WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

నాటకాల 'నాగబాబు'పై 'దేశం' ఎమ్మెల్యేల ఆగ్రహం...!

మండలాలకు తాసిల్దార్‌ల నియామకాలలో, బదిలీల్లో గుంటూరు డిఆర్‌ఒ 'నాగబాబు' అటు కలెక్టర్‌ను..ఇటు ఎమ్మెల్యేలను తప్పుదోవ పట్టిస్తూ ఆయన అడుగులకు మడుగులొత్తేవారిని, ఆయనను అన్నివిధాలుగా చూసుకునే వారిని సిఫార్సు చేస్తున్నారని అధికారపార్టీ ఎమ్మెల్యేలతో పాటు,మంత్రి పుల్లారావు కూడా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదున్నరేళ్ల నుండి 'నాగబాబు'ను డిఆర్‌ఒగా గుంటూరులో కొనసాగించడం ఏమిటి..? ఉద్యోగులను మూడేళ్లకే బదిలీ చేస్తుండగా..'నాగబాబు' విషయంలో ముఖ్యమంత్రి, మంత్రులు ఎందుకు మెతకవైఖరి అవలంభిస్తున్నారు. ఇటీవల కొందరు 'దేశం' ఎమ్మెల్యేలు తమ తమ పరిధిలోని మండలాల్లో తాసిల్దార్‌ల నియామకం విషయంలో తాము చెప్పిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ఇటు డిఆర్‌ఒకు, అటు కలెక్టర్‌కు చెప్పారు. కానీ ఆ విధమైన నియామకాలు, బదిలీలు జరగనివ్వకుండా 'నాగబాబు' ఒకపథకం ప్రకారం తనకు ఇష్టులైన వారి పేర్లను సిఫార్సు చేసి, వారితోనే ఒప్పించి కలెక్టర్‌కు చెప్పించారు. 'నాగబాబు' మాయమాటలు నమ్మి 'చంద్రబాబు'కు, అటు టిడిపికి వీరవిధేయులైన అధికారులను పక్కన పెట్టి...వ్యతిరేకులు, తటస్తులైన వారిని నియమిస్తున్నారు. అసలు విషయం తెలుసుకునేందుకు 'జనం ప్రత్యేక ప్రతినిధి' కొందరు ఎమ్మెల్యేలను దీనిపై ప్రశ్నించగా 'తాము కొన్ని పేర్లు ఇచ్చిన మాట యధార్థమేనని, కానీ వారందరూ సమర్థులు కాదు...నిజాయితీపరులు కాదని..'నాగబాబు' తమకే నచ్చచెబుతున్నారు..ఆయనే కొన్ని పేర్లు సూచించారని వారు చెప్పడం జరిగింది' తాము చెప్పింది ఒకటి...తమను ఒప్పించేది మరోటి..అని ఈ మూడేళ్ల నుంచి 'నాగబాబు' చేస్తున్నది ఇదని...దీనిపై సిఎంకు ఫిర్యాదు చేయాలని ఒక ఎమ్మెల్యే నిర్ణయించుకున్నారు. గుంటూరు జిల్లాకు ఏ ఐఎఎస్‌ అధికారి కలెక్టర్‌గా వచ్చినా..వారు డిఆర్‌ఒ నాగబాబు బుట్టలో పడిపోతూనే ఉన్నారు. నిన్న కాంతిలాల్‌దండే, నేడు కోనశశిధర్‌లకు 'నాగబాబు' చెప్పిందే వేదం అన్నట్లు జరుగుతోంది. 

  ఇటీవల 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ప్రచురించిన కథనం డిప్యూటీ ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి, సిసిఎల్‌, రెవిన్యూశాఖ ప్రత్యేక కార్యదర్శి దృష్టికి కూడా వెళ్లింది. సిఎంఒ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కూడా ఈ కథనంపై స్పందించారు. ఆర్‌డిఒలు, డిఆర్‌ఒలను బదిలీ చేసే అధికారం మంత్రి నుంచి తప్పించి ముఖ్యమంత్రి ఆమోదంతో చేస్తున్న నేపథ్యంలో ఆ ఇద్దరు అధికారులతో పాటు మంత్రి కూడా పరోక్షంగా అంగీకరిస్తున్నారు. ఎదుటి వారిని నమ్మించడంలో, తన మాటలగారడితో ఒప్పించడంలో డిఆర్‌ఒ నాగబాబుకు ఉన్న చతురత, అపార అనుభవం, ఇతర ప్రలోభాలు ఉపయోగించడంలో ఆయన సిద్ధహస్తులను పేరుంది. 'కన్నా లక్ష్మీనారాయణ' హయాంలో జిల్లా రెవిన్యూ వ్యవస్థనే శాసించిన 'నాగబాబు' తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా..తెరవెనుక ఉండి అధికారాలను చెలాయిస్తున్నారు. మాజీ మంత్రి 'కన్నా'కు 'నాగబాబు' అత్యంత సన్నిహితుడు...అప్పట్లో తెర ముందుండి ఆదేశాలు జారీ చేసేవారు..ఇప్పుడు తెరవెనుక ఉండి నడిపిస్తున్నారు. 

  విచిత్రమేమిటంటే ప్రజాప్రతినిధులుగా అనుభవం ఉన్న టిడిపి ఎమ్మెల్యేలు, మంత్రి పుల్లారావు, ఎంపిలు రాయపాటి సాంబశివరావు, గల్లాలు నాగబాబు బుట్టలో పడిపోయారంటే ఆయనకు ఉన్న తెలివితేటలు స్పష్టం అవుతున్నాయి. ఇటీవల కొందరు తాసిల్దార్‌లు టిడిపి ఎమ్మెల్యేలను కలసి ఇదేమిటి...సార్‌...! మా గురించి మీరు చెబుతున్నారు..చివరకు 'నాగబాబు' మాటలు విని వేరే వారికి రికమెంట్‌ చేస్తున్నారు...ఇప్పుడు మీకు అర్థం కాదు..ఎన్నికల నాటికి పరిస్థితి అర్థం అవుతుంది..జాగ్రత్తపడడండి అని సూచించారు. ఎవరైతే 'నాగబాబు' సిఫార్సుతో వివిధ మండలాల్లో నియమింపబడ్డారో..వారందరూ అధికార పార్టీ నాయకుల ఆదేశాలను పాటిస్తున్నారు..ఎమ్మెల్యే సూచనలను శిరసా వహిస్తున్నారు..అధికారం ఉంది కాబట్టి వింటున్నారు. ఎన్నికల సమయం నాటికి వారందరూ ఎదురు తిరిగితే పరిస్థితి ఏమిటి..? ఈ విషయాన్ని దేశం ఎమ్మెల్యేలు, మంత్రి కూడా ఆలోచించడం లేదు. చివరకు వారి అదృష్ట,దురదృష్టాలు ఎలా ఉంటాయో ఎన్నికల నాటికి తేలుతుందని తాసిల్దార్‌లు అంటున్నారు. ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేసిన వారిలో ఎక్కువ మంది టిడిపి అంటే అభిమానంతో ఉండేవారు. 2014 ఎన్నికల్లో తమ బంధుమిత్రులతోపాటు, ఉద్యోగులకు నచ్చ చెప్పి టిడిపికి ఓటు వేయించిన వారు కూడా ఉన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు కళ్లు తెరిచి పార్టీకి వీరవిధేయులైన అధికారులను నియమించుకుంటే పరిస్థితి కుదట పడుతుంది. లేదంటే ఎన్నికల నాటికి అనుభవం వస్తుంది.

(397)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ