WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

తెలంగాణ టిడిపి ఓట్లు ఎవరికో...!?

తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ శాసనసభాపక్షనాయకుడు 'రేవంత్‌రెడ్డి' నిష్క్రమించడం, ఆయన దారిలో మరి కొందరు నాయకులు వెళ్లిపోతుండడంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నామ మాత్రం కానుంది. సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉన్న నేపథ్యంలో కొందరు నాయకులు తమ రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌,టిఆర్‌ఎస్‌ పార్టీలను ఆశ్రయిస్తున్నారు. నిన్నటి దాకా నాయకులు అందరూ వెళ్లిన ఉన్న నాయకులు, ద్వితీయశ్రేణి నాయకులతో కనీసం ముప్పయి నుంచి నలభై సీట్లలో బలంగా టిడిపి పోటీ ఇస్తుందని రాజకీయ పరిశీలకులు భావించారు. అయితే పార్టీ నుంచి నాయకులు జారుకుంటుండడంతో ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు, టిడిపిని అభిమానించే ఓటర్లు పరిస్థితి గందరగోళంలో పడింది. ఇప్పటికిప్పుడు వీరు బయటకు ఏమీ చెప్పకపోయినా...రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి వీరు ఏ పార్టీని సమర్థిస్తారనే అంశం చర్చనీయాంశమవుతోంది.

  గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఘోరంగా ఉందని, ఆ పార్టీ నాలుగు లేక ఐదు సీట్లకు మించి గెలవదని రాజకీయపరిశీలకులు, మేధావులు అంచనా వేశారు. అయితే ఎన్నికల సమయంలో తనకు ఉన్న కార్యకర్తల బలంతో టిడిపి 15 అసెంబ్లీ సీట్లతో పాటు దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గమైన మల్కాజ్‌గిరి నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంది. దాదాపు 24లక్షల ఓట్లును సాధించి తెలంగాణలో తన సత్తా అయిపోలేదని తేల్చి చెప్పింది. అయితే తరువాత జరిగిన పరిణామాలు ఆ పార్టీని పూర్తిగా కుంగతీశాయి. గెలిచిన 15మందిలో 12మంది అధికార టిఆర్‌ఎస్‌లో చేరగా...ఇప్పుడు 'రేవంత్‌రెడ్డి' పార్టీకి,ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు అసెంబ్లీలో ఆ పార్టీ బలం కేవలం ఇద్దరు శాసనసభ్యులే. వారిలో ఒకరు స్వంత పార్టీ పెడతానని ప్రగల్బాలు పలుకుతున్నారు. మరో ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటో ఎవరికీ అంతుబట్టడం లేదు. శాసనసభ్యులంతా ఫిరాయించినా...గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు ఇంకా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. అయితే పార్టీ బలం రోజు రోజుకు బలహీన పడుతుండడంతో వీరు రాబోయే ఎన్నికల్లో ఎవరిని సమర్థిస్తారనే ప్రశ్న రాజకీయవర్గాల నుంచి వస్తోంది.

  సాంప్రదాయంగా టిడిపిని సమర్థించే బిసీలు,కమ్మ సామాజికవర్గం,ఎస్సీ,ఎస్టీలు ఇప్పుడు కెసిఆర్‌, కాంగ్రెస్‌లను ఎంచుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. 'కమ్మ' సామాజికవర్గానికి చెందిన బడా 'కమ్మ'లు ఇప్పటికే కెసిఆర్‌తో మిలాఖత్‌ అవుతున్నారు. వారి వారి వ్యాపారాలను కాపాడుకోవడానికి, ఆస్తులను రక్షించుకునేందుకు వీరంతా కెసిఆర్‌ను సమర్థిస్తున్నారు. అదే సమయంలో సామాన్య 'కమ్మ' ఓటర్లు కెసిఆర్‌పై వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వీరిని ఉద్దేశించి 'కెసిఆర్‌' అండ్‌ గ్యాంగ్‌ చేసిన వ్యాఖ్యలు ఇంకా వీరు మరిచిపోలేదు. ప్రస్తుతం ఈ వర్గానికి చెందిన పెద్దలు కెసిఆర్‌ను సమర్థిస్తుండగా మిగతా వారంతా 'రేవంత్‌రెడ్డి'ని సమర్థించే అవకాశాలు ఉన్నాయి. 'రేవంత్‌రెడ్డి' కాంగ్రెస్‌లో చేరినా వీరు మాత్రం ఆయనకే మద్దతు ఇచ్చే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో దాదాపు 30 నియోజకవర్గాల్లో ఈ వర్గం గెలుపోటములను నిర్దేశించే పరిస్థితి ఉంది. వీరంతా టిడిపిని సమర్థిస్తారు..ఒక వేళ టిడిపి ఇప్పటికన్నా బలహీనపడి..పోటీ చేసే పరిస్థితి లేకపోతే వీరులో ఎక్కువ మంది 'రేవంత్‌'వైపే నిలుస్తారు. ప్రస్తుతానికి కెసిఆర్‌ వీరిని బుజ్జగిస్తున్నా...వీరు గతంలో తమకు జరిగిన అవమానాలను మరిచిపోలేదు.

   ఇది ఇలా ఉండగా...టిడిపిని అభిమానించే బిసీ వర్గాలు ఎటువైపు ఉంటాయనే దానిపై స్పష్టత రావడం లేదు. ఇప్పటీకీ ఈ వర్గం టిడిపిని ఆధారంగా చేసుకుని పోరాడాలనే భావనతోనే ఉంది. తమకు కొంత మద్దతు ఇస్తే...రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. తెలుగుదేశం పార్టీ తమకు రాజకీయంగా, ఆర్థికంగా ఇచ్చిన అండను ఆ వర్గం మరిచిపోలేకపోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మరింత క్షీణిస్తే వీరు 'కెసిఆర్‌'కు మద్దతు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 'రేవంత్‌రెడ్డి' 'రెడ్డి' వర్గానికి ప్రాధాన్యత ఇస్తుండడంతో వీరు ఆయన వైపు కూడా ఆసక్తి చూపించడం లేదు. స్వతంత్య్రంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక టిడిపిని అభిమానించే ఎస్సీ, ఎస్టీలు సహజంగా కాంగ్రెస్‌ వైపే చూస్తారు. టిడిపి అనంతర పరిస్థితుల్లో వీరు తాము ఎప్పటి నుంచో మద్దతు ఇస్తోన్న కాంగ్రెస్‌నే సమర్థిస్తారు. మొత్తం మీద రాబోయే సార్వత్రిక ఎన్నికల సమయానికి టిడిపి ఓట్లు ఎవరికి వశం అయితే వారే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తే...ఈ ఓట్లల్లో మెజార్టీ ఓట్లు కాంగ్రెస్‌కు బదిలీ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే కనుక జరిగితే కాంగ్రెస్‌ ఘన విజయం సాధించడం ఖాయం.


(538)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ