరూ అభ్యంతరం చెప్పడం లేదని ఆయన అన్నారు. కాగా మరో సీనియర్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షపదవి పోటీపడే వారు ఇద్దరే పార్టీలో ఉన్నారని వారు తల్లి కానీ లేదా కుమారుడు మాత్రమేనన్నారు.

అనుకూల సమయం...!

ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్‌ ఎంపిక అయితే...నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి అధ్యక్ష పదవిని చేపట్టిన ఐదోవారు అయితారు ఆయన. 132 సంవత్సరాల సుధీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీకి సోనియాగాంధీ తరువాత 'రాహుల్‌' పగ్గాలు అందుకోబోతున్నారు. సోనియాగాంధీ మొత్తం మీద 19 సంవత్సరాలు కాంగ్రెస్‌కు అధ్యక్షురాలిగా ఉన్నారు. దానిలో 10సంవత్సరాలు ఆమె యుపీఎ ఛైర్‌పర్సన్‌గా కూడా వ్యవహరించారు.. రాహుల్‌ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం లాంఛనమైన నేపథ్యంలో ఆయన పదవిని నిర్వహించడం అంత తేలికేమీ కాదు. గత సార్వత్రిక ఎన్నికల నుంచి పార్టీ రోజు రోజుకు పతనం అంచున జారీపోతోంది.తొలిసారిగా రాజ్యసభలో ఆ పార్టీకి ఉన్న ఆధిక్యతను ఇటీవలే పోగొట్టుకుంది. కాగా 'రాహుల్‌' పగ్గాలు చేపట్టే సమయానికి ఎన్‌డిఎ ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఆయనకు కలసివచ్చే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత ఆరు మాసాలుగా జిడిపి రేటు తగ్గిపోవడం, ధరలు పెరగడం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీని 'మోడీ' నెరవేర్చకపోవడం, వ్యాపారుల్లో విశ్వాసం కొరవడడం, జిఎస్‌టి వల్ల వారిలో రోజు రోజుకు పెరిగిపోతున్న అసహనం, అసంతృప్తిగా మారడం, నోట్ల రద్దు వల్ల వచ్చిన నష్టం ఇంకా తగ్గకపోవడం వంటి కారణాలతో 'మోడీ'పై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. గత మూడున్నరేళ్ల 'మోడీ' పాలనా కాలంలో తొలిసారిగా ఆయన తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీన్ని అవకాశంగా మలచుకోవడానికి 'రాహుల్‌' ప్రయత్నించాలి.

పార్టీలో సీనియర్ల నుంచి సవాళ్లు...!

కాంగ్రెస్‌ 'రాహుల్‌' అధ్యక్ష పదవికి ఎన్నిక కానుండడం ఖాయమైన నేపథ్యంలో ఆయనకు సీనియర్ల నుంచి ఎటువంటి సహకారం లభిస్తుందోన్న ప్రశ్న పార్టీ వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. అయితే నిన్న...మొన్నటి దాకా పార్టీలో రెండు అధికార కేంద్రాలు ఉండడంతో పార్టీ నాయకులు కొంత అయోమంలో ఉండేవారు. కానీ ఇప్పుడా ప్రశ్నే ఉత్పన్నం కాదు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు 'రాహుల్‌' చేతికి వచ్చిన తరువాత ఆయన పార్టీపై పూర్తి పట్టుసాధించడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇన్నాళ్లూ పార్టీలో పెత్తనం చేసిన సీనియర్లు ఇప్పుడు  రాహుల్‌తో ఎలా వ్యవహరిస్తారనే అంశంపై పార్టీలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇన్నాళ్లూ వీరంతా 'సోనియా' చుట్టూచేరి పార్టీని భ్రష్టుపట్టించారనే ప్రచారం ఉంది. కాగా అధ్యక్ష పదవిని 'రాహుల్‌'కు ఇచ్చిన తరువాత 'సోనియా' ఎటువంటి బాధ్యతలు నిర్వహిస్తారనే దానిపై పార్టీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇది ఎలా ఉన్నా...అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత నుంచి 'రాహుల్‌' పార్టీను పునర్‌నిర్మాణం చేయనున్నారని, ఫలితాలు సాధించేవారికే పెద్దపీట వేస్తారని ఆయన వర్గం ప్రచారం చేస్తోంది.

18 మాసాల్లో 11ఎన్నికలు...!

అంతా అనుకున్న ప్రకారం జరిగితే రాబోయే 18 మాసాల్లో 'రాహుల్‌గాంధీ' 11 ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. దీపావళి తరువాత జరగనున్న 'హిమాచల్‌ప్రదేశ్‌', గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలను 'రాహుల్‌' నేతృత్వంలో కాంగ్రెస్‌ పోరాడనుంది. రెండు దశాబ్దాల తరువాత 'సోనియా' లేకుండా ఎదుర్కొంటున్న మొదటి ఎన్నికలు ఇవి. నవంబర్‌ 9న జరగనున్న 'హిమాచల్‌ప్రదేశ్‌' అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రజలను వ్యతిరేకతను తట్టుకోవాల్సి ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి 'వీరభద్రసింగ్‌'పై పలు అవినీతి ఆరోపణలతో పాటు, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. అయినా ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే మళ్లీ 'వీరభద్రసింగే' ముఖ్యమంత్రి అవుతారని 'రాహుల్‌' ప్రకటించారు. కాగా గుజరాత్‌లో మోడీ-షా బృందం ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. తమ స్వంత రాష్ట్రంలోని ఎన్నికలను వీరిద్దరూ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. కాంగ్రెస్‌ మాత్రం అంతకలహాలతో సతమత మవుతుంది. ఇప్పటికే సీనియర్‌ నేత శంకర్‌సింగ్‌వాఘేలా పార్టీని వదలిపెట్టి వెళ్లిపోయారు. ఈ పరిస్థితుల్లో 'రాహుల్‌గాంధీ' నాయకత్వానికి మరోసారి పరీక్ష ఎదురుకానుంది. ఇవే కాక మరో ఎనిమిది రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలు కూడా ఆయనకు సవాల్‌ లాంటివే. రాజస్ధాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌, కర్ణాటకల్లో గత రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్‌, బిజెపిలు ఎదురెదురుగా పోరాడుతున్నాయి. తరువాత జరగబోయే లోక్‌సభ ఎన్నికలు 'రాహుల్‌'కు చావో...రేవో లాంటివి. ఆయనే కాంగ్రెస్‌ ప్రధాని అభ్యర్థిగా రంగంలోకి దిగనున్నారు.

'మోడీ' వ్యతిరేకుల ఐక్యత సాధించాలి...!

దేశంలో రోజు రోజుకు 'మోడీ'పై వ్యతిరేకత పెరిగిపోతున్న సమయంలో ఆయన వ్యతిరేకులను ఒక గొడుగు కిందకు తీసుకురావడంలో 'రాహుల్‌' ఎంత వరకు విజయం సాధిస్తాడనే దానిపై 2019 ఎన్నికల్లో ఆయన విజయం ఆధారపడి ఉంది. 2015లో జరిగిన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌,ఆర్‌జెడి,జెడి-యు ఒక జట్టుగా పోరాడి బిజెపిని ఓడించాయి. అయితే ఆ తరువాత అదే ఐక్యతను కొనసాగించలేక చతికలపడ్డాయి. పైగా 'మోడీ'కి వ్యతిరేకంగా జట్టు కడతారని భావించిన 'బీహార్‌' ముఖ్యమంత్రి 'నితీష్‌కుమార్‌' బిజెపితో పొత్తుపెట్టుకోవడం 'రాహుల్‌'కు మింగుడుపడని పరిణామమే. గతంలో 'సోనియా' పదేళ్ల పాటు దేశంలోని వివిధ రాజకీయపార్టీలను కూడగట్టి యుపిఎ పేరిట దేశాన్ని పాలించింది. 2014 ఎన్నికల తరువాత కూడా 'సోనియా' ఇదే తరహాలో ఎన్సీపీ అధినేత శరత్‌పవార్‌, డిఎంకె చీఫ్‌ కరుణానిధి, టిఎంసి చీఫ్‌ మరియు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి 'మమతాబెనర్జీ' ఎస్‌పి నాయకుడు ములాయంసింగ్‌యాదవ్‌,బీఎస్పీ అధినేత మాయావతి, ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌ వంటి వారితో కలిసి నడవడానికి ప్రయత్నాలు చేసి సఫలీకృతురాలైంది. మరి ఇటువంటి సీనియర్‌ నేతలతో 'రాహుల్‌' ఎలా సఖ్యత సాధిస్తారో చూడాల్సి ఉంది.

ఎత్తుకుపై ఎత్తులు...!

ఎన్నికల వ్యూహాల్లో ఎత్తుకు పై ఎత్తులు వేసే నరేంద్రమోడీ,షాలను ఎదుర్కోవడానికి వారికి మించి వ్యూహాలను 'రాహుల్‌' రచించాలి. 2002 నుంచి 2014 ఎన్నికల వరకు ఈ ద్వయం వరుసగా విజయాలు సాధిస్తూనే ఉంది. అటువంటి వారిని అడ్డుకోవడం 'రాహుల్‌'కు శక్తికి మించిన పనే. అయితే ఈ ద్వయం గత మూడున్నరేళ్ల నుంచి సాగిస్తున్న పాలనపై ప్రజల్లో పెరిగిపోతున్న అసంతృప్తే 'రాహుల్‌'కు వరం కానుంది. రాబోయే రోజుల్లో ఈ అసంతృప్తి మరింత పెరిగిపోవడం ఖాయం కనుక..ఇదే అవకాశాన్ని ఉపయోగించుకుని 'రాహుల్‌' ఎగబాకాలి. వచ్చిన అవకాశాన్ని వృధా చేసుకోకుండా, అన్ని శక్తులను మొహరించి, అందరినీ కూడగట్టుకుని పదవి అందుకుంటారో..లేదో చూడాలి మరి.

(దావులూరి హ‌నుమంత‌రావు)


(350)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ