లేటెస్ట్

'పట్టిసీమ' అవినీతిపై విచారణ లేదా...!?

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత..గత ప్రభుత్వ అవినీతిపై విచారణలు నిర్వహిస్తోంది. గత టిడిపి ప్రభుత్వం ప్రతి విషయంలో అవినీతికి పాల్పడిందని, దానిపై విచారణలు చేయిస్తున్నామని ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి నుంచి ఆయన క్యాబినెట్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర నాయకులు ముక్తకంఠంతో చెబుతున్నారు. పోలవరం, విద్యుత్‌ పిపిఎలు, పనికిఆహారపథకం, ఎన్టీఆర్‌ హౌసింగ్‌ ఒకటేమిటి..ప్రతి విషయంలో విచారణ చేయిస్తోన్న వైకాపా ప్రభుత్వం 'పట్టిసీమ' విషయంలో ఏమీ మాట్లాడకపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. టిడిపి ప్రభుత్వం 'పట్టిసీమ'ను నిర్మించే సమయంలో ఆ ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని పదే పదే ఆరోపించి, తాము ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకమని చెప్పిన వైకాపా పెద్దలు..ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత...ఆ ప్రాజెక్టులో జరిగిన అవినీతి గురించి మాట్లాడకపోవడంపై రాజకీయ వర్గాల్లో రకరకాలైన చర్చలు జరుగుతున్నాయి. 'పట్టిసీమ' ప్రాజెక్టులో వందల కోట్ల అవినీతి జరిగిందని అప్పట్లో ప్రతిపక్షనాయకుడిగా ఉన్న వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా దుమ్మెత్తి పోశారు. పలుసార్లు ఈ విషయంలో టిడిపి మంత్రులతో, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో వాగ్వివాదానికి దిగారు. 'పట్టిసీమ'లో వందలకోట్ల అవినీతి జరిగిందని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. కేవలం వైకాపా నాయకులే కాదు..బిజెపి కూడా అవినీతి జరిగిందని ఆరోపించింది. 

టిడిపి, బిజెపి పొత్తు విడిపోయిన తరువాత..ఈ ప్రాజెక్టును నిర్మించిన కాంట్రాక్టర్లును ఢిల్లీకి పిలిపించుకుని...దీనిలో ఎంత అవినీతి జరిగిందో చెప్పాలని కోరిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. 'పట్టిసీమ' అవినీతిపై నాడు..చించుకున్న వైకాపా, బిజెపిలు ఇప్పుడు ఆ ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరిపించకపోవడం ఉన్న మతలబు ఏమిటని..రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ ప్రాజెక్టును నిర్మించిన కాంట్రాక్ట్‌ సంస్థ ప్రస్తుత పాలకులతో సన్నిహిత సంబంధాలు, ఇతర వ్యాపారాలునిర్వహిస్తున్న నేపథ్యంలోనే దీని గురించి మాట్లాడడంలేదని టిడిపికి చెందిన కొందరు క్రింది స్థాయి నాయకులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద..పోలవరం ప్రాజెక్టు అవినీతిపై ఆగమాగం చేస్తోన్న వైకాపా ప్రభుత్వం..అప్పట్లో తాను అవినీతి జరిగిందని ఆరోపించిన 'పట్టిసీమ' ప్రాజెక్టుపై కూడా దృష్టి పెడితే బాగుంటుందనేది రాజకీయ విశ్లేషకుల భావన. చూద్దాం..మరి వైకాపా ప్రభుత్వం ఏమి చేస్తుందో...? 

(221)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ