సంక్షేమం ఓట్లు తెచ్చిపెట్టదు...!
ప్రపంచం మొత్తం మీద తమ వైపు చూసేలా పరిపాలన చేస్తున్నామని, వచ్చే మరో 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డే ఉంటారని ఊదరగొడుతున్న వైకాపా నేతలు ఆశలు ఆవిరి చేసే వార్త ఇది. కేవలం సంక్షేమం ఓట్లు తెచ్చిపెట్టదని, లక్షలకోట్ల రూపాయలతో నంక్షేమపథకాలు అమలు చేసినా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయడం లేదని, వైకాపా పాలనపై మెజార్టీ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలింది. రాష్ట్ర ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సొమ్ములు అందిస్తున్నామని, ప్రతివర్గానికి ఏదో రూపంలో కాసులు ముట్టచెబుతున్నామని, తమ పాలన దేశానికి ప్రపంచానికి ఆదర్శమని ముఖ్యమంత్రి జగన్‌తో పాటు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఇతర నాయకులు బాకాలు ఊదుకుంటున్న వైనం తెలిసిందే. పైగా తాను అమలు చేస్తోన్న సంక్షేమపథకాలను ఆపడానికి ప్రతిపక్ష తెలుగుదేశం, తనకు గిట్టని మీడియా అడ్డుకుంటుందని, వీరంతా కలిసి తన బొచ్చుకూడా పీకలేరని ముఖ్యమంత్రి పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆయన అనుకున్నట్లు లేదని, కేవలం కొన్ని వర్గాలకు నామ మాత్రంగా సంక్షేమపథకాలు అమలు చేసి, అదే పరిపాలన అంటోన్న ముఖ్యమంత్రిపై మెజార్టీ ప్రజలు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆ సర్వే పేర్కొంది. దేశంలో అత్యంత ప్రజాధరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో ‘జగన్’ 21వ స్థానంలో ఉన్నారంటే ఆయన పాలనపై ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో స్పష్టం అవుతోంది.
కొన్ని వర్గాలకు సొమ్ములు పంచిపెడుతూ, మిగతా వర్గాలపై, పార్టీలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతూ, అభివృద్ధి అనే మాటే లేకుండా పాలన చేస్తోన్న ‘జగన్’ తీరు వల్లే ఇటువంటి ఫలితాలు వచ్చాయని సర్వే చెబుతోంది. రైతు,ఉద్యోగ,కార్మిక,కర్షక వర్గాలతోపాటు అన్ని వర్గాలనూ ఇబ్బంది పెడుతూ సాగుతోన్న పాలనపై ప్రజలు ఇంతకంటే మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేరని, సీఎన్‌వోఎస్ సర్వే ప్రజాభిప్రాయాన్ని ప్రతిభింబింపచేసిందని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. మొత్తం మీద సంక్షేమ పథకాలు ఓట్లు తెచ్చిపెట్టవని వచ్చే ఎన్నికల్లో లోకానికి తెలుస్తుందని కూడా వారు వ్యాఖ్యానిస్తున్నారు. గత టిడిపి పాలనలో ఇంతకంటే మెరుగైన సంక్షేమాన్ని అందించిందని, వారు సంక్షేమంతో పాటు, అభివృద్ది చేశారని, కానీ ప్రజలు అంతకంటే మంచిపాలన కావాలని కోరుకుని ‘జగన్’ను అధికారంలోకి తెచ్చారని, ఇప్పుడు కేవలం పరిమిత స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని, ఇదే సమయంలో ఉపాధిలేమి, ధరల పెరుగుదల, అభివృద్ధిలేమి,మితిమీరిన అహంభావం, లెక్కలేనితనం, అప్పులు, అవినీతి, అక్రమాలు ‘జగన్’పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్చు చేశాయని, దాని ఫలితం రానున్న ఎన్నికల్లో అనుభవిస్తారనే అభిప్రాయాలు వివిధ వర్గాల నుంచి వ్యక్తం అవుతున్నాయి.