WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రాజకీయపార్టీల నిరసనలకు 'సుప్రీం' కళ్లెం...!

న్యూఢిల్లీ: విచ్చలవిడిగా నిరసనలకు, ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తూ...సమాజంలో విధ్వంసానికి, ప్రాణనష్టానికి, ఆస్తి నష్టానికి కారణమవుతున్న రాజకీయపార్టీలు, సంఘాలు, సంస్థలు, వ్యక్తులపై 'సుప్రీంకోర్టు' కొరడా ఝళిపించింది. ఆందోళన కార్యక్రమాలు, నిరసనలను నిర్వహించి ప్రభుత్వ,ప్రైవేట్‌ ఆస్తి,ప్రాణ నష్టాలకు బాధ్యులైన ఆయా రాజకీయపార్టీలు, సంస్థలు, వ్యక్తులు జరిగిన నష్టానికి బాధ్యులను చేస్తూ సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. మంగళవారం నాడు ఈ విషయంపై జస్టిస్‌ ఎస్‌.కె.ఘోయల్‌, లిలత్‌ల ధర్మాసనం ఈ మేరకు మార్గదర్శకాలను రూపొందించమని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అదే సమయంలో దీనిపై ఒక చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

   ఇప్పటి వరకు ఎవరైనా రాజకీయ పార్టీలు, సంఘాలు,సంస్థలు, వ్యక్తులు సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి ఆస్తి,ప్రాణ నష్టానికి కారకులైనా..ఆయా సంస్థలపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా వదిలేసేవారు. లేదా..ఆయా సభలు, సమావేశాలు పెట్టుకోనీయకుండా ప్రభుత్వాలు అడ్డుకునేవి. ఇక రాబోయే రోజుల్లో ఏపార్టీ అయినా తాము సమావేశం లేదా ర్యాలీ, ఆందోళన నిర్వహిస్తామని ముందస్తుగా ప్రభుత్వం అనుమతి తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ తాము నిర్వహించిన సమావేశం, లేదా ర్యాలీ..సదస్సుల్లో హింస చెలరేగి, ఆస్తి, ప్రాణనష్టం జరిగితే సభకు అనుమతి తీసుకున్న పార్టీలు, వ్యక్తులు,సంస్థలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆస్తి నష్టం జరిగితే ఆయా పార్టీలు, లేదా సంస్థల నుండి జరిగిన నష్టాన్ని ముక్కుపిండి వసూలు చేయమని సుప్రీంకోర్టు మార్గదర్శకాలను విడుదల చేసింది. అంతే కాకుండా ఆస్తినష్టం,ప్రాణనష్టం జరిగితే వాటిని విచారించడానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆయా కోర్టులకు జిల్లా స్థాయి జడ్జిలను నియమించి వేగంగా తీర్పులు వచ్చే విధంగా చూడాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అడ్వకేట్‌ జనరల్స్‌కు సూచించింది. మొత్తం మీద 'సుప్రీంకోర్టు' ఈ రోజు విడుదల చేసిన మార్గదర్శకాలతో విచ్చలవిడిగా నిరసనలు, ఆందోళనలతో సామాన్య ప్రజలను ఇబ్బందులు పెడుతున్న వారిని కొంత మేర అయినా అడ్డుకోవడానికి ఆస్కారం ఉంటుంది.


(472)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ