WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'నంద్యాల' ఫలితమే 'కొండగల్‌'లో వస్తుందా...!?

శీతాకాలం ప్రవేశిస్తున్న తొలిదశలో ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. నిన్న మొన్నటి దాకా నంద్యాల ఎంపి గుత్తాసుఖేందర్‌రెడ్డితో రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో తమ సత్తా చాటాలని భావించిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు తాను ప్రయత్నించకుండానే ఉపఎన్నికలు రాబోతున్నాయి. తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటం ద్వారా ఉపఎన్నికలకు దారి చూపించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు తనకు అంతగా పట్టులేని 'నల్లగొండ'జిల్లాలో ఉపఎన్నిక జరిపించి, ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, కాంగ్రెస్‌ పార్టీనీ, తనను వ్యతిరేకించే శక్తులపై పై చేయిసాధించాలన్న కెసిఆర్‌ ఆలోచన కార్యరూపంలోనే ఉంది. ఇంతలోనే అనూహ్యంగా 'రేవంత్‌రెడ్డి' వల్ల అది నెరవేరే పరిస్థితి నెలకొని ఉంది. 

   ఇప్పుడు 'రేవంత్‌రెడ్డి' రాజీనామాను స్పీకర్‌ ఆమోదించడం, తరువాత ఎన్నికలు జరగడం సాధారణంగా జరగాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ 'రేవంత్‌రెడ్డి' రాజీనామా ఆమోదం పొందుతుందా...? లేదా..అన్నదానిపై కొన్ని సందేహాలు ఉన్నాయి. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నాని ఇచ్చిన లేఖ స్పీకర్‌ ఫార్మట్‌లో ఉన్నా..దాన్ని 'రేవంత్‌' స్పీకర్‌కు పంపించకుండా తెలుగుదేశం అధినేత 'నారా చంద్రబాబునాయుడు' వ్యక్తిగత కార్యదర్శికి ఇచ్చి వెళ్లారు. మరి 'చంద్రబాబు' దాన్ని తెలంగాణ స్పీకర్‌కు పంపాల్సి ఉంది. దీనిలో కొన్ని సందేహాలు,విమర్శలు వ్యక్తం అయ్యే పరిస్థితి ఉంది. సాధారణంగా ఒక ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా ఇవ్వాలని భావిస్తే దాన్ని నేరుగా స్పీకర్‌ అందించడం కానీ...లేకపోతే స్పీకర్‌ కార్యాలయానికి కాని పంపించడం జరుగుతుంది. తనకు అందిన రాజీనామా లేఖపై స్పీకర్‌ సంబంధిత ఎమ్మెల్యేతో మాట్లాడి ధృవీకరించుకుని రాజీనామాను ఆమోదిస్తారు. అయితే ఇక్కడ 'రేవంత్‌రెడ్డి' ఆ పనిచేయకుండా 'చంద్రబాబు'కు రాజీనామా లేఖ ఇచ్చారు. దీన్ని మరి చంద్రబాబు తెలంగాణ స్పీకర్‌కు ఎలా పంపుతారనే అంశంపై అయోమయం,సందేహాలు నెలకొన్నాయి. ఆంధ్రా ముఖ్యమంత్రి తెలంగాణ స్పీకర్‌కు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజీనామాను పంపవచ్చా...? లేదా..? అనేది సందేహమే...! సరే..ఇదంతా పక్కనపెడితే..మరో లేఖ ద్వారా అయినా 'రేవంత్‌రెడ్డి' తన రాజీనామా సమర్పించి ఈ సందేహాలను తొలగించవచ్చు అనుకోండి...ఆయన రాజీనామాపై అంత పట్టుదలతో ఉంటే...!

   ప్రస్తుతం 'రేవంత్‌రెడ్డి' రాజీనామాతో తెలంగాణలో ఎన్నికల వాతావరణం నెలకొంది. తెలంగాణ రాజకీయ సమాజం ప్రస్తుతం జరగబోయే ఉప ఎన్నిక గురించి విస్తృతంగా చర్చించుకుంటోంది. తెలంగాణలో 'కెసిఆర్‌'ను వ్యక్తిగతంగా, రాజకీయంగా సవాల్‌ చేస్తున్న 'రేవంత్‌రెడ్డి' ఇప్పుడు ఆయనను ఎదిరించి ఉపఎన్నికల బరిలో దిగుతుండడంతో ఆయనకు మద్దతు భారీగా వస్తోంది. 'కొండగల్‌'లో ఉపఎన్నిక ఎప్పుడు జరిగినా విజయం 'రేవంత్‌రెడ్డి'దే అని రాజకీయపక్షాలు, మేధావులు, విశ్లేషకులు, రేవంత్‌ అభిమానులు,సానుభూతిపరులు భావిస్తున్నారు. ఆయన స్వంతంగా ఒక సర్వే జరిపించుకున్నారని...ఆ సర్వేలో 54శాతం ఓట్లు 'రేవంత్‌'కు వస్తాయని తేలిందంటున్నారు. అదే సమయంలో అధికార టిఆర్‌ఎస్‌ పార్టీకి 34శాతం ఓట్లు వస్తాయని తేలిందట. అంటే ఉపఎన్నిక ఇప్పటికప్పుడు జరిగితే దాదాపు 20శాతం ఓట్ల మెజార్టీతో 'రేవంత్‌రెడ్డి' ఘన విజయం సాధించడం ఖాయమే...! దీంతో ఉపఎన్నికపై 'రేవంత్‌' అభిమానుల్లో, కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. అయితే ఇక్కడే అసలు సమస్యను వారు గుర్తించడం లేదు.

  అధికార టిఆర్‌ఎస్‌ పార్టీని తక్కువగా అంచనా వేస్తున్నారని...మొన్నా మధ్య ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన 'నంద్యాల' ఉప ఎన్నికల్లోనూ 'జగన్‌' పార్టీ ఇదే విధంగా లెక్కలు కట్టి బోల్తాపడిన సంఘటన కొందరు ఉదాహరిస్తున్నారు. నంద్యాల ఎన్నిక షెడ్యూల్‌ ప్రకటించన సమయంలో కానీ...నామినేషన్‌ వేసే సమయంలో కానీ...లేదా ప్రచారం సమయంలో కానీ...విపక్ష పార్టీ అయిన వైకాపా భారీ మెజార్టీతో గెలుస్తుందని పలువురు మేధావులు,రాజకీయవిశ్లేషకులు,సర్వేసంస్థలు, తెలంగాణలోని చంద్రబాబు వ్యతిరేకులు అంచనాలు కట్టారు. వీరే కాక సాక్షాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూడా 'నంద్యాల'లో వైకాపా గెలుస్తుందని చెప్పారు. ఆ విషయాన్ని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా చెప్పారు. 'మీ పార్టీ అభ్యర్థి వీక్‌గా ఉన్నారు...' నంద్యాలలో మీరు గెలవడం అసాధ్యమన్నట్లు 'బాబు'తో కెసిఆర్‌ వ్యాఖ్యానించగా..ఆయనేమీ బదులివ్వలేదు..! అయితే తరువాత వచ్చిన ఎన్నికల ఫలితం వీరందరికీ షాక్‌కు గురిచేసింది. అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాదాపు 27వేల మెజార్టీతో ఘన విజయం సాధించారు. వైకాపా అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌ పక్షం రోజుల పాటు ఇక్కడ ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినా...ఆయన పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. అంటే అధికారపార్టీ అభ్యర్థిని ఓడించడం అంత సులభమేమీ కాదని ఈ ఎన్నిక రుజువు చేసింది. వాస్తవానికి 'నంద్యాల' ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల చేసినప్పుడు వైకాపా అభ్యర్థి విజయం సునాయాసమని ఎక్కువ మంది భావించారు. ఆ విధంగా భావించిన వారిలో అధికార టిడిపికి చెందిన నేతలు కూడా ఉన్నారు. అంతరంగిక సంభాషణల్లో వారు తమ అభ్యర్థి విజయం అంత సులభం కాదని ఒప్పుకునేవారు. కానీ...రేస్‌ మొదలయ్యాక...అధికార పార్టీ తనకు ఉన్న అన్ని హంగులను ఉపయోగించుకుని ప్రత్యర్థిని బోల్తా కొట్టించింది. ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే రకంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయనడంలో సందేహమేమీ లేదు...! ముందు ఉన్న పరిస్థితిని అతిగా ఊహించుకుని, అధికారంలో ఉన్న వారిని తక్కువగా ఊహించి సవాళ్లు చేస్తే...'నంద్యాల' ఫలితం 'కొండగల్‌'లోనూ రావడం ఖాయం. 

   ప్రజల అభిమానం ఎంత ఉన్నా...! అధికారపార్టీ ముందు..ప్రతిపక్షాలు గెలవడం ఎప్పుడో కానీ...ప్రతిసారీ సాధ్యం కాదు. అసలే ఉపఎన్నికల్లో మాస్టర్‌ అయిన టిఆర్‌ఎస్‌ ముందు ఆ పప్పులు అంత తేలిగా ఉడకవు. ఇప్పటికే ఆ పార్టీ నేతలు 'కొండగల్‌'కు చెందిన టిడిపి ద్వితీయశ్రేణి నాయకులను, కార్యకర్తలను తమ పార్టీలో చేర్చుకుంటోంది. అదే సమయంలో 'రేవంత్‌'కు పలు అడ్డంకులు కల్పిస్తోంది. ఈ రోజు హైదరాబాద్‌లో ఆయన నిర్వహించబోయే సభకు అనుమతి ఇవ్వకుండా కాసేపు...కార్యకర్తలను తరలి రాకుండా వాహనాలను అడ్డుకుంటూ సమస్యలను సృష్టిస్తోంది. ఎన్నికకు నోటిఫికేషన్‌ రాకముందే ఈ విధమైన ప్రతికూల పరిస్థితులు సృష్టిస్తున్న 'టిఆర్‌ఎస్‌'ను ఎదుర్కోవడం అంత ఆషామాషీ విషయం కాదు. అయితే ప్రజల్లో, ఓటర్లల్లో అధికార టిఆర్‌ఎస్‌పై కనుక అసహ్యం కలిగితే...వారు చేసే చేష్టలపై కోపం, విసుగు వస్తే మాత్రం పరిస్థితి మరో విధంగా ఉంటుంది. అయితే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై ఇప్పటికీ ప్రజల్లో అటువంటి పరిస్థితి ఇంకా ఉత్పన్నం కాలేదు...ఆయనపై వారికి కోపం,విసుగు మాత్రమే ఉన్నాయి..తప్ప ఆగ్రహం కలగడం లేదు..అదే కలిగితే...'రేవంత్‌'ను అదృష్టం వరించినట్లే...!


(937)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ