WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'సౌరాష్ట్ర'లో వణుకుతున్న 'బిజెపి'...!

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బిజెపికి అన్ని వైపుల నుంచి ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. తమకు గట్టిపట్టు ఉన్న ప్రాంతాల్లోనూ ఆ పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయి. పూర్తి చలికాలం రాకముందే ఓటర్ల నాడి తెలిసిన 'బిజెపి' నాయకులు గజగజ వణికిపోతున్నారు. ముఖ్యంగా తమకు అత్యంత అనుకూలంగా ఉండే 'సౌరాష్ట్ర' ప్రాంతంలో వారికి ఎదురుగాలి వీస్తోంది. దేశంలో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే 'ఉత్తరప్రదేశ్‌'లో వలే ఎక్కువ సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుందో..అదే విధంగా 'గుజరాత్‌'లో ఏ పార్టీ అయినా విజయం సాధించాలంటే 'సౌరాష్ట్ర'లో మెజార్టీ సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. మొత్తం 182 సీట్లు ఉన్న గుజరాత్‌ అసెంబ్లీలో ఈ ప్రాంతం నుంచే ఎక్కువగా 54 సీట్లు ఉన్నాయి. వెనుక బడిన ఈ ప్రాంతంలో కులతత్వం పాళ్లు ఎక్కువే. 12జిల్లాలు కలిగిన 'సౌరాష్ట్ర'లో ఇంతకు ముందు బిజెపికి మంచి పట్టు ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ 3/4వంతు సీట్లు సాధించి బిజెపి ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్‌ ఇక్కడి ఓటర్లపై క్రమంగా పట్టుసాధిస్తోంది.

   కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు 'రాహుల్‌గాంధీ' ఈ ప్రాంతంపై పట్టుసాధించడానికి గట్టిగా కృషి చేస్తున్నారు. గత సెప్టెంబర్‌లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడ నుంచి ప్రారంభించారు. ముందుగా ఆయన హిందూ క్షేత్రాలను దర్శించుకుంటూ హిందువులను ఆకర్షించారు.  కోస్తా సౌరాష్ట్రలో  ద్వారకాద్వేష్‌ దేవాలయం నుండి తన యాత్రను ప్రారంభించి జామానగర్‌,రాజ్‌కోట్‌ మరియు మోర్బీల గుండా పవిత్రమైన సోమనాథ్‌ దేవాలయానికి వెళ్లారు. అక్కడ నుంచి మరో పవిత్ర స్థలమైన పోరబందర్‌లో జాలర్లతో సంభాషించారు. 'రాహుల్‌' పర్యటన వలన బిజెపికి పట్టున్న 'సౌరాష్ట్ర'లో కాంగ్రెస్‌ గట్టిగా పుంజుకుంది. పత్తి మరియు వేరుశెనగ రైతులు తమకు మద్దతు ధరలు లేవని ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా..మరో వైపు పట్టిదార్స్‌ తమకు ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించకపోవడంపై మండిపడుతున్నారు. పత్తిరైతులు,వేరుశెనగ రైతులు మద్దతు ధర లేక ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.

పెరుగుతున్న అసంతృప్తి...!

నా జీవితంలో ఇటువంటి రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని చూడలేదు...రైతులను ప్రభుత్వం చంపుతోంది..! మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు పత్తికి రూ.1300/- లభించేవి. 'మోడీ' ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పత్తిరైతుకు క్వింటాళ్లకు రూ.2000/- చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పుడు బిజెపి ప్రభుత్వం కనీసం వెయ్యి రూపాయలు కూడా చెల్లించడం లేదు.

జివ్వభాయిపేటల్‌...రైతు

మరోవైపు పట్టిదార్‌ సమస్య మోర్బీ మరియు బోటాడ్‌ ప్రాంతంలో ఎక్కువగా ఉంది. ఇక్కడ ఎక్కువ మంది వ్యవసాయదారులు పట్టిదార్సే.

'మాకు ఎటువంటి ఉద్యోగాలు లేవు. మేము ఉన్నత డిగ్రీలు చదివి వ్యవసాయం చేసుకోవాల్సి వస్తోంది. ఇది జీవితానికి సరిపోవడం లేదు. మాకు కులానికి రిజర్వేషన్లు కల్పిస్తే..మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి.

మగ్నాభాయి పటేల్‌...జామానగర్‌ జిల్లా...!

రైతులకు మద్దతు ధరలు లేకపోవడంపై బిజెపి నాయకులు స్పందిస్తూ త్వరలో నర్మదా నీళ్లు వస్తాయని, దీని ద్వారా పొలాలకు నీరు అందిస్తామని, అదే సమయంలో పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నారు. ప్రధాని మోడీ గత ఆరు నెలల్లో పలుసార్లు ఈ ప్రాంతానికి వచ్చి పలు పరిశ్రమలకు శంఖుస్థాపన చేసి వెళ్లిపోయారు.కాగా తనకు బలమైన మద్దతు ఉన్న ఈ ప్రాంతంలో మళ్లీ అదే స్థాయిలో సీట్లు గెలుచుకోవాలని బిజెపి విశ్వప్రయత్నం చేస్తోంది. అందుకే ఎక్కువ మంది పట్టీదార్స్‌కు అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చి బరిలోకి దింపుతోంది. కాంగ్రెస్‌ మాత్రం ఇందుకు విరుద్ధంగా బిసీలకు సీట్లు ఇస్తోంది. ఏది ఏమైనా విజేతను నిర్ణయించే సత్తా ఉన్న ఈ ప్రాంతంపై బిజెపి,కాంగ్రెస్‌ పట్టుకోసం పెనుగులాడుతున్నాయి.


(620)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ