లేటెస్ట్

‘రేపల్లె’కు ‘అంబటి’...!?

సత్తెనపల్లి శాసనసభ్యుడు ‘అంబటి రాంబాబు’ ఈసారి ‘రేపల్లె’ నుంచి పోటీ చేస్తారా..అంటే ఔననే సమాధానం వస్తోంది. 2014లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన ఆయన అతి స్వల్ప తేడాతో మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌పై ఓడిపోయారు. అనంతరం 2019 ఎన్నికల్లో ఆయనపైనే భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి ఆయన సత్తెనపల్లికి చేసిందేమీ లేదని ప్రచారం జరుగుతోంది. స్వంత పార్టీలోనే ఆయనకు వ్యతిరేకంగా ఒక గ్రూపు తయారైంది. ఆయనకు మళ్లీ టిక్కెట్‌ ఇవ్వవద్దని, ఆయనకు మళ్లీ సత్తెనపల్లి నుంచి టిక్కెట్‌ ఇస్తే ఆయనను తామే ఓడిస్తామని వారు బహిరంగంగా చెబుతున్నారు. సత్తెనపల్లిలో ‘అంబటి’ అక్రమమైనింగ్‌కు పాల్పడుతున్నారని వారు హైకోర్టులో కేసు వేశారు. దీనిపై విచారణ జరుగుతోంది. స్వంత పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటున్న ‘అంబటి’కి మరోసారి ఇక్కడ నుంచి సీటు ఇస్తే ‘టిడిపి’ సునాయాసంగా గెలుస్తుందని సర్వేల్లే తేలిందట. దీంతో ‘అంబటి’ని ఇక్కడ నుంచి ‘రేపల్లె’కు పంపాలని వైకాపా అధినేత ‘జగన్‌’ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే తనకు మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి వస్తుందని, మంత్రి పదవి వచ్చిన తరువాత నియోజకవర్గంపై మరింత పట్టుసాధిస్తానని, ఇక్కడ నుంచే తాను మళ్లీ పోటీ చేస్తానని ‘అంబటి’ సన్నిహితులతో చెబుతున్నారట. అయితే ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఆయనకు సీటు రాదని, అదే విధంగా మంత్రి పదవి కూడా రాదని ఆయన వ్యతిరేకులు అంటున్నారు.


వైకాపా అధినేత ‘జగన్‌’కు సన్నిహితుడైన ‘అంబటి’ మొదటి నుంచి ‘జగన్‌’నే నమ్ముకున్నారు. మహిళల విషయంలో కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్న ‘అంబటి’ని ‘జగన్‌’ మంత్రిని చేస్తారా..? అంటే చేయరనే సమాధానమే వస్తోంది. అయితే సీటు మాత్రం ఇస్తారని, అదీ ఇక్కడ కాదని, రేపల్లెలో మాత్రమే ఆయనకు సీటు వస్తుందని కొందరు చెబుతున్నారు. సత్తెనపల్లి ‘టిడిపి’లో ఉన్న వర్గ విభేధాలు ‘అంబటి’కి కలిసి వస్తున్నాయని, ఆ పార్టీ ఇప్పటి వరకు అక్కడ ఇన్‌ఛార్జిని నియమించలేదని, ఇన్‌ఛార్జి పదవికోసం దాదాపు ఐదుగురు నేతలు సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అధినేత ఎవరికీ హామీ ఇవ్వకపోవడంతో ‘టిడిపి’ నాయకులు ఎవరికి వారు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. టిడిపి కనుక ఇన్‌ఛార్జిని ప్రకటిస్తే ఇక్కడ ‘అంబటి’కి ఇక్కట్లు మొదలైనట్లే. ఒక వైపు వైకాపా అసంతృప్త నాయకులు, మరోవైపు టిడిపి ఆయనను తీవ్రంగా ఇరకాటంలోకి నెడుతుందనడంలో సందేహం లేదు. మొత్తం మీద వైకాపా అసంతృప్తుల మాట నెగ్గే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ