లేటెస్ట్

‘ముర్ము’ ‘బాబు’ను కలిసిందా...వైకాపాలో విస్మయం...!

రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా అరుదైన కలయికలు జరిగాయి. గత సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి ఉప్పూ...నిప్పూల ఉన్న ‘టిడిపి’, బిజెపిలు చాలా రోజుల తరువాత ఒకే వేదికపై కనిపించారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ‘ముర్ము’ విజయవాడ పర్యటన సందర్భంగా అరుదైన దృశ్యాలు కంటపడ్డాయి. 2014 ఎన్నికల్లో కలిసిపోటీ చేసి, కేంద్ర, రాష్ట్రాలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసి, తరువాత కాలంలో విడిపోయిన బిజెపి, టిడిపిలు ‘ముర్ము’ పరట్యనలో కలిశారు. తొలుత ‘ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ప్రకటించినప్పుడు ‘టిడిపి’ స్పందించలేదు. దీంతో ‘టిడిపి’ ఏమి చేస్తుందనే దానిపై ఎవరూ పెద్దగా చర్చించుకోలేదు. అయితే వైకాపా మాత్రం ఎన్టీఏ అభ్యర్థిని ప్రకటించిన వెంటనే వారికి మద్దతు తెలియజేసింది. అయితే ‘ముర్ము’ రాష్ట్ర పర్యటన ఖరారు అయిన తరువాత ‘టిడిపి’ తాము కూడా ‘ముర్ము’కు మద్దతు ఇస్తున్నామని నిన్న తెలిపారు. అయితే ‘టిడిపి’ ‘ముర్ము’కు మద్దతు ఇచ్చినా..ఆ పార్టీ నేతలను ఆమె కలుస్తారా..? లేదా..అనే దానిపై స్పష్టత లేదు. ముందుగా అనుకున్న ప్రకారం తనకు మద్దతు ఇచ్చిన వైకాపాకు కృతజ్ఞతలు తెలిపేందుకు మంగళవారం నాడు ‘ముర్ము’ విజయవాడలో పర్యటించారు. వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలతో నిర్వహించిన సమావేశం తరువాత వారికి కృతజ్ఞతలు తెలియచేసి, ఆమె తిరిగి వెళ్లిపోతారని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ఆమె ‘టిడిపి’ అధినేత ‘చంద్రబాబు’ కూడా కలిసి తనకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియచేశారు.  


ఇదే సందర్భంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు మరికొందరు బిజెపి నేతలు ‘టిడిపి’ అధినేత వద్దకు వచ్చారు. అక్కడ జరిగిన సమావేశంలో ‘కిషన్‌రెడ్డి’ మాట్లాడుతూ గతంలో ఎన్డీఏ అబ్ధుల్‌ కలాంను రాష్ట్రపతిగా చేసిన సమయంలో ‘చంద్రబాబు’ క్రియాశీలకంగా వ్యవహరించారని, ఇప్పుడు కూడా అదే విధంగా ఆయన ‘ముర్ము’కు మద్దతు తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని అన్నారు. గతంలో తాము కలిసిఉన్నప్పుడు జరిగిన విషయాలను ప్రస్తావించడం, పెద్దగా బలం లేని టిడిపి కోసం ‘ముర్ము’ను తీసుకురావడం రాజకీయవర్గాల్లో ఆసక్తిని కలిగించింది. ఎంతో బలం ఉన్న వైకాపా సమావేశం కంటే ‘చంద్రబాబు’ను కలిసినప్పుడే ‘ముర్ము’ పర్యటనకు ఒక్కసారిగా ప్రాధాన్యత వచ్చింది. ఇదే విషయంపై వైకాపాలో కూడా విస్మయం వ్యక్తం అవుతోంది. తమతో ‘ముర్ము’ సమావేశం అయిన తరువాత నేరుగా ఆమె వెళ్లిపోతారని, ‘టిడిపి’తో కలవరని వైకాపా నేతలు భావించారు. అయితే వారి అంచనాలను తోసిరాజని ‘చంద్రబాబు’తో ‘ముర్ము’ సమావేశం కావడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. బయటకు చెప్పకపోయినా..మంగళవారం జరిగిన పరిణామాలు వారిని నిరుత్సాహానికి గురిచేశాయి.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ