8మంది ఐఏఎస్‌లకు జైలుశిక్ష
ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. తమ ఉత్తర్వులను ధిక్కరించినందుకు 8మంది ఐఏఎస్ అధికారులకు రెండువారాల పాటు జైలు శిక్ష విధిస్తూ ఉన్నత న్యాయస్థానం గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది. జైలు శిక్ష పొందిన వారిలో సీనియర్ ఐఎఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్, చినవీరబద్రుడు, జె.శ్యామలరావు,శ్రీలక్ష్మి, విజయ్‌కుమార్,రాజశేఖర్, ఎంఎం నాయక్‌లు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయవద్దన్న హైకోర్టు ఆదేశాలను పాటించని కారణంగా హైకోర్టు వీరికి జైలుశిక్ష విధించింది. తమకు విధించిన జైలుశిక్షపై ఐఎఎస్ అధికారులు కోర్టును మన్నించమని కోరగా వారికి జైలు శిక్ష రద్దు చేస్తూ, సేవా కార్యక్రమాలు చేయాలని కోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో ఉన్న సంక్షేమ హాస్టళ్లలో నెలలో ఒక రోజు సేవ చేయాలని స్పష్టం చేసింది. సంవత్సరం పాటు హాస్టళ్లలో సేవా కార్యక్రమాలను నిర్వహించాలని తెలియజేసింది. అంతే కాకుండా ఒక రోజు హైకోర్టు ఖర్చులు భరించాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఇంతమంది ఐఏఎస్ అధికారులపై శిక్షలు విధించడంపై అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను గుడ్డిగా అమలు చేయడమే నేటి ఐఏఎస్‌ల స్థితికి కారణమని అధికారులు చర్చించుకుంటున్నారు. రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయాల్సిన అధికారులు అధికారపార్టీని మెప్పించడానికి చేసే కార్యక్రమాలవల్ల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.