ఇద్దరు మాజీ మంత్రులను పక్కన పెట్టిన చంద్రబాబు...!?
టిడిపి అధినేత చంద్రబాబు గతానికి భిన్నంగా వెళుతున్నట్లు ఇటీవల కాలంలో ఆయన వ్యవహారశైలిని గమనించిన వారు చెబుతున్నారు. గతంలో పార్టీ నాయకుల విషయంలో ఆయన చూసీ చూడనట్లు వ్యవహరించేవారు. వారు తప్పులు చేసినా, పార్టీ గురించి పెద్దగా పట్టించుకోకపోయినా, పార్టీ పనిచేయకపోయినా ఆయన వారికి సర్ది చెప్పి మళ్లీ పార్టీ కోసం పనిచేయించేవారు. అయితే ప్రస్తుతం ఆయన తన తీరును మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. ఇటీవల బాదుడే...బాదుడు కార్యక్రమం పర్యటన సందర్భంగా వివిధ జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పనిచేయని నాయకులను, వివాదాస్పదంగా వ్యవహరిస్తోన్న నాయకులను పక్కన పెట్టేశారు. రాయలసీమ పర్యటనలో ఈ విషయం స్పష్టంగా బయటపడింది. ఈ పర్యటనలో ఆయన ఇద్దరు మాజీ మంత్రులకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చేది లేదని పరోక్షంగా తేల్చి చెప్పారు. కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా గతంలో మంత్రులుగా పనిచేసిన కె.ఇ.కృష్ణమూర్తి, భూమా అఖిలప్రియలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చేది లేదని సంకేతాలు ఇచ్చారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత ఈ ఇద్దరు మాజీ మంత్రులు పార్టీని పట్టించుకోవడం మానేశారు. గత ఎన్నికల్లోనే పోటీ చేయకుండా కృష్ణమూర్తి వైదొలిగారు. అయితే ఆయన స్థానంలో ఆయన కుమారుడు ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఆయన ఘోరంగా ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన పార్టీని పట్టించుకోవడం మానేశారు. అయితే అప్పటి నుంచి కె.ఇ.కుటుంబం మళ్లీ పార్టీకోసం పనిచేస్తుందేమోనని అధిష్టానం వేచిచూసింది. అయితే..అధిష్టానం ఆశలను వమ్ముచేస్తూ కె.ఇ. కుటుంబం పూర్తిగా పార్టీని వదిలి వేసింది. దాంతో టిడిపి అధినేత డోన్ నియోజకవర్గానికి కొత్త వ్యక్తిని పార్టీ ఇన్‌ఛార్జిగా నియమించారు. అంతే కాకుండా మొన్నటి పర్యటన సందర్భంగా ఆయననే రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిగా ప్రకటించారు. దీంతో కె.ఇ. కుటుంబం నుంచి ఎవరికీ టిక్కెట్ ఇచ్చేది లేదని అధినేత తేట తెల్లం చేసినట్లయింది.
ఇక గతంలో మంత్రిగా పనిచేసిన భూమా అఖిలప్రియ వ్యవహారాన్ని కూడా అధినేత చంద్రబాబు దాదాపుగా తేల్చేసినట్లు కనిపించింది. జిల్లా పర్యటన సందర్భంగా తనను ఆళ్లగడ్డ అభ్యర్థిగా ప్రకటిస్తారని భూమా అఖిలప్రియ భావించారు. అయితే ఆమె ఆశలను అడియాశలు చేస్తూ, అభ్యర్థి విషయాన్ని చంద్రబాబు తేల్చలేదు. వాస్తవానికి అఖిలప్రియపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఆమె కుటుంబ సభ్యుల్లో ఒకరికి టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉందని గత కొద్దికాలంగా ప్రచారం సాగుతోంది. దీన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు పర్యటనలో అఖిలప్రియ కొందరు వైకాపా కార్యకర్తలను టిడిపిలో చేర్పించి, ఇక్కడ పార్టీ బాగుందని, తాను అయితేనే ఇక్కడ నుంచి పార్టీ గెలుస్తుందనే భావనను తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె ప్రయత్నాలను చంద్రబాబు సాగనీయలేదు. ఆమె అనుకున్నట్లు ఆమెను అభ్యర్థిగా ప్రకటించకుండా పర్యటనను ముగించారు. దీంతో అఖిలప్రియ ఖంగుతిని, చంద్రబాబు పర్యటనలో పూర్తిగా పాల్గొనలేదు. తనకు టిక్కెట్ రాదనే భయంతో అఖిలప్రియ ఉన్నారని నియోజకవర్గంలో ప్రచారం సాగుతోంది. తనకు టిక్కెట్ ఇవ్వకుంటే తన దారి తాను చూసుకుంటాననే ధోరణితో ఆమె ఉన్నారు. అయితే చంద్రబాబు ఇవన్నీ పట్టించుకునే పరిస్థతిలో లేరు. పార్టీకి పనిచేసిన వారెవరో...చేయనివారెవరో..ఆయన వద్ద లిస్టు ఉందని, దాంతో గత మూడేళ్లుగా పార్టీకి పనిచేయని వారిని దూరం పెట్టాలని ఆయన ఖరాఖండిగా నిర్ణయించుకున్నారని, గతంలో వలే మొహమాటాలకు ఆయన వెళ్లరని, తాజాగా కర్నూలు పర్యటన అదే తేటతెల్లం చేసిందని, ఇప్పుడు ఉన్నట్లు భవిష్యత్‌లో కూడా బాబు ఉండాలని పార్టీ నాయకులు, నిజమైన కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఇలా పనిచేయకుండా, ఇప్పుడు వచ్చి హడావుడి చేస్తోన్న నేతలను, పక్కన పెట్టాలని, అప్పుడే పార్టీకి పూర్వవైభవం వస్తుందని వారు అంటున్నారు.