లేటెస్ట్

కార్యకర్తలకు షాక్‌ ఇచ్చిన ‘జగన్‌’...!

తెలుగుదేశం మహానాడుకు పోటీగా గుంటూరులో వైకాపా నిర్వహించిన ప్లీనరీ టిడిపికి ఎంత పోటీ ఇచ్చిందో లేదో కానీ, పార్టీ గౌరవ అధ్యక్షరాలితో రాజీనామా చేయించి ‘జగన్‌’ పార్టీ కార్యకర్తలకు షాక్‌ మాత్రం ఇచ్చారు. ఇటీవల ఒంగోలులో టిడిపి నిర్వహించిన మహానాడుకు మించిపోయేలా, పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి, టిడిపి కంటే మనమే మిన్నగా ఉన్నామని చాటుకోవాలనుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు నిన్న ప్లీనరీలో జరిగిన పరిణామాలు షాక్‌కు గురిచేశాయి. వాస్తవానికి నిన్న ‘విజయమ్మ’ పార్టీకి రాజీనామా చేస్తారని ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించింది. అయితే ‘జగన్‌’ను గుడ్డిగా ఆరాధించే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు దాన్ని నమ్మలేదు. ‘ఆంధ్రజ్యోతి’ ఏదో రాస్తుందిలే..దానికి మన పార్టీ అంటే పడదు కనుక..దానిలో నిజం లేదని చాలా మంది కార్యకర్తలు, నాయకులు భావించారు. వారివలే కొందరు సీనియర్‌ మంత్రులు కూడా భావించారు. ప్లీనరీలో ‘విజయమ్మ’ రాజీనామా చేస్తారంటకదా..అని సీనియర్‌ మంత్రి బొత్స సత్యనారాయణను కొందరు విలేకరులు ప్రశ్నించగా అదేమీ లేదు..యెల్లో మీడియా ఆ విధంగా రాస్తుందని, ఆమె రాజీనామా చేయరని ఆయన గట్టిగా చెప్పారు. అయితే..ఆయన అంచనాలు, ఎమ్మెల్యేలు, పలువురు మంత్రులు అంచనాలు తలకిందులు చేస్తూ ‘విజయమ్మ’ రాజీనామా చేశారు.


తొలుత ఆమెను మాట్లాడమని సీనియర్‌ నేత ‘ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు’ కోరినప్పుడు ఆమె తనపై జరుగుతున్న అవాస్త ప్రచారాన్ని ఖండిస్తారని సభలో ఎక్కువ మంది ఆశించారు. అయితే ఆమె ‘ఆంధ్రజ్యోతి’ చెప్పిన విధంగానే రాజీనామా విషయం చెప్పేశారు. దీంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. దీని తరువాత సభ మూడ్‌ మొత్తం మారిపోయింది. ‘విజయమ్మ’ రాజీనామా ఎందుకు చేసింది..? జగన్‌, షర్మిల మధ్య విభేదాలు తదితర విషయాల గురించే నాయకులు, కార్యకర్తలు సంభాషించుకోవడంతో అసలు విషయం పక్కదారి పట్టింది. మూడేళ్ల పాలనలో తాము చేసిన అభివృద్ధి రాబోయే రెండేళ్ల కాలంలో చేయాల్సిన పనుల గురించి, రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి ప్రస్తావించుకోకుండా ‘విజయమ్మ’ రాజీనామా గురించే సభలోని వారు చర్చించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆమె రాజీనామా తరువాత మాట్లాడిన మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు చంద్రబాబును దూషించడం, జగన్‌కు భజన చేయడంతో ఎవరూ వారిని పట్టించుకునే పరిస్థితి లేకపోయింది. మధ్యాహ్న భోజనం తరువాత సభలో పెద్దగా సభికులు కనిపించలేదు. కొంత మంది మంత్రులు ప్రసింగించేటప్పుడు ఖాళీ కుర్చీలు కనిపించాయి. మొత్తం మీద ‘మహానాడు’కు పోటీ అనుకున్న సభలో ‘విజయమ్మ’ రాజీనామాతో పేవలంగా ముగిసిందనే అభిప్రాయాలు స్వంత పార్టీ కార్యకర్తల నుంచే వినిపిస్తున్నాయి. నిన్నటి వరకు ‘ఆంధ్రజ్యోతి’ని దూషించిన కార్యకర్తలు చివరకు వారు రాసిందే నిజమైందని నిట్టూరుస్తూ ఇంటిముఖం పట్టారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ