లేటెస్ట్

తెలంగాణ సిఎం ప్రమాణ స్వీకారానికి వెళ్ళేది చంద్రబాబా...లేక జగనా...!?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని విశేషంగా ఆకర్షించిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలుగువారంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నిన్న పోలింగ్‌ జరిగిన తరువాత వచ్చిన ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు మిశ్రమంగా రావడంతో ఎన్నికల ఫలితాలపై ఇంకా ఉత్కంఠత పెరిగింది.  మెజార్టీ సర్వేలు కాంగ్రెస్‌దే అధికారమని చెబుతున్నా..కొంత మందిలో ఏదో సందేహం..మ్యాజిక్‌ మార్కు దగ్గర కాంగ్రెస్‌ ఆగిపోతుందేమోనని, ఒకటి రెండు సీట్లు తక్కువ వస్తే..బిఆర్‌ఎస్‌, బిజెపి, ఎంఐఎంలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే భావన కొందరిలో ఉంది. అయితే..అటువంటిదేమీ జరగదని కాంగ్రెస్‌ ఖచ్చితంగా గెలుస్తుందని ఎక్కువ మంది విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల తీర్పు స్పష్టంగా ఉందని, అధికార బిఆర్‌ఎస్‌ ఓడి తీరుతుందని, కాంగ్రెస్‌దే అధికారమనే భావన వ్యక్తం అవుతోంది. దీనిపై తెలంగాణ, సీమాంధ్రలో భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే కాంగ్రెస్‌ గెలుస్తుందని, చంద్రబాబు ప్రియశిష్యుడు ‘రేవంత్‌రెడ్డి’ సిఎం అవుతారని, ముందుగానే రేవంత్‌రెడ్డి ప్రకటించినట్లు 9వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని, దానికి చంద్రబాబునాయుడు హాజరవుతారని టిడిపి అభిమానులు, కార్యకర్తలు అంచనా వేస్తున్నారు. 


వాస్తవానికి తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో టిడిపి పోటీ చేయలేదు. అయితే ఆ పార్టీ నాయకులు, కార్తకర్యలు కాంగ్రెస్‌కు అనుకూలంగా పనిచేశారు. టిడిపి అధికారికంగా ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. అయితే తమ పార్టీ అధినేత చంద్రబాబును, టిడిపిని టార్గెట్‌ చేస్తోన్న బిఆర్‌ఎస్‌, బిజెపిలకు వ్యతిరేకంగా టిడిపి అభిమానులు, కొంతమంది కార్యకర్తలు పనిచేశారు. అంతే కాకుండా కాంగ్రెస్‌ గెలవాలని ఆ పార్టీ వారు గట్టి పట్టుదలగా పనిచేశారు. కెసిఆర్‌, మోడి,జగన్‌లు టిడిపికి బద్ధశత్రువులని, బిఆర్‌ఎస్‌ను ఓడిస్తే వారి ముగ్గురిని ఓడిరచినట్లేనన్న భావనతో టిడిపి మద్దతుదారులు, సానుభూతిపరులు, కార్యకర్తలు, ఇతర నాయకులు పనిచేశారు. దీంతో వారు అంచనా వేసిన విధంగా జరిగితే రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరవుతారని వారు భావిస్తున్నారు. ఒకవేళ అలా జరగక బిఆర్‌ఎస్‌ గెలిస్తే ముచ్చటగా మూడోసారి కెసిఆర్‌ సిఎం అవుతారని, ఆయన ప్రమాణ స్వీకారానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ హాజరవుతారనే అంచనాలు ఉన్నాయి. తెలంగాణాలో కెసిఆర్‌ గెలవడానికి ‘జగన్‌’ సహకరించారని, పోలింగ్‌ రోజు నాగార్జునసాగర్‌ డ్యామ్‌ వద్ద దీనికోసమే ఉద్రిక్తలు సృష్టించారనే అపోహలు చాలా మందిలో ఉన్నాయి. గతంలో చంద్రబాబును ఓడిరచడానికి కెసిఆర్‌ ‘జగన్‌’కు సహకరించారని, అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్‌ ఓటమికి ‘జగన్‌’ తన వంతు ప్రయత్నాలు చేశారని, ఆయన కృషి ఫలించి ‘కెసిఆర్‌’ మళ్లీ గెలిస్తే ఆయన ప్రమాణ స్వీకారానికి ‘జగన్‌’ హాజరువుతారనే భావన వ్యక్తం అవుతోంది. మొత్తం మీద తెలంగాణ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు వెళతారా..లేక ‘జగన్‌’ వెళతారా..అనేది ఆదివారం నాడు తేలుతుంది. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ