WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రేష‌న్ బియ్యంపై కెసిఆర్ అలా...! బాబు...ఇలా...!

తెలుగు రాష్ట్రాల పాలకులు పలు విషయాలపై పోటీపడుతున్నట్లే పేదోడికి నిత్యం బువ్వ అందించే రేషన్‌ బియ్యంపై పోటీ పడుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో రేషన్‌ సమస్యపై ఇరు రాష్ట్రప్రభుత్వాలు చెరో మార్గాన్ని ఎన్నుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వందల కోట్ల విలువ చేసే రేషన్‌బియ్యం పక్కదారి పడుతున్నాయని, అర్హులకు అందకుండా స్మగ్లర్ల చేతికి వెళుతున్నాయనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. తాజాగా ఈ రేషన్‌ ఆక్రమాలపై రెండు రాష్ట్రాల అధినేతలు స్పందిస్తున్నారు. అంతే కాకుండా రెండు రాష్ట్రాలకు చెందిన రేషన్‌ డీలర్లు తమకు ఇచ్చే కమీషన్‌ తక్కుగా ఉందని తాము సమ్మె చేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో వీటిపై ఏదో ఒక చర్య తీసుకోవాల్సిన సమయం ప్రభుత్వాధినేతలకు ఆసన్నమైంది. వారికి ఇచ్చే కమీషన్‌ పెంపు గురించి, ఇతర సమస్యల గురించి ఆలోచించకుండా అసలు వీటిని తీసి వేస్తే ఎలా ఉంటుందనే దానిపై విస్తృతమైన చర్చలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆ రాష్ట్ర రేషన్‌ డీలర్లకు వార్నింగ్‌ ఇచ్చారు. తక్షణం సమ్మె వంటి ఆలోచన మానుకోకపోతే వాటన్నింటిని రద్దు చేస్తామని, పేదలకు ఇచ్చే రేషన్‌ స్థానంలో వారికి నగదు జమ చేస్తామని హెచ్చరించారు. దీంతో ఆ రాష్ట్ర ప్రజల్లో కల్లోలం చెలరేగింది. తమకు నగదు వద్దు...రేషనే కావాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు ప్రతి వ్యక్తికి 10కిలోల బియ్యం ఇస్తుండగా దాని స్థానంలో నగదు ఇస్తే..దాని వల్ల మంచికన్నా చెడే ఎక్కువ జరుగుతుందని వారు అంటున్నారు. ఎందుకంటే పదికిలోల బియ్యానికి ఎంత రేటు కట్టి ఇస్తారు...! బహిరంగ మార్కెట్‌లో ఒకరమైన బియ్యం ధర సుమారు రూ.40/-లు ఉంటుంది. అంటే ప్రతి వ్యక్తి బియ్యం కొనుగోలు చేయాలంటే నెలకు రూ.400/-లు చెల్లించాల్సి ఉంటుంది. అదే ఒక కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఉంటే కుటుంబానికి రూ.1600/- చెల్లించాల్సి ఉంటుంది. మరి ఇంత ధర చెల్లించడం సాధ్యమయ్యే పనేనా...? ఒక వేళ అంత ధైర్యం చేసి చెల్లించినా...వాటిని లబ్దిదారులు సద్వినియోగం చేసుకుంటారా..? ఒక వైపు ప్రతి వ్యక్తికి ఆహారభద్రత కింద రేషన్‌ సరఫరా చేయాల్సి ఉండగా నగదు ఇస్తే కేంద్రం చూస్తూ ఊరుకుంటుందా...? రేషన్‌ డీలర్లు అక్రమాలు చేస్తున్నారని...వారందరినీ తప్పించడానికి ఇటువంటి ప్రయోగాలు చేస్తే...అంతిమంగా నష్టపోయేది పేదోడే...ఇప్పటిదాకా..రేషన్‌ అరకొరగా ఇచ్చినా...వాటితోనే నెట్టుకువచ్చే కుటుంబాలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో...! ఇప్పుడు వాటి స్థానంలో నగదు పంపిణీ చేస్తే...అవి సద్వినియోగం అవడం అటుంచి...దుర్వినియోగం అయ్యే అవకాశమే ఎక్కువ. అంతే కాకుండా రోజు రోజుకు బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు చుక్కలను చూపిస్తున్నాయి..ఇటువంటి పరిస్థితుల్లో ఈ నగదు పంపిణీ ప్రారంభిస్తే పాలకులు పేదోడి నోటి కాడ కూడు తీసేసినట్లే...!


  తెలంగాణాలో ఇలా ఉంటే...ఆంధ్రా పౌరసరఫరాలశాఖ కూడా అదే దారిలో నడస్తున్నట్లు కనిపిస్తుంది. రేషన్‌ అక్రమాలు ఇక్కడా సహజంగా కనిపించేవే. అయితే ఇక్కడ ఆధునిక వ్యవస్థను ఉపయోగించుకుని చాలా వరకు అక్రమాలను అరికట్టగలుగుతున్నారు. తెలంగాణలో వలే తాము రేషన్‌ పంపిణీని ఎత్తేస్తామని ప్రకటించకపోయినా...ఆంధ్రా ప్రభుత్వం మరో రీతిలో ఆలోచిస్తోంది. అదేమంటే 'చంద్రన్న విలేజ్‌మాల్స్‌' ఏర్పాటు చేస్తామని చెబుతోంది. రేషన్‌ షాపుల స్థానంలో ఈ 'చంద్రన్న విలేజ్‌మాల్స్‌' ఏర్పాటుకు పౌరసరఫరాలశాఖ శరవేగంగా పనులు చేసుకుంటూ పోతోంది. ఇప్పటికే ఆ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు దీనిపై ప్రకటనలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో కన్నా ఈ మాల్స్‌లో 20శాతం తక్కువ ధరలకు సరుకులు విక్రయిస్తామని చెబుతున్నారు. తెలంగాణ కంటే మేలైన విషయం ఏమిటంటే ఇప్పటికిప్పుడు రేషన్‌ పంపిణీని వీరికి ఇవ్వడం లేదు. రేషన్‌ పంపిణీని యధాతథంగా ఉంచి ఇతర నిత్యావసర వస్తువులను మాత్రమే 'చంద్రన్న విలేజ్‌మాల్స్‌'లో అమ్ముతారని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు రేషన్‌ తీసివేయకపోయినా...ఇక్కడ కూడా తెలంగాణ వలే చేయరని నమ్మకమేమీ లేదు...! 'చంద్రన్న విలేజ్‌మాల్స్‌' పూర్తిస్థాయిలో ఏర్పాటు అయ్యాయక రేషన్‌ పంపిణీని వాటితోనే చేయిస్తారనే అనుమానాలు వస్తున్నాయి. అదే సమయంలో రేషన్‌ తీసి వేసి వాటి స్థానంలో నగదు పంపిణీ చేసినా ఆశ్చర్యమేమీ లేదు..! కేంద్ర ప్రభుత్వం కూడా రేషన్‌ స్థానంలో నగదు బదలాయింపు చేయాలని భావిస్తున్న తరుణంలో రాబోయే రోజుల్లో పేదోడి బువ్వకు కష్టాలు వచ్చినట్లే...!


(375)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ