లేటెస్ట్

‘జగన్‌’ తప్పులను క్యాష్‌ చేసుకుంటోన్న ‘చంద్రబాబు’...!

గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయానికి గురైన రాయలసీమ ప్రాంతంలో టిడిపి మళ్లీ పట్టుసాధించడానికి యత్నాలు చేస్తోంది. 2019 ఎన్నికల్లో ఈ ప్రాంతంలో టిడిపి కేవలం మూడు స్థానాలు మాత్రమే సాధించింది. మొత్తం 52 స్థానాలు ఉన్న రాయలసీమలో మూడు స్థానాలు గెలవడమంటే..ఈ ప్రాంతంలో దాదాపు తెలుగుదేశం పరిస్థితి అయిపోయినట్లే. నాలుగు జిల్లాలు ఉంటే రెండు జిల్లాలో టిడిపికి సున్నా సీట్లు వచ్చాయి. మరో జిల్లాలో ఒకటి ..ఇంకో జిల్లాలో రెండుసీట్లు వచ్చాయి. ఇటువంటి ఫలితాలు సాధించిన ఈ ప్రాంతంలో మళ్లీ టిడిపి పుంజుకోవడం అసాధ్యమని నిన్న మొన్నటి వరకూ రాజకీయ పరిశీలకులు భావించారు. అయితే గత ఆరు నెలల నుంచి పరిస్థితిలో అనూహ్య మార్పులు వస్తున్నాయి. తమకు ఎదురులేదని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టిడిపిని చిత్తు చిత్తు చేస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా నేతలు ప్రస్తుతం నోరు మెదపడం లేదు. ఈ ప్రాంత ప్రజల్లో వచ్చిన మార్పే దీనికి కారణం. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి మూడేళ్ల పరిపాలన తరువాత ఆయనపై ప్రజల్లో ప్రభలుతున్న వ్యతిరేకతతో గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదనే వారు అర్థం చేసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు రాయలసీమకు ఎన్నో వాగ్ధానాలను చేసి, ఎన్నికల్లో గెలిచిన తరువాత ఒక్క హామీనీ నెరవేర్చకపోవడంతో ప్రజలు ‘జగన్‌’ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పరిపాలనాపరంగా చేసిన తప్పులే కాకుండా, ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయకపోవడం, ప్రజలను కలవకపోవడం, ప్రజల ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం ‘జగన్‌’ పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ప్రభుత్వం చేసిన తప్పులను ‘చంద్రబాబు’ ప్రస్తుతం క్యాష్‌ చేసుకుంటున్నారు. మదనపల్లి, రాజంపేట ప్రత్యేక జిల్లాలు కాకపోవడం ప్రజలను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. అదే విధంగా ‘నగరి’ విషయంలోనూ జరిగింది.


ప్రస్తుతం రాయలసీమలో పర్యటిస్తోన్న టిడిపి అధినేత చంద్రబాబు ప్రజల ఆకాంక్షలను తెలుసుకుని తాము అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాల విభజనలో జరిగిన తప్పులను సరిదిద్దుతానని హామీ ఇచ్చి వారిని ఆకట్టుకుంటున్నారు. అదే విధంగా చేనేత కార్మికులు అధికంగా ఉన్నచోట వారికి టెక్స్‌టైల్స్‌ పార్కు, 500 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తానని భరోసా కల్పించారు. రంగుల ఫ్యాక్టరీల వల్ల నీటి కాలుష్యానికి శాశ్వత పరిష్కారం చూపుతానని ఆయన హామీ ఇచ్చారు. అగ్నికుల క్షత్రియులను బీసీలుగా గుర్తించడం, నల్లబెల్లంపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేసి చెరుకు రైతులను ఆదుకుంటామని ఆయన ఇస్తోన్న హామీలు ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. రాయలసీమ ప్రజలను ఆకర్షించడం కోసం ‘చంద్రబాబు’ వారు కోరిన న్యాయమైన కోర్కెలను నెరవేరుస్తానని హామీ ఇస్తున్నారు. మూడేళ్ల క్రితం తాము అడిగినవాటినీ, అడగవాటినీ చేస్తానన్న ‘జగన్‌’ అధికారంలోకి వచ్చిన తరువాత కనీసం తమను పలకరించడంలేదని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా కడప జిల్లాలోని అన్నమయ్య డ్యామ్‌ కొట్టుకుపోయిన బాధిలకు న్యాయం చేయకపోవడం, స్టీల్‌ప్లాంట్‌, ఇతర పరిశ్రమలను తీసుకురాకపోడం వంటి ‘జగన్‌’ చేసిన తప్పులను ‘చంద్రబాబు’ క్యాష్‌ చేసుకుంటున్నారు. ‘జగన్‌’ అనాలోచితంగా చేసిన తప్పులను వెదికిపట్టుకుంటూ ‘చంద్రబాబు’ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. మొత్తం మీద..రాబోయే ఎన్నికల్లో ‘జగన్‌’ పార్టీకి గతంలో వచ్చిన ఫలితాలు రావని తాజా పరిస్థితులు స్ఫష్టం చేస్తున్నాయి.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ