లేటెస్ట్

‘రఘురామ’ చెప్పినంత ఈజీగా ఏమీ లేదు...?

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి 125 స్ధానాలు వస్తాయంటూ అధికార రెబెల్‌ ఎంపి రఘురామకృష్ణంరాజు చెప్పిన సర్వే వాస్తవాలకు దగ్గరగానే ఉందని, అయితే కొన్ని చోట్ల ఆయన చెప్పినంత సులువుగా ఏమీ లేదనే అభిప్రాయాలు టిడిపి నాయకులు, కార్యకర్తల్లోనే వ్యక్తం అవుతున్నాయి.  రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా అరాచకపాలనపై, అకృత్యాలపై, నిరంకుశ వైఖరిపై అసంతృప్తి, ఆవేదన వ్యక్తం అవుతున్నా, దాన్ని ప్రతిపక్ష తెలుగుదేశం క్యాష్‌ చేసుకోలేకపోతుందనే భావన వారిలో ఉంది. ఉదాహరణకు పూర్వ గుంటూరు జిల్లానే తీసుకుందాం. ఇక్కడ 17 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇప్పటి వరకూ టిడిపి కొన్ని నియోజకవర్గాలకు కనీసం ఇన్‌ఛార్జిలను కూడా నియమించలేకపోయింది. ఆయా నియోజకవర్గాల్లో గతంల పోటీ చేసిన నాయకుల్లో చాలా మంది ఇప్పటికీ రోడ్ల మీదకు రాలేకపోతున్నారు. కొందరు కేసుల భయంతో, మరికొందరు వైకాపా నాయకులతో ఉన్న వ్యాపార సంబంధాలతో పార్టీ కార్యక్రమాల పట్ల అంటీముట్టనట్టే ఉంటున్నారు. మరి కొందరు ఏదో చేస్తున్నామంటే చేస్తున్నామని, మరి కొందరు ‘జగన్‌’పై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తే తమను గెలిపిస్తుందనే భావనతో ఉన్నారు. వాస్తవ పరిస్థితుల ఆధారంగా వారు రాజకీయాలను చేయడం లేదు. ఇప్పటికీ కొందరు హైదరాబాద్‌, బెంగుళూరు నుంచే రాజకీయాలను నడిపిస్తున్నారు. తమ కుటుంబాలను హైదరాబాద్‌, బెంగుళూరు లేకపోతే విదేశాల్లో ఉంచి వీరుమాత్రం వారానికోసారి నియోజకవర్గానికి చుట్టచూపులా వచ్చి, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని మమ అనిపిస్తున్నారు. వీరి రాజకీయాలను చూసిన వారు..ఇటువంటి వారిని నమ్ముకుని ‘చంద్రబాబు’ ‘జగన్‌’ను ఎలా ఓడిస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రజల్లో వైకాపా,జగన్‌పై తీవ్రమైన అసంతృప్తి ఉన్నా, రేపటి ఎన్నికల సమయంలో దాన్ని క్యాష్‌చేసుకునే టిడిపి నాయకత్వం నియోజకవర్గాల్లో కనిపించడం లేదు. ఇక్కడే మరో ఉదాహరణ చెప్పుకుందాం.


గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గాన్ని తీసుకుందాం. ‘కమ్మ’ సామాజికవర్గ ఓట్లు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైకాపా గెలిచింది. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి వేలకోట్లకు అధిపతి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్లే ఇక్కడ కూడా ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. అయితే ఇక్కడ ఎమ్మెల్యే ప్రజల్లో ఉన్న అసంతృప్తిని గమనించి, స్వంతంగానే కొన్ని అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు రాకున్నా, ఆయన ‘వినుకొండ’ పట్టణంలో అభివృద్ధిపనులు చేపట్టి ప్రజలతో ఎంతో కొంత చేస్తున్నారనిపించుకుంటున్నారు. గతంలో ఇక్కడ నుంచి రెండుసార్లు గెలిచిన టిడిపి ఎమ్మెల్యే చేయని పనులు ఇప్పటి ఎమ్మెల్యే చేస్తున్నారనే భావన ప్రజల్లో కనిపిస్తోంది. వాస్తవానికి ఇక్కడ సిఎం జగన్‌పై మెజార్టీ ఓటర్లకు అసంతృప్తి ఉన్నా, ఎమ్మెల్యే పనితీరుపై సానుకూలత వ్యక్తం అవుతోంది. వాస్తవం ఇది కాగా, ‘రఘురామ’ సర్వేలో ఇక్కడ ‘టిడిపి’ గెలుస్తుందని చెప్పేశారు. అదే విధంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో కూడా ఉంది. ఇక్కడ మంత్రిగా ఉన్న ‘అంబటి రాంబాబు’పై ప్రజల్లో అసంతృప్తి ఉన్నా అక్కడ టిడిపికి సరైన నాయకత్వం లేదు. పలువురు నాయకులు నాయకత్వం కోసం పోరాడుతున్నారు. ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉన్నా ఇక్కడ బహు నాయకత్వంతో టిడిపి క్యాడర్‌ తంటాలు పడుతోంది. గతంలో పలుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేసిన నాయకులూ తూతూమంత్రంగా పనిచేస్తున్నారు. ఇటువంటి పరిస్థితి జిల్లా మొత్తం ఉంది. అయితే టిడిపిలో ఉండే లోపాలను పక్కన పెట్టి కేవలం ‘జగన్‌’పై ఉన్న వ్యతిరేకతనే ఆధారంగా చేసుకుని ‘రఘురామ’ సర్వే వచ్చిందని, దీన్ని చూసుకుని అప్పుడే అధికారంలోకి వచ్చామని టిడిపి నేతలు భావిస్తే మళ్ళీ భంగపాటుకు గురికాక తప్పదనే అభిప్రాయాలు క్షేత్రస్థాయి నుంచి వ్యక్తం అవుతున్నాయి. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ