లేటెస్ట్

ఇప్పుడు ఎన్నికలు జరిగితే...టిడిపికి 127స్థానాలు...!

రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి 127 స్థానాలు వస్తాయని వైకాపా రెబెల్‌ ఎంపి రఘురామకృష్ణంరాజు తెలిపారు. జూన్‌,జూలై మాసాల్లో తాను విస్తృత స్థాయిలో, సంతృప్తికర స్థాయిలో శాంపిల్స్‌ తీయించానని, ఈ సర్వేలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతోందని తేలిందని ఆయన చెప్పారు. టిడిపి ఒంటరిగానే విజయం సాధిస్తుందని, తాను పొత్తుల గురించి మాట్లాడలేదని, రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన టిడిపి,వైకాపా, జనసేనల ఓటింగ్‌ శాతాలను తెలుసుకున్నానని, టిడిపి మంచి మెజార్టీతో విజయం సాధిస్తుందని ఈ సర్వేలో తేలిందన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టిడిపి ఖచ్చితంగా 54స్థానాల్లో గెలుస్తుందని, మరో 39సీట్లలో గెలవడానికి ఎక్కువ అవకాశాలున్నాయని, మరో 68 స్థానాల్లో పోటా పోటీ ఉంటుందని, వీటన్నింటిని పరిగణలోకి తీసుకుంటే టిడిపికి 127 స్థానాలు వస్తాయని సర్వే పేర్కొందని ఆయన చెప్పారు. తమ పార్టీ 8 స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తుందని, మరో మూడు స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని చెప్పారు.


ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైకాపా ఇంటికి పోవడం ఖాయమని ఆయన అన్నారు. ఇటీవల ఇంగ్లీషు ఛానెల్స్‌ కొన్ని సర్వేలు చేశాయని, ఆసర్వేలను చూసుకుని తమ పార్టీ జబ్బలు చరుచుకుంటోందని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అంత బాగాలేదని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతంలో దాదాపు క్లీన్‌స్వీప్‌ చేసిన వైకాపాకు ఈసారి అటువంటి పరిస్థితిలేదని సర్వే తెలిపిందన్నారు. సిఎం జగన్‌ స్వంత జిల్లా అయిన కడపలో కూడా టిడిపి పుంజుకుందని, ఇక్కడ టిడిపికి, వైకాపాకు సగం సగం సీట్లు వచ్చే పరిస్థితి ఉందన్నారు. పవన్‌ కళ్యాణ్‌ ప్రాభవం కేవలం గోదావరి జిల్లాలోనే ఉంటుందని, ఆయన కనుక టిడిపితో కలిస్తే వార్‌ వన్‌సైడ్‌ అవుతుందని రఘురామ తెలిపారు. మొత్తం మీద రఘురామ చేసిన సర్వే రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ