ఆంధ్రాలో రిలయన్స్ రూ.65వేల కోట్ల పెట్టుబడులు...!
ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగిన వెంటనే, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారు. ఇవేవో ఆషా మాషీ కంపెనీలు కాదు. దేశంలోనే, అలా అంటే ప్రపంచంలోనే పేరెన్నికన్న టాటాలు, రిలయన్స్ వంటి సంస్థలు వేల కోట్లు ఆంధ్రాలో గుమ్మరించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ఒప్పందాలు కూడా చేసుకుంటున్నాయి. ఇప్పటికే టిసిఎస్ విశాఖపట్నంలో తమ కార్యాలయాన్ని పెట్టేందుకు అంగీకరించింది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ హోటళ్లను నిర్మించేందుకు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆ సంస్థ ఛైర్మన్ ఒప్పందాలను చేసుకున్నారు. అదే విధంగా ఇప్పుడు మరో దిగ్గజ సంస్థ రిలయన్స్ రాష్ట్రంలో దాదాపు రూ.65వేల కోట్లు పెట్టబడి పెట్టడానికి ముందుకు వస్తుంది.
ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో వారు సమావేశం అవుతారు. సమావేశం తరువాత వారు తాము పెట్టబోయే పరిశ్రమకు సంబంధించిన ఒప్పందాలను అధికారులతో చేసుకుంటారని ప్రముఖ ఆంగ్ల పత్రిక ది ఎకనమిక్స్ టైమ్స్ తెలియచేసింది. రిలయన్స్ వచ్చే ఐదేళ్లలో రూ.65వేల కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 500 బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయబోతోంది. దీని ద్వారా దాదాపు 2,50,000మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని సంస్థ ప్రతినిధులు, ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ముకేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీతో చర్చించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరింపచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పెట్టుబడుల విధానంలో బయోపుల్ ప్రాజెక్టులకు 20శాతం సబ్సీడీని ప్రకటించింది. అదే విధంగా రాష్ట్ర జీఎస్‌టి నుంచి మినహాయింపును కూడా ఇచ్చింది. దీంతో రిలయన్స్ ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. గుజరాత్ తరువాత ఆంధ్రప్రదేశ్‌లోనే రియలన్స్ ఎక్కువ పెట్టుబడులుపెడుతోంది. కేవలం 30రోజుల్లోనే లోకేష్ ఈ పెట్టుబడులను రాష్ట్రానికి తేగలిగారు. దీని ద్వారా 2.5లక్షల ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు. అలా కనుక జరిగితే ఇదో గేమ్ ఛేంజర్ అవుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. మొత్తం మీద గత పాలకులు, కక్షలతో కాలం గడిపేస్తే కూటమి ప్రభుత్వం మాత్రం అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళుతోంది.