లేటెస్ట్

రెండేళ్ల ముందే టిడిపి అభ్యర్థుల ప్రకటన...!

ఆఖరి క్షణం వరకు నానబెట్టి..నానబెట్టి..అభ్యర్థులను ప్రకటిస్తారని...ఏదో ఒక నిర్ణయం తీసుకోకుండా తమను ఇబ్బందులు పాలు చేస్తారని, ఇప్పటి వరకూ టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేస్తోన్న ఆరోపణ. ఇది..ఆరోపణేం కాదు..నిజం కూడా...! ఎటువంటి ఎన్నికలైనా చంద్రబాబు ఆఖరు క్షణం వరకూ తేల్చరు. ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి ఆయన వ్యవహరిస్తున్న తీరు ఇది. గతం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఎప్పటి దాకో ఎందుకు గత సార్వత్రిక ఎన్నికల్లో ఇదే జరిగింది. గత ఎన్నికల్లో చాలా మంది టిడిపి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా..ఆఖరి క్షణం వరకు వారిని మార్చకుండా, వారికి టిక్కెట్‌ ఇస్తున్నారో లేదో చెప్పకుండా నానబెట్టి చివరి క్షణంలో వారికే టిక్కెట్లు కేటాయించి చేతులు కాల్చుకున్నారు చంద్రబాబు. నాటి ఫలితాల ప్రభావమో..లేక..వేరే కారణాలేమైనా ఉన్నాయో తెలియదు కానీ..రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం అప్పుడే అభ్యర్థులను ప్రకటిస్తున్నారు ఆయన. ఎన్నికలకు దాదాపు రెండేళ్ల సమయం ఉండగానే ఆయన కొన్ని చోట్ల తన పార్టీ అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టిస్తున్నారు. గతానికి పూర్తి భిన్నంగా ఆయన దూకుడుగా వెళుతున్నారు. గతంలో మొహమాటాలకో..లేక ఇంకా గట్టి అభ్యర్థి కావాలన్న తలంపుతో, కులాలు, మతాలు, వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలనే ధ్యేయంతో ఆయన అభ్యర్థుల ఎంపికకు సుధీర్ఘ సమయం తీసుకునే వారు. కానీ ఈసారి అటువంటి పరిస్థితి రానీయడం లేదు. గత మూడేళ్ల నుంచి పార్టీ కోసం నిజాయితీగా, ధైర్యంగా పనిచేస్తోన్న వారిని నియోజకవర్గ ఇన్‌ఛార్జీలుగా ప్రకటిస్తున్నారు.


తాజా పర్యటనల సందర్భంగా పోటీ చేసే అభ్యర్థులను నేరుగా ప్రకటిస్తున్నారు.ప్రస్తుతం రాయలసీమలో పర్యటిస్తున్న ఆయన కడప, రాజంపేట లోక్‌సభ నియోజకవర్గాలకు టిడిపి అభ్యర్థులను ప్రకటించారు. కడప నుంచి శ్రీనివాసరెడ్డి, రాజంపేట నుంచి గంటా నరహరి, డోన్‌ నుంచి సుబ్బారెడ్డి, పీలేరు నుంచి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డిలు పోటీ చేస్తారని ప్రకటించారు. దీంతో ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉండగానే పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్లైంది. గతానికి భిన్నంగా ‘చంద్రబాబు’ అభ్యర్థులను ప్రకటించడంపై ఆ పార్టీలో సంతృప్తి వ్యక్తం అవుతోంది. ముందే అభ్యర్థులను ప్రకటిస్తే ఎన్నికలకు వారికి కావాల్సినంత సమయం దక్కుతుందని, పార్టీ తరుపున గట్టిగా పోరాడగలుగుతారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అదే విధంగా పార్టీ ఎన్నికల కదనానికి ఎంత కుతూహలంగా ఉందో కూడా ప్రత్యర్థులకు అర్థం అవుతుందనే భావన ఉంది. ముందుగానే పార్టీ అభ్యర్థులను ప్రకటించడం ఆయనలో ఉన్న ఆత్మవిశ్వాసానికి కారణమని, 1994 ఎన్నికల సమయంలో అప్పటి పార్టీ అధ్యక్షుడు ఎన్టీఆర్‌ ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆ ఎన్నికల్లో టిడిపి ఘనవిజయాన్ని సాధించింది. నాటి పరిస్థితులే నేడూ ఉన్నాయని, అందుకే ‘చంద్రబాబు’ ఎన్టీఆర్‌ కన్నా ఒకడుగు ముందుకేసి రెండేళ్ల ముందే అభ్యర్థులను ప్రకటిస్తున్నారని, దీని వల్ల పార్టీకి మేలు జరుగుతుందని, రాబోయే ఎన్నికల్లో పార్టీ ఘనవిజయాన్ని సాధిస్తుందని పార్టీ నేతలు, కార్యకర్తలు అంచనావేస్తున్నారు. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ