WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కొండగల్‌'లో తేల్చుకుందాం..రా...!

టిడిపికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన 'రేవంత్‌రెడ్డి' తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు బహిరంగ సవాల్‌ విసిరారు. గత సార్వత్రిక ఎన్నికల తరువాత అన్ని ఎన్నికల్లోనూ, ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తున్న టిఆర్‌ఎస్‌కు 'రేవంత్‌రెడ్డి' రూపేణా అసలైన సవాల్‌ ఎదురవుతోంది. ఈ రోజు తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేసిన ఆయన ఎమ్మెల్యే పదవికి స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేశారు. ఇప్పుడు తెలంగాణ స్పీకర్‌ మధుసూధనాచారికి ఆ రాజీనామాను ఆమోదించక తప్పని పరిస్థితి. ఎందుకంటే స్పీకర్‌ ఫార్మాట్‌లో ఏ శాసనసభ్యుడైనా రాజీనామా చేస్తే ముందుగా స్పీకర్‌ ఆ సభ్యుడితో వ్యక్తిగతంగా మాట్లాడి...రాజీనామా విషయాన్ని ధృవీకరించుకుంటారు. ఇప్పుడూ 'రేవంత్‌రెడ్డి' విషయంలో స్పీకర్‌ అదే విధంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక వేళ 'రేవంత్‌రెడ్డి' రాజీనామాను ఆమోదించకుండా అట్టిపెడితే...ఉపఎన్నికల్లో గెలవలేక అధికార టిఆర్‌ఎస్‌ స్పీకర్‌ను అడ్డం పెట్టుకుంటుందనే విషయం స్పష్టం అవుతుంది. అంతే కాదు..తన రాజీనామా ఆమోదించాలని 'రేవంత్‌రెడ్డి' స్పీకర్‌ ఛాంబర్‌ వద్ద ధర్నాకు కూడా దిగవచ్చు. ఇవన్నీ స్పీకర్‌ ఆమోదించకపోతే ఉత్పన్నమయ్యే పరిస్థితులు...! అధికారంలో ఉండి అన్ని ఎన్నికల్లో ఏకపక్షంగా గెలుస్తూ వస్తోన్న టిఆర్‌ఎస్‌కు 'కొండగల్‌'లో గెలవడం పెద్ద సమస్య కాకపోవచ్చు. అందుకే 'రేవంత్‌రెడ్డి' రాజీనామాను వెంటనే ఆమోదించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

 ఇదే కనుక జరిగితే 'కొండగల్‌'లో 'రేవంత్‌రెడ్డి'కి...అధికార టిఆర్‌ఎస్‌కు మధ్య హోరాహోరి తప్పదు. 'రేవంత్‌' వైపు కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, బిజెపి, టిడిపిలోని ఓ వర్గం నిలబడితే...టిఆర్‌ఎస్‌ వైపు మజ్లిస్‌, టిడిపిలోని మిగతా వర్గం నిలబడవచ్చు. దీంతో పోరు హోరాహోరి అవుతుందనడంలో సందేహం లేదు. ఈ ఎన్నికల్లో 'రేవంత్‌రెడ్డి' నెగ్గితే...ఆయనకు ఇక తెలంగాణలో తిరుగే ఉండకపోవచ్చు...అదేసమయంలో కాంగ్రెస్‌పార్టీలో హీరో అవుతారు...! పార్టీ పెత్తనం మొత్తం ఆయన చేతికి దక్కవచ్చు...! ఒక వేళ  ఓడిపోయినా...'రేవంత్‌'కు పెద్దగా ఇబ్బందేమీ ఉండదు...! అధికారపార్టీ ఓటర్లను కొనుగోలు చేసిందని, అధికారాన్ని దుర్వినియోగం చేసిందని చెప్పవచ్చు...అధికారపార్టీ చేసేది కూడా అదే.....ఇక మరో సంవత్సరంలో జరగనున్న ఎన్నికల్లో మరోసారి పోటీకి దిగవచ్చు. దీని ద్వారా 'రేవంత్‌' పోగొట్టుకునేదేమీ ఉండదు...అదే సమయంలో అధికార టిఆర్‌ఎస్‌లో మాత్రం ప్రకంపనలు రేగుతున్నాయి. ఇప్పటికే వివిధ వర్గాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్న టిఆర్‌ఎస్‌ ఈ ఎన్నిక అగ్నిపరీక్ష అనడంలో సందేహం లేదు. ఎన్నికల్లో చతురంగ బలలాలను ప్రయోగించినా ఓడిపోతే మాత్రం ఆ పార్టీ పతనానికి ఇదే నాంది అవుతుందనడంలో సందేహంలేదు. ఇప్పటికే కుటుంబపాలనతో విసిగిపోయి ఉన్న తెలంగాణ ప్రజలు...రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తారు..అదే సమయంలో పార్టీలో ఉంటూ అసంతృప్తిగా ఉన్న నేతలు కాంగ్రెస్‌వైపు దృష్టిపెడతారు..! ఇవన్నీ ఓడిపోతే ఎదురయ్యే పరిణామాలు..కానీ కెసిఆర్‌ అటువంటి పరిస్థితి తెచ్చుకునే స్థితిలో ప్రస్తుతానికి లేరు. ఉపఎన్నికల వ్యూహాల్లో ఆయనకొట్టిన వారు ఇప్పట్లో తెలంగాణలో ఎవరూ లేరు...ఆయన వ్యూహాలను చేధించడం కాంగ్రెస్‌ నాయకుల వల్ల కాదు..ఏదో విధంగా ఆయన ఈ ఎన్నికల్లో గెలిచి రాబోయే సార్వత్రిక ఎన్నికలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని భావిస్తున్నారు. మరి 'రేవంత్‌రెడ్డి'...కెసిఆర్‌ల పోరు తెలంగాణ రాజకీయచిత్రపటాన్ని ఏ విధంగా మారుస్తుందో చూడాల్సి ఉంది.


(1167)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ