లేటెస్ట్

ఆంధ్రప్రదేశ్‌ పత్రిక ఆగిపోయిందా...!?

రాష్ట్ర సమాచార,పౌర సంబంధాలశాఖ ప్రచురిస్తోన్న ఆంధ్రప్రదేశ్‌ మాసపత్రిక ఆగిపోయిందా..? ఆ పత్రిక ప్రచురుణకు నోచుకోవడం లేదా..? అంటే లేదనే సమాధానం వస్తోంది. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత...ఈ పత్రిక జూన్‌ మాసంలో ప్రచురించారు. అయితే జూన్‌ మాసంలో పత్రిక కవర్‌ పేజీపై సిఎం 'జగన్‌' ఫొటోను అభ్యంతరకరంగా ప్రచురించారని, దీనికి ఆ పత్రిక ఎడిటర్‌ కందుల రమేష్‌ కారణం..అంటూ..ముద్రించిన పత్రిక కవర్‌ పేజీని తిరిగి ముద్రించి పంపిణీ చేశారు. ఈ విషయంలో సమాచారశాఖ కమీషనర్‌కు, అప్పటి పత్రిక ఎడిటర్‌ కందుల రమేష్‌కు మధ్య లేఖల యుద్ధం జరిగింది. ముఖ్యమంత్రి ఫొటో ప్రచురణ విషయంలో తన తప్పులేదని 'కందుల' వాదించగా...ఆయన కావాలనే చేశారని, సిఎంఒ వర్గాలు వాదించుకున్నాయి. ఈ నేపథ్యంలో 'కందుల'ను బలవంతంగా పత్రిక నుంచి గెంటేశారని ప్రచారం జరగగా, కాదు..తనంతట తానే రాజీనామా చేశానని 'రమేష్‌' చెప్పారు. ఈ వివాదం తరువాత..మళ్లీ పత్రిక ముద్రణ కాలేదు. జూన్‌లో పత్రిక ముద్రించగా...జూలైలో పత్రిక రాలేదు. ఆగస్టులో ఇంత వరకు బయటకు రాలేదు. మరి పత్రికను ముద్రించారో లేదో తెలియదు. అయితే గత నెలలో పత్రిక ముద్రించని మాట వాస్తవమేనని, 'కందుల' వివాదం తరువాత...పత్రిక ప్రచురణను తాత్కాలికంగా ఆపివేశారని ప్రచారం జరుగుతోంది. కాగా..పత్రిక ప్రచురణ నిలిపివేయడం తాత్కాలికమా..? లేక శాశ్వతమా..? అనేదానిపై ఆశాఖలో చర్చ జరుగుతోంది. మళ్లీ పత్రికను తీసుకు వస్తారని కొందరు చెబుతుండగా...ఇక పత్రికను ప్రచురించరని మరి కొందరు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ పత్రికను సమాచారశాఖ చాలా సంవత్సరాల నుంచి ప్రచురిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో ఈ పత్రికను ముద్రించేవారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన వర్తమాన అంశాలు, చరిత్ర, కథలు, కధానికలు, మనోవైజ్ఞానిక అంశాలతో పత్రిక పాఠకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు తయారయ్యే విధ్యార్థులు చాలా మంది ఈ పత్రిక కోసం ప్రతి మాసంలో ఎదురు చూస్తుంటారు. అదే విధంగా ఈ పత్రికకు భారీ స్థాయిలో చందాదారులు కూడా ఉన్నారు. వీరంతా గత నెలలో పత్రిక బయటకు రాకపోవడంతో...ఆ పత్రిక వస్తుందా..? రాదా..? అనే దానిపై చర్చించుకుంటున్నారు. 'కందుల' వివాదంతో...పత్రిక ముద్రణ ఆగిపోయిందని, మళ్లీ ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుందో అన్నదానిపై క్లారిటీ లేదు. ఏది ఏమైనా..పాఠకుల ఆదరణ ఉన్న పత్రిక మార్కెట్‌లోకి రాకపోవడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మరి సమాచారశాఖ అధికారులు దీనిపై స్పష్టత ఇస్తారో..లేదో చూడాలి మరి. 

(341)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ