లేటెస్ట్

‘అమరావతి’ని కట్టలేం...!?

రాజధాని అమరావతిని నిర్మించలేమని అధికారవైకాపా ప్రభుత్వం పరోక్షంగా తేల్చి చెప్పింది. రాజధానిని అమరావతిలోనే నిర్మించాలని, గత ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టిన పనులు కొనసాగించాలని, ఒక నెలలో మౌలిక వసతుల నిర్మాణాలపై సమాధానం ఇవ్వాలని కోర్టు ఇటీవలే ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే హైకోర్టు చెప్పిన విధంగా తాము రాజధానిని వెంటనే నిర్మించలేమని, కోర్టు చెప్పిన విధంగా ఆరు నెలల్లో నిర్మాణాలు చేయలేమని తమకు కనీసం 60 నెలల సమయం ఇవ్వాలని హైకోర్టును కోరుతూ ప్రభుత్వం అఫడవిట్‌ను దాఖలు చేసింది. హైకోర్టు విధించిన నిబంధనను తొలగించాలని, ఇది ఆచరణ సాధ్యం కాదని చెప్పింది. దీంతో రాజధానిని కట్టే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని స్పష్టం అవుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ప్రభుత్వ విధానానికి అనుగుణంగానే నిన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒకే ప్రాంతంలో దాదాపు లక్ష కోట్లు ఎలా ఖర్చు చేయాలని ప్రశ్నించారు. ప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చిన అఫడవిట్‌ను ఆయన ప్రకటనను పక్కపక్కన పెట్టుకుని చూస్తే అమరావతిని నిర్మించే ఉద్దేశ్యం వీరిలో ఉన్నట్లు కనిపించడం లేదన్న భావన వ్యక్తం అవుతోంది. 


రాజధాని నిర్మాణంలో భాగంగా గత ప్రభుత్వం దాదాపు 40వేల కోట్లు ఖర్చు చేసిందని ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రాజధానిలో ఒక్క ఇటుక కూడా వేయలేదని వైకాపా నాయకులు ఆరోపించేవారు. అయితే ఇప్పుడు వారి ప్రభుత్వమే రూ.40వేలకోట్లను ఖర్చు చేసిందని చెప్పడంతో గతంలో వారు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని తేలింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజధాని పనులు శరవేగంగా జరగడంతో పాటు చాలా భవనాల నిర్మాణాలు, యాక్సెస్‌ సీడ్‌ రోడ్డు నిర్మాణం జరిగింది. ఆయనకు ఉన్న పరిమితుల దృష్ట్యా పనులను కొనసాగించినా అప్పట్లో కొందరు మేధావులు, వైకాపా నాయకులు అక్కడేం జరగలేదని, అంతా గ్రాఫిక్స్‌ అని ప్రచారం చేశారు. నాడు ఇలా ప్రచారం చేసిన వారంతా ఇప్పుడేమంటారో..? నోటికి హద్దూ అదుపు లేకుండా, యధేచ్ఛగా అవాస్తవాలను ప్రచారం చేసిన వారంతా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నాడు అత్యుత్సాహంతో చేసిన ప్రచారం నేడు ఆంధ్రా భవిష్యత్‌కు గొడ్డలిపెట్టు అయింది. పనిచేసే వాడిని చేయనీయకుండా, ఆయన కాళ్లలో అడ్డం పెట్టిన మేధావులు నేడు ఆంధ్రా ఎదుర్కొంటున్న పలు సమస్యలకు కారణమయ్యారు. మొత్తం మీద..రాజధాని విషయంలో వైకాపా ప్రభుత్వం తన అసలు ఉద్దేశ్యాన్ని బయటపెట్టేసింది. కోర్టులు ఏమి చెప్పినా..తాము చేయాలనుకున్నదే చేస్తామని మరోసారి చెప్పినట్లైంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ