WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఐదున్నరేళ్ల నుంచి ఒకేపోస్టులో అదే అధికారా...!?

ఏ జిల్లాలో అయినా జిల్లా స్థాయి అధికారిని మూడేళ్లు మాత్రమే కొనసాగిస్తారు...అంతకన్నా ఎక్కువ కొనసాగించేందుకు ఆ జిల్లా కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారులు అంగీకరించరు. కానీ కొంత మంది అధికారులు ఆ గడువు కన్నా ఎక్కువ సంవత్సరాలు గతంలో కొన్ని జిల్లాల్లో తిష్టవేశారు. ఆ తిష్టవేసిన వారి వివరాలు తెలుసుకున్న పాలకులు ఆగమేఘాలపై వారిని బదిలీ చేయటం జరిగేది. తాజా గుంటూరు జిల్లాలో ఒక అధికారి గత ఐదున్నరేళ్ల నుంచి ఒకే పోస్టులో పనిచేయటంపై రసవత్తరమైన చర్చ జరుగుతోంది. గుంటూరు జిల్లా డిఆర్‌ఒగా బాధ్యతలు నిర్వహిస్తున్న 'నాగబాబు' గత ఐదేళ్ల నుంచి ఇక్కడే తిష్టవేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో 'కన్నా లక్ష్మీనారాయణ' ఆదేశాలను తూ.చా తప్పకుండా పాటించి 'చంద్రబాబు' అభిమానులైన అధికారులను అనేక ఇబ్బందులు పెట్టారనే విమర్శ ఉంది. మంత్రులెవరైనా, కలెక్టర్లుగా ఎవరు జిల్లాకు వచ్చినా...వారిని ఏవిధంగా ఆకట్టుకుంటారో తెలియదు కానీ..వెంటనే వారికి అతుక్కుపోతారు 'నాగబాబు' ఎమ్మార్వో,ఆర్డీఓగా గతంలో ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఎమ్మార్వోలను బెదిరించి పనులను చక్కపెట్టడంలోనూ, ఖరీదైన కానుకలను తీసుకోవడంలో ఆయనది అందవేసిన చేయని విమర్శలు ఉన్నాయి. 'నాగబాబు' అవినీతి వివరాలు తెలుసుకున్న ఏసీబి అధికారులు కూడా ఆయనపై దృష్టిపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో కలెక్టర్‌గా కాంతీలాల్‌దండే, అంతకు ముందు మరో అధికారి, తాజాగా 'కోనశశిధర్‌'లను 'నాగబాబు' బుట్టలో వేసుకున్నారు. కావాల్సిన వారికి చేయవల్సిన పనులు చక్కపెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఐదున్నర సంవత్సరాల నుంచి అవినీతి ఆరోపణలు ఉన్న అధికారిని జిల్లాస్థాయి పోస్టు అయిన డిఆర్‌ఒగా కొనసాగించడంలో మంత్రులకు, అధికారులకు ఉన్న అనుబంధం ఏమిటి...? గత మూడేళ్ల నుండి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పుల్లారావుకు 'నాగబాబు' విషయం తెలిసినా ఎందుకో మౌనం వహిస్తున్నారు. నిన్నటి వరకు రెవిన్యూ అధికారుల బదిలీలు నిర్వహించిన ఆశాఖ మంత్రి కె.ఇ.కృష్ణమూర్తి 'నాగబాబు' వ్యవహారంపై దృష్టిసారించలేదు. 

  తాజాగా ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్‌,డిఆర్‌ఒ బదిలీల అధికారాలను ఆ శాఖ మంత్రి నుండి తప్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా చర్చించి బదిలీలు చేస్తున్నారు. మూడేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారందరినీ బదిలీ చేయగా 'నాగబాబు' విషయంలో ఏమీ జరగడం లేదు. సిఎంఒ అధికారుల ఆశీస్సులు తనకు ఉన్నట్లు 'నాగబాబు' చెప్పుకుంటున్నట్లు రెవిన్యూ ఉద్యోగులు చెబుతున్నారు. గత ఐదున్నరేళ్లలో 'నాగబాబు' అవినీతిపై విచారణ జరిపితే వెలుగులోనికి రాని మరెన్నో విషయాలు బయటపడతాయని అంటున్నారు రెవిన్యూ ఉద్యోగులు. తాసిల్దార్‌ల బదిలీలు, పోస్టింగ్‌ల్లో కలెక్టర్లను తప్పుదారి పట్టిస్తూ డిఆర్‌ఒ హోదాలో 'నాగబాబు' స్వంత లాభం చూసుకుంటున్నారనే విమర్శలు వచ్చాయి. కలెక్టర్లను ఏ విధంగా ఆకట్టుకుంటున్నారో...అదేవిధంగా అధికారపార్టీ నాయకులను ఆకట్టుకుంటున్నారు 'నాగబాబు'. ఈయన వ్యవహారాన్ని కొందరు అధికారపార్టీ ప్రజాప్రతినిధులను మీడియా వర్గాలు ప్రశ్నించగా 'ఆయన ఐదున్నరేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నారా..? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాజాగా తాసిల్దార్ల బదిలీలు, పోస్టింగ్‌ల్లో అధికారపార్టీ ప్రజాప్రతినిధులను 'నాగబాబు' తప్పుదారి పట్టిస్తున్నారని తెలుసుకున్న సీనియర్‌ ఎమ్మెల్యే ఒకరు ఆయనను అక్కడ నుంచి తప్పించాలని సిఎంఒ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. జిల్లాలో కీలకమైన రెవిన్యూశాఖలో డిఆర్‌ఒగా ఐదున్నరేళ్ల నుంచి కొనసాగించడం ఏమిటి...? ఇందులో ఎవరెవరికి ఏయే తాయిలాలు అందాయి...లేకుంటే చంద్రబాబును అభిమానించే అధికారులను 'కన్నా' మంత్రిగా ఉన్నప్పుడు ఇబ్బందులకు గురిచేసిన 'నాగబాబు' మళ్లీ అదేబాటలో నడుస్తున్నా అధికారపార్టీ వర్గాలు ఎందుకుమౌనం వహిస్తున్నాయని ఆ పార్టీ సానుభూతిపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా 'నాగబాబు'ను ఆ పోస్టు నుంచి తప్పించాలని, ముఖ్యమంత్రిని స్వయంగా కలిసేందుకు ఒక సీనియర్‌ ఎమ్మెల్యేతో పాటు టిడిపి నాయకులు కూడా రంగం సిద్దం చేసుకుంటున్నారు.(447)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ