లేటెస్ట్

‘సత్య’ను టార్గెట్‌ చేసిన వైకాపా మీడియా...!

బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ను వైకాపాకు చెందిన మీడియా టార్గెట్‌ చేసింది. ఆయనను టిడిపి ఏజెంట్‌ అని, బిజెపిలో ఉన్న టిడిపి మోల్‌ అంటూ వార్తలు ప్రచురిస్తోంది. గత కొంతకాలంగా వైకాపా పాలనపై ఏ బిజెపి నేత చేయనటువంటి విమర్శలు, ఆరోపణలు చేస్తోన్న ‘సత్యకుమార్‌’ను గత కొన్నాళ్లుగా వైకాపాకు మద్దతు ఇస్తోన్న మీడియా ఆడిపోసుకుంటోంది. తాజాగా రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ వైకాపా మద్దతు అడగలేదని, వారంతట వారే ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారన్న ‘సత్యకుమార్‌’ వ్యాఖ్యలపై విరుచుకుపడుతోంది. ‘సత్యకుమార్‌’ సుజనాచౌదరి, సిఎం రమేష్‌, టిజి వెంకటేష్‌, ఆదినారాయణరెడ్డిల వలే టిడిపి ఏజెంట్‌గా ఉన్నారని, ఆయన అనవసర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని వైకాపా నాయకులతోపాటు, వారికి చెందిన మీడియా విమర్శిస్తోంది.  ‘సత్య’ టిడిపిని భుజానమోస్తున్నారని, కులకోణంలో ఆయన వ్యవహరిస్తున్నారని, స్వంతపార్టీ ప్రయోజనాలకన్నా, టిడిపి ప్రయోజనాలే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారని ఎద్దేవా చేస్తోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి వంటి నేతలు పార్టీ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్నారని, అటువంటి నేతల్లా ‘సత్య’ పనిచేయడం లేదని ఆ మీడియా పేర్కొంటోంది. కాగా రాష్ట్రపతి ఎన్నికల్లో వైకాపా మద్దతును తమ పార్టీ కోరలేదన్న ‘సత్య’ వ్యాఖ్యలపై బిజెపి అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందని, ఆయన తీరును అధిష్టానం తప్పుపట్టిందని వ్యక్తిగత ఎజెండాలను వద్దని, ఒక వేళ అలా చేయాలనుకుంటే ఇష్టమైన పార్టీలోకి ఆయన వెళ్లాలని ఆ సెక్షన్‌ మీడియా పేర్కొంది. గత కొంతకాలంగా రాష్ట్రంలో వైకాపాకు వ్యతిరేకంగా, ప్రజలకు మద్దతుగా ‘సత్య’ పోరాడుతున్నారు. ఏ బిజెపి నేత చేయని విధంగా వైకాపాను లక్ష్యంగా చేసుకుని పోరాడడం సహించలేని వైకాపా ఆయనను టార్గెట్‌ చేసుకుందనే మాట వినిపిస్తోంది. నిన్న మొన్నటి వరకూ సుజనాచౌదరి, సిఎం రమేష్‌ తదితరులను టిడిపి ఏజెంట్లుగా ప్రచారం చేసిన వైకాపా ఇప్పుడు ‘సత్య’ను లక్ష్యంగా చేసుకుందని బిజెపి నేతలు కొందరు అంటున్నారు. మొత్తం మీద బిజెపి అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు నెరపుతున్న వైకాపా తమకు మేకులా ఉన్న ‘సత్య’ను టార్గెట్‌ చేసిందని, ఆయనను రాష్ట్రం నుంచి తప్పించే విధంగా వ్యవహారాలు నడుపుతోంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ