WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

గుజరాత్‌లో 'మోడీ'ని పరిగెత్తిస్తున్న కాంగ్రెస్‌...!

కాంగ్రెస్, బిజెపి హోరాహోరి పోరు...!

రాజకీయాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. వారం రోజుల కింద ఉన్న పరిస్థితి నేడు ఉండదు. నేడు ఉన్న పరిస్థితి మరో రోజు ఉండదు. రాజకీయాల్లో ఇది అతి సాధారణమైన అంశమే. ప్రస్తుతం దేశ రాజకీయాలను పరిశీలిస్తే నిన్న మొన్నటి దాకా...రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయడం లాంఛనమేనని ఎక్కువ మంది భావించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. 'మోడీ' ప్రభుత్వం మళ్లీ ఢిల్లీ గద్దె దక్కించుకోవడానికి అపసోపాలు పడుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కేవలం ఢిల్లీనే కాదు..దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా ఎన్నికలు జరగబోయే 'గుజరాత్‌'లో  బిజెపి పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తోంది. గత ఆగస్టులో నిర్వహించిన ఓ సర్వేలో  గుజరాత్‌లో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా బిజెపి విజయం లాంఛనమేనని తేలింది.  1998 నుంచి ఈ రాష్ట్రంలో పాగా వేసిన 'బిజెపి' మరోసారి సునాయాసంగా విజయం సాధిస్తుందని కాంగ్రెస్‌ కన్నా బిజెపికి 30శాతం ఓట్లు అదనంగా వచ్చి ఘన విజయం సాధిస్తుందని తెలిపింది. అయితే దీపావళి పర్వదినం ముందు అంటే అక్టోబర్‌లో నిర్వహించిన సర్వేలో అనూహ్యమైన మార్పు కొట్టొచ్చినట్లు కనిపించింది. ఈ సర్వేలో బిజెపికి ఆరుశాతం మాత్రమే ఆధిక్యం కనిపించింది. కేవలం మూడు మాసాల్లో 30శాతం ఆధిక్యం నుంచి బిజెపి ఆధిక్యం 6శాతానికి దిగజారింది. అంటే ఎన్నికల్లో కాంగ్రెస్‌, బిజెపి హోరాహోరి తలపడుతున్నట్లు ఈ సర్వేల సారాంశం. అసలైన ఫలితాలు డిసెంబర్‌18న వెల్లడి అవుతాయి. మరో మూడు వారాల పాటు కాంగ్రెస్‌ ఇదే పట్టును కొనసాగించి ప్రజల్లో వేగంగా దూసుకెళ్లగలిగితే.. ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు 'అమిత్‌షా'లో స్వంత రాష్ట్రంలో వారికి షాక్‌ ఇవ్వడం ఖాయమే...!

కలసి రానున్న కులాల కలయిక...!

హఠాత్తుగా కాంగ్రెస్‌ ఇంత బలపడడానికి ప్రధాన కారణం..ఆ రాష్ట్రంలోని కులాల కలయికే. గతంలో బిజెపికి గట్టి మద్దతు దారులుగా ఉన్న   పట్టిదార్‌ లేక పటేల్స్‌  ఇప్పుడు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌ వైపు వస్తున్నారు. గతంలో ఆ కులానికి చెందిన వారిలో దాదాపు ముప్పావు వంతు ఓటర్లు బిజెపికి మద్దతు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ మద్దతు శాతం పావుశాతానికి పడిపోయింది. ఆగస్టులో 'పటేల్స్‌'ల్లో 58శాతం మంది బిజెపికి ఓటు వేస్తామని చెప్పగా ఇప్పుడు వారిలో 20శాతం మందే బిజెపికి ఓటు వేస్తామని చెబుతున్నారు. పటేల్స్‌కు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న 'హార్దిక్‌పటేల్‌' బిజెపిని ఓడించడమే తన లక్ష్యమని, బిజెపిని ఓడించే శక్తి కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని, తాము అందుకే ఆ పార్టీ మద్దతు ఇస్తున్నామని బహిరంగా ప్రకటించారు. పటేల్‌ కులంలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటిస్తున్నారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ సౌరాష్ట్ర మరియు నార్త్‌ గుజరాత్‌లో ఘననీయంగా పుంజుకుంటోంది. పటేల్స్‌ మద్దతుతో కాంగ్రెస్‌ మొత్తం ఓట్లలో 12-15శాతం తన వైపు ఈ ప్రాంతంలో తిప్పుకోగలుగుతోంది. అయితే బిజెపి పటేల్స్‌లో తనకు ఉన్న పలుకుబడిని కొనసాగించాలని గట్టిపట్టుదలతో పోరాడుతోంది. పటేల్స్‌ కోరుతున్న రిజర్వేషన్లు కాకుండా ఇతర మార్గాల్లో వారికి సహాయపడాలని, ఆ కులంలో ప్రముఖమైన నాయకులను తన వైపు తిప్పుకుని పరిస్థితి తనకు అనుకూలంగా మార్చుకోవాలని యత్నిస్తోంది.

దళితుల ఓటు కాంగ్రెస్‌కే...!

గుజరాత్‌లో ఉన్న ఠాకూర్‌, క్షత్రియ, కోలి మరియు దళిత ఓటర్లు అనాదిగా కాంగ్రెస్‌ నే సమర్థిస్తూ ఉన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఓటర్లలో బిజెపి చీలిక తెచ్చి బాగా లాభపడింది. అయితే ఇప్పుడు ఈ కులాలన్నీ మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరుతున్నాయి. బిసీలకు,ఎస్‌టి,ఏక్తా మంచ్‌ మరియు గుజరాత్‌ క్షత్రియ ఠాకూర్‌ సేనలు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నాయి. ముస్లిం మైనార్టీలు కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. దక్షిణ గుజరాత్‌లోని పలు జిల్లాల్లో గణనీయంగా ఉన్న ఆదివాసీలు కాంగ్రెస్‌ ఛత్రంలోకి చేరుతున్నారు. 2014 ఎన్నికల్లో వీరంతా బిజెపికి మద్దతు ఇవ్వడంతో మొత్తం 26 లోక్‌సభ సీట్లు ఆ పార్టీ గెలుచుకోగలిగింది. అయితే ఇప్పుడు వీరంతా తిరిగి కాంగ్రెస్‌ వైపు చూస్తుండడంతో ఎన్నికల్లో కాంగ్రెస్‌ గట్టిగా పోరాడబోతోంది. పటేల్స్‌, ఒబిసీలు, దళితులు, ఆదివాసీలు తమ కులాలకు అతీతంగా కాంగ్రెస్‌ వైపు ఏకమవుతున్నారు. మొత్తం 27 రిజర్వడ్‌ నియోజకవర్గాలు ఉన్న గుజరాత్‌లో వీరు కీలకం కానున్నారు. 2012 ఎన్నికల్లో  ఈ రిజర్వడ్‌ సీట్లలో 10స్థానాలను దక్కించుకుంది. మరి రాబోయే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉండబోతుందో..!?

ప్రతి కులంలోనూ ఆర్థికఇబ్బందులు...!

ఓటర్లల్లో పలు కులాలకు చెందిన వారు తాము ఆర్థికఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో (54%) మంది తాము ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నామని చెబుతున్నారు. వీరిలో బిజెపిని సమర్థించే ఉన్నత కులాలకు చెందిన పటేల్స్‌ ఇతర వర్గాలు వారు కూడా ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉన్నత కులాలకు చెందిన వారు ఇప్పుడు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు.

ప్రభావితం చేయనున్న జిఎస్‌టి...!

పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టిలు బిజెపిపై తీవ్ర ప్రభావం చూపించబోతున్నారు. ప్రతి ఐదుగురిలో ఇద్దరు జిఎస్‌టిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఆగస్టులో ప్రతి నలుగురిలో ఒకరు మాత్రమే వ్యతిరేకంగా మాట్లాడేవారు. పెద్దనోట్ల రద్దుపై మొదట మద్దతు ఇచ్చిన వర్గాలు తరువాత తమ అభిప్రాయాన్ని మార్చుకున్నాయి. నోట్లరద్దు పై ఎక్కువ మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 44శాతం మంది నోట్లరద్దు, జిఎస్‌టిల వల్ల తమ ఉపాధి,వ్యాపారం దెబ్బతిన్నాయని చెబుతున్నారు. ట్రేడ్‌ వర్గాల్లో  కాంగ్రెస్‌పై బిజెపి ఆధిపత్యం నాలుగు శాతానికే పరిమితమైంది. ఆర్థిక పరిస్థితుల వల్ల ధరలు పెరుగుదల మరియు నిరుద్యోగం రోజు రోజుకు పెరిగిపోతోంది. మొత్తం సర్వేలో పాల్గొన్న వారిలో 19శాతం మంది ధరలు ఓటింగ్‌లో ప్రభావం చూపుతాయని చెప్పగా, 11శాతం మంది ఉద్యోగాలు, మరో 10శాతంమంది పేదరికం ప్రభావం చూపుతాయని తెలిపారు. కాగా కాంగ్రెస్‌ పార్టీ యువకులు,రైతులపై ప్రత్యేక దృష్టిసారించి ప్రచారం నిర్వహిస్తోంది. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దీనిపై ప్రత్యేక దృష్టిసారించారు. సోషల్‌ మీడియాలో యువత కాంగ్రెస్‌ను బలపరుస్తూ పోస్టింగ్‌లు పెడుతున్నారు. అయితే కాంగ్రెస్‌కు పట్టణాల్లో మహిళల నుంచి గట్టి అవరోధాలు ఎదురువుతున్నాయి. వారంతా బిజెపికే మద్దతుగా నిలుస్తున్నారు.  కాంగ్రెస్‌ ప్రచారాన్ని అడ్డుకోవడానికి ప్రధాని మోడీ పలుసార్లు గుజరాత్‌లో ఎన్నికల ప్రచారాలను నిర్వహిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముందే ఆయన పలుసార్లు రాష్ట్రంలో పర్యటించారు. ఆగస్టులో ఐదుసార్లు, అక్టోబర్‌లో నాలుగు సార్లు ఆయన పర్యటనలు సాగించారు.అయితే 'మోడీ'కి సాటివచ్చే ఎన్నికల ప్రచారనిర్వహకుడు కాంగ్రెస్‌కు లేకపోవడం  ఇక్కడ గమనించాల్సిన విషయం.

పెరుగుతున్న అసంతృప్తి...!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనపై సగటు గుజరాతీ తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకు ఈ అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరుతోంది. గత మేలో నిర్వహించిన ఓ సర్వేలో మూడు వంతుల మంది ఓటర్లు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేశారు. అది ఆగస్టులో 2/3శాతానికి తగ్గగా, ప్రస్తుతం అది ఇప్పుడు సగానికి జారిపోయింది. ముఖ్యమంత్రి విజయ్‌రూపానీ పాలనపై కూడా అదే స్థాయిలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది.  కాగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి కాంగ్రెస్‌కు వస్తోన్న అనుకూల పవనాలు బిజెపిలో అల‌జడి సృష్టిస్తోంది. ఇప్పుడు చేసిన సర్వేలో రెండు పార్టీల మధ్య తేడా పెద్దగా లేకపోవడం కూడా వారిలో తీవ్ర కలకలానికి కారణమైంది. కాంగ్రెస్‌ వస్తోందన్న నినాదం గుజరాతీయులను కదిలిస్తోంది. అదే సమయంలో బిజెపి చేస్తోన్న ప్రచారానికి ప్రజల నుంచి స్పందన రావడం లేదు. ప్రస్తుతానికి రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్న కాంగ్రెస్‌ హవా..రానున్న కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కనిపించవచ్చు. అదే సమయంలో చిన్న పార్టీలు, కుల సంఘాలను కలుపుకుని కాంగ్రెస్‌ ముందుకు వెళితే..వారిని ఓటింగ్‌ బూత్‌లకు తీసుకెళితే...రాష్ట్రంలో కాంగ్రెస్‌ తుఫాన్‌ సృష్టించగలుగుతుంది. ఈ తుఫాన్‌ బిజెపి పునాదులను కదిలించివేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు...!




(754)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ