లేటెస్ట్

నాకు కొంత సమయం కావాలి:లక్ష్మీపార్వతి

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ పేరు మార్పు రాజకీయంగా రాష్ట్రంలో అలజడి సృష్టిస్తోంది. దీనిపై అన్ని రాజకీయపార్టీలు, వివిధ సంఘాలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. దివంగత ఎన్టీఆర్‌ పేరును మార్చడం సరికాదని, ఇది ఆయనను అవమానించడమేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నగరంలో ఉన్న ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శీటి పేరును వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్శీటిగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాజకీయపార్టీలు, సంస్థలు, మెజార్టీ ప్రజలు పార్టీలకు అతీతంగా విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై రాజకీయపార్టీలు ఆందోళనలు చేస్తున్నాయి. ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు, సినీనటులు దీనిపై స్పందిస్తున్నాయి. అయితే దివంగత ఎన్టీఆర్‌ భార్య లక్ష్మీపార్వతి మాత్రం దీనిపై స్పందించడం లేదు. ఎన్టీఆర్‌ పేరును మార్చడంపై ఆమె మౌనాన్ని ఆశ్రయించారు. ఆమె మౌనంపై సోషల్‌ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె ఎందుకు దీనిపై స్పందించడం లేదనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి ఆమెను టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేస్తోంది. కాగా ఇంత పెద్ద సమస్యపై ఎందుకు స్పందించడం లేదని, ఆమెను మీడియా ప్రతినిధులు, ఇతరులు ప్రశ్నించగా, తాను స్పందించడానికి కొంత సమయం కావాలని, అప్పటి వరకూ దీనిపై ఏమీ మాట్లాడలేనని, తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఆమె కోరుతున్నారట. అయితే ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆమె ప్రస్తుతం నిర్వహిస్తున్న తెలుగు అకాడమీ ఛైర్మన్‌ పదవి పోతుందన్న భయమే దానికి కారణమని, అందుకే ఆమె స్పందించడం లేదనే మాట వినిపిస్తోంది.


మరో వైపు ఈ విషయంపై కర్రవిరగకుండా, పాము చావకుండా అన్నట్లు స్పందించిన సినీనటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌పై కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాత్రం ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. తెలుగుజాతి వెన్నుముక అయిన ఎన్టీఆర్‌ పేరును మీరు మారిస్తే ప్రజలు మిమ్మలను మారుస్తారంటూ హెచ్చరించారు. గతంలో వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్‌ పేరును తొలగించారని, ఇప్పుడు ఆయన కుమారుడు హెల్త్‌ యూనివర్శీటికీ ఎన్టీఆర్‌ పేరును తొలగించారని ఆయన మండిపడ్డారు. మొత్తం మీద ఎన్టీఆర్‌ పేరును తొలగించి ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందనే అభిప్రాయం అన్ని వర్గాల్లోనూ వ్యక్తం అవుతోంది. అయితే ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యుల్లో కొందరు మాత్రం దాన్ని అర్థం చేసుకోకుండా, ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహం కలగకూడదనే ధోరణితో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారని, ఎన్టీఆర్‌ భార్య కూడా ఇదే విధంగా వ్యవహరిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ