WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

జర్నలిస్టుల రైల్వేపాస్‌లకు కేంద్రం మంగళం...!?

ఇప్పటికే జర్నలిస్టులను, పత్రికలను భయభ్రాంతులకు గురిచేసి వారిని గుప్పెట పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం, తాజాగా ఇప్పటి వరకు వారికి కల్పిస్తున్న రాయితీలకు మంగళం పాడబోతోంది. అధికారంలోకి వచ్చిన తరువాత వివిధ సంస్కరణల పేరుతో సామాన్య,మధ్యతరగతి ప్రజల అంతు చూస్తున్న 'మోడీ' ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న జర్నలిస్టులను, మీడియా సంస్థలపై కక్షసాధింపు చర్యలు చేపట్టింది. పలువురు జర్నలిస్టులను అరెస్టు చేయటం, మరి కొందరిపై దాడులు జరుగుతున్నా ఉద్దేశ్యపూర్వకంగా మౌనం వహించడం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం...ఇప్పుడు మరో చర్యకు పూనుకుంది. ఎప్పటి నుండో అక్రిడేషన్‌ సౌకర్యం కల జర్నలిస్టులకు రైల్వేలో 50శాతం రాయితీ ధరతో ప్రయాణించే వెసులుబాటు ఉంది. ఇప్పుడు ఆ సౌకర్యానికి మంగళం పాడబోతోంది. ఇప్పటికే పలు ట్రైన్స్‌లో సూపర్‌ఫాస్ట్‌ ఛార్జీలు, భోజనసదుపాయం పేరుతో 50శాతం రాయితీ ఇవ్వకుండా దెబ్బేస్తున్న కేంద్రం తాజాగా జర్నలిస్టు రైల్వేపాస్‌లపై నియంత్రణ తేబోతోంది. ప్రతి మాసంలో జర్నలిస్టులకు ఒక కోటా పెట్టి...కోటా వరకే రాయితీ ఇస్తామని చెబుతోంది. కోటాలో ఉన్న సీట్ల వరకే జర్నలిస్టులకు రాయితీ ఇస్తారు...! ఆ మాసంలో కోటా అయిపోతే జర్నలిస్టులు కూడా పూర్తి ధర చెల్లించి ప్రయాణించాల్సిందే...! దేశ వ్యాప్తంగా ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. తాజాగా విధానం గురించి జర్నలిస్టు మిత్రులకు పెద్దగా తెలియటం లేదు. ఎందుకంటే ఎప్పుడో పండుగకో..పబ్బానికో...లేకపోతే అవసరానికే తప్ప..మిగతా సమాయాల్లో పెద్దగా ఈ రాయితీని జర్నలిస్టులు ఉపయోగించుకోరు. 

  ఆదివారం నాడు విజయవాడ రైల్వేస్టేషన్‌లో ఈ విధానం గురించి బుకింగ్‌ క్లర్క్‌ వివరించారు. ఢిల్లీకి వెళ్లాలని...! జర్నలిస్టు  రైల్వే రాయితీ పాస్‌ ఇస్తే...ఇవెందుకండీ...ఇవి ఇక పనికిరావు...మీకు కూడా కోటా పెట్టారు..ఆ కోటాలో టిక్కెట్లు ఉంటేనే మీకు రాయితీ కింద టిక్కెట్‌ వస్తుంది...లేదంటే మొత్తం ఛార్జీ చెల్లించాల్సిందేనని ఆమె తేల్చి చెప్పారు. అదేమిటి...ఇదెప్పుడు అమలులోకి వచ్చిందంటే..ఇటీవలే...అంటూ ఆమె ముక్తసరిగా జవాబు ఇచ్చారు. అంతే కాకుండా ఇంకో రెండు మూడు నెలల్లో వీటిని పూర్తిగా రద్దు చేస్తారని అన్నారు.  ఇప్పటికే మీడియాపై విరుచుకుపడుతున్న బిజెపి ప్రభుత్వం తాజా విధానం ద్వారా జర్నలిస్టులపై కూడా తమ ప్రతాపం చూపిస్తున్నట్లుంది. చిన్న,మధ్యతరహా పత్రికలకు ప్రకటనలు ఇవ్వకుండా పలు ఆంక్షలు పెడుతూ...ఆ పత్రికల ఉసురు తీస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజా చర్యలతో జర్నలిస్టుల్లో మరింత ఆగ్రహం కల్గిస్తోంది. చిన్న,మధ్యతరహా పత్రికలకు డిఎవిపి నుంచి ప్రకటనలు ఇవ్వనివ్వకుండా..వాటిన్నింటిని కార్పొరేట్‌శక్తులు నడుపుతున్న పత్రికలకు ధారపోస్తూ...తమ నైజాన్ని చాటుకుంది. తమది కార్పొరేట్‌ ప్రభుత్వమని తాజా చర్యలతో మరోసారి రుజువు చేసింది. జర్నలిస్టు సంఘాలు ఇటువంటి విధానాలపై ఇప్పటికైనా ఐక్యంగా పోరాడాల్సి ఉంది.


(751)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ