'నెల్లూరు ఎస్పీ'పై టిడిపి నాయకుల ఆగ్రహం...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'నెల్లూరు ఎస్పీ'పై టిడిపి నాయకుల ఆగ్రహం...!

ప్రతిపక్షంలో పదేళ్లున్నాం..అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు అయింది. అయినా తామంతా ప్రతిపక్షంలో ఉన్నట్లే ఉందని పలువురు టిడిపి నాయకులు అంటున్నారు. ఇకనైనా కళ్లు తెరవకుంటే పరిస్థితి విషమిస్తుందని నెల్లూరు జిల్లా సమన్వయకమిటీ సమావేశంలో ఎమ్మెల్యేలు,నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు ఆవేశంగా ప్రసంగించారు. విషయమేమిటంటే నెల్లూరు జిల్లా ఎస్పీ రామకృష్ణ తెలుగుదేశం పార్టీకి చెందిన వారిని వేధిస్తున్నారని, ఆయన ఆదేశాలతో మండలస్థాయిలో పోలీసులు కూడా దురుసుగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపించారు. ఎస్పీ పేరుతో కిందిస్థాయి పోలీసు అధికారులు నిరంకుంశంగా వ్యవహరిస్తున్నారు. పోలీసుస్టేషన్లలో కానిస్టేబుల్స్‌ కూడా తమ మాట వినడంలేదని, త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి..ఆ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో మీరే చెప్పండి...అని టిడిపి నేతలు మండిపడ్డారు. జిల్లాపార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ అధ్యక్షతన జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నారాయణలతో పాటు ఇన్‌ఛార్జి మంత్రి అమర్‌నాథ్‌రెడ్డిలు కూడా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ చెందిన వారి ఆటోలను పట్టుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, చిన్న చిన్న తగాదాలతో టిడిపికి చెందిన వారు పోలీస్‌స్టేషన్లకు వస్తే ఆయా సమస్యలను పరిష్కరించకుండా బోగస్‌ కేసులు పెడుతూ బెదిరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఎస్పీ రామకృష్ణపై ఇంతకు ముందు అనేకసార్లు ఫిర్యాదు చేసినా మంత్రులు పట్టించుకోవడం లేదని, ఇంకా ఈ పరిస్థితి కొనసాగిస్తే రాజకీయంగా తాము మౌనం దాల్చాల్సి వస్తుందని, అప్పుడు నష్టపోయేది పార్టీయేనని కొంత మంది నాయకులు హెచ్చరించారు. ఎస్పీ పనితీరుపై మంత్రులు సోమిరెడ్డి,నారాయణలు సిఎం దృష్టికి తీసుకెళ్లారని ఇన్‌ఛార్జి మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి కూడా ముఖ్యమంత్రితో మాట్లాడతారని సమావేశానికి హాజరైన నాయకులు సర్దిచెప్పారు. ఏది ఏమైనా నెల్లూరు జిల్లా ఎస్పీ రామకృష్ణ వ్యవహారశైలిపై పార్టీ నాయకులందరూ ఒక తాటిపై నిలుస్తూ ఆయనను ఆ జిల్లా నుంచి తప్పించాలని పట్టుపడుతున్నారు.

(223)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ