లేటెస్ట్

'జగన్‌' ఆదేశాలను పట్టించుకోని మంత్రులు...!

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలను కొందరు మంత్రులు పట్టించుకోవడం లేదని, ఆయన మాటను వారు లెక్క చేయడం లేదని సచివాలయంలో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో తిరుగులేని అధికారాన్ని అనుభవిస్తున్న ముఖ్య మంత్రి వై.ఎస్‌.జగన్‌ మాటను మంత్రులు పట్టించుకోవడం లేదనే మాటను కొందరు కొట్టిపారేస్తున్నారు. అదేమీ లేదు.. మంత్రులు 'జగన్‌' మాటకు ఎదురు చెప్పే ధైర్యం చేయరు..ఆయన చెప్పిందే చేస్తారు..ఇదంతా ఒట్టి ప్రచారం అని చెబు తున్నా వాస్తవాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. అధికార, రాజకీయ విషయాల్లో ఏమి జరుగుతుందో కానీ, మంత్రుల అంతరంగిక సిబ్బందిని నియామకంలో మాత్రం ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి మాటలను పలువురు మంత్రులు ఖాతరు చేయడం లేదు. గత టిడిపి ప్రభుత్వంలో మంత్రుల వద్ద, విప్‌ల వద్ద పనిచేసిన వారెవరినీ మళ్లీ మంత్రులు తమ అంతరంగిక సిబ్బందిగా నియమించుకోవద్దని ఇప్పటికే రెండుసార్లు ముఖ్యమంత్రి కార్యాలయం మంత్రులకు నోట్‌ పంపింది. గత ప్రభుత్వంలో మంత్రుల వద్ద అంతరంగిక సిబ్బందిగా పనిచేసిన ఏ ఒక్కరినీ తీసుకోవద్దని... 'జగన్‌' చెప్పినా...కొందరు మంత్రులు మాత్రం పాత వారినే తమ అంతరంగిక సిబ్బందిగా కొనసాగిస్తున్నారు. 'జగన్‌' మాటను మెజార్టీ మంత్రులు పట్టించుకోవడం లేదనే భావన 'సచివాలయం'లో నెలకొని ఉంది. కాగా..'జగన్‌' ఇచ్చిన ఆదేశాలను మరి కొందరు మంత్రులు తూ.చా పాటిస్తున్నారు. పాత వారినెవరినీ తీసుకోవడం లేదు. గత ప్రభుత్వంలో పనిచేయని వారిని మాత్రమే తమ అంతరంగిక సిబ్బందిగా నియమించుకున్నారు. 

ప్రస్తుతం 'జగన్‌' మాటను పాటించని మంత్రులు ముందు జాగ్రత్త చర్యగా తమ అంతరంగిక సిబ్బందిని అధికారికంగా నియమించుకోకుండా..పనిచేయించుకుంటున్నారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో మంత్రుల వద్ద పనిచేసిన అంతరంగిక సిబ్బందితో పనిచేయించుకుంటూనే వారికి అధికారికంగా అక్కడ పనిచేస్తున్నట్లు ఉత్తర్వులు ఇవ్వలేదు. ఇప్పట్లో మంత్రి పేషీలో పనిచేస్తున్నట్లు ఉత్తర్వులు ఇవ్వలేం..! కొన్నాళ్లు ఆగండి....నాలుగైదు నెలలు ఆగితే పరిస్థితిలో మార్పువస్తుంది. ఆ తరువాత అధికారికంగా ఉత్తర్వులు ఇస్తాం..అప్పటి వరకు అనధికారికంగా పనిచేయండి..అని కొందరు మంత్రులు వారికి చెబుతున్నారు. దీంతో..తమను నియమించుకుంటారనే భరోసాతో..అధికార ఉత్తర్వులు లేకపోయినా..పాత మంత్రుల వద్ద పనిచేసిన అంతరంగిక సిబ్బంది..నూతన మంత్రుల వద్ద గొడ్డు చాకిరీ చేస్తున్నారు. ఉత్తర్వులు ఇస్తారనే ఆశతో..వారు గత మూడు నెలల నుంచి పనిచేస్తున్నా...వారి ఆశలు మాత్రం ఫలించే అవకాశాలు కనిపించడం లేదు. సీనియర్‌ మంత్రులు, 'జగన్‌'కు సన్నిహితులైన మంత్రులు కూడా ఈ విషయంలో ఏమీ చెప్పడం లేదు. మొత్తం మీద 'జగన్‌'కు సన్నిహితులైన వారి వద్ద పనిచేస్తున్న వారు..ఏదో రకంగా తమకు అధికార ఉత్తర్వులు ఇప్పిస్తారనే భరోసా పనిచేస్తున్నారు. మరి వారితో పనిచేయించుకుని చివరకు మొండి చేయి చూపుతారా..? ఎవరైతే ఏమిటి..? బాగా పనిచేస్తే...చాలు కదా..అని 'జగన్‌'భావించి వారిని కొనసాగిస్తారా..? చూద్దాం...మరి మాట..తప్పం.. మడమ తిప్పం..అంటే మాత్రం ఇప్పుడు గొడ్డు చాకిరి చేస్తున్నవారికి నిరాశ తప్పదు.

(408)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ