నియోజకవర్గానికి 'నేనే రాజు..నేనే మంత్రి...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

నియోజకవర్గానికి 'నేనే రాజు..నేనే మంత్రి...!

గత సార్వత్రిక ఎన్నికల దగ్గర నుంచి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారిపోయాయి. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత అధికారపార్టీ ఎమ్మెల్యేలు సర్వ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో వారే రారాజులుగా వెలుగొందిపోతున్నారు. గతంలో నియోజకవర్గంలో గెలుపొందిన ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆ జిల్లాకు చెందిన మంత్రులతో..ఇన్‌ఛార్జి మంత్రితో కలుపుగోలుగా వ్యవహరించేవారు. నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల కోసం వారిని ఆహ్వానించి పనులు చేయించుకునేవారు. వారి అండంతో నియోజకవర్గానికి ఎక్కువ నిధులు తెచ్చుకోవాలని ఆరాటపడేవారు. వారిని తన నియోజకవర్గంలో ఏ పని ఉన్నా..లేకున్నా నిత్యం తిప్పడానికి ప్రయత్నించేవారు. మంత్రి అండదండలతో నియోజకవర్గంలో ఉద్యోగుల బదిలీలు,పోస్టింగ్‌లు, అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించేవారు. మంత్రి కనుసన్నల్లో నడవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. తాను మంత్రి వర్గంలోని ఎమ్మెల్యేని అని చెప్పుకోవడానికి ఆరాటపడేవారు...కానీ 2014 ఎన్నికల దగ్గర నుంచి ఎమ్మెల్యేల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి.

ఎమ్మెల్యేనే రారాజు...!

      ఇప్పుడు నియోజకవర్గంలో ఎవరికి వారే రారాజులు..వారిపై ఎవరి నియంత్రణ ఉండడం లేదు. నియోజకవర్గానికి 'నేనే రాజు..నేనే మంత్రి' అన్నట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లా మంత్రికి కానీ, ఇన్‌ఛార్జి మంత్రికి జవాబుదారీగా ఉండడం లేదు. ఏదైనా ఉందంటే ముఖ్యమంత్రి వద్దనే తేల్చుకుంటామని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇటువంటి వారినే ప్రోత్సహిస్తున్నారు. ప్రతివారితో టచ్‌లో ఉంటూ..వారి నియోజకవర్గానికి ఏమి కావాలో మంజూరు చేస్తూ మంత్రులతో పనిలేకుండా చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో రారాజులుగా వెలిగిపోతున్నారు. జిల్లాలో ఇద్దరు ముగ్గురు మంత్రులు ఉన్నా..వారు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకే మంత్రులుగా చలామణి అవుతున్నారు. జిల్లాలోని ఇతర నియోజకవర్గాలకు వెళ్లేందుకు సాహసించడం లేదు. ఎమ్మెల్యేలు వారిని తమ నియోజకవర్గంలో పర్యటించాల్సిందిగా కూడా కోరవడం లేదు. ఎవరైనా మంత్రి స్వతంత్రించి నియోజకవర్గానికి వెళితే వారికి ఆ ఎమ్మెల్యే సహకరించడం లేదు. దీంతో పలు జిల్లాల్లో మంత్రులు నామ మాత్రం అవుతున్నారు. శాఖ పనులు చేసుకోవడం, సచివాలయానికి వెళ్లడం..ముఖ్యమంత్రి వస్తే మాత్రం ఆయన వెంట తిరగడం మాత్రమే చేస్తున్నారు. ఇంతకు ముందు మంత్రి అంటే జిల్లా అంతటా అధికారం చెలాయించేవారు. కొందరు మంత్రులు అయితే ఆ జిల్లాకే పరిమితం కాకుండా ఇతర జిల్లాలపై కూడా ప్రభావం చూపించేవారు. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. మంత్రులుగా ఉన్నవారు ఆయా ప్రాంతాలపై పట్టుసాధించలేకపోవడంతో ఎంత తెలివైన నాయకుడైనా, సమర్థుడైనా..నియోజకవర్గానికే పరిమితం అవుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ద్వితీయశ్రేణి నాయకత్వ కొరత ఏర్పడుతుంది. 

   ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కొందరు మంత్రులు ఆయా జిల్లాలకే పరిమతం కాకుండా ఇతర జిల్లాలో కూడా ప్రభావం చూపించేవారు. ఉదాహరణకు గుంటూరు జిల్లాను తీసుకుంటే అప్పట్లో అక్కడ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ప్రస్తుత స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు గుంటూరు జిల్లాతో పాటు ప్రకాశం,కృష్ణా జిల్లాలో కూడా ప్రభావం చూపించేవారు. ఇప్పుడు అదే జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పత్తిపాటి పుల్లారావు కేవలం ఆయన నియోజకవర్గమైన 'చిలకలూరిపేట'కే పరిమితమవుతున్నారు. జిల్లాలో మొత్తం 17 నియోజకవర్గాలు ఉంటే ఆయా నియోజకవర్గాల్లో పూర్తిగా పర్యటించలేని పరిస్థితి మంత్రికి ఉంది. దీనంతటికి కారణం జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎవరికి వారు స్వతంత్య్రంగా వ్యవహరించడమే. అధిష్టానం కూడా ఎమ్మెల్యేలను ప్రోత్సహించడంతో జిల్లాలో మంత్రులు ప్రాభల్యం తగ్గిపోతోంది. ఏది ఏమైనా ఇటువంటి పరిస్థితిపై పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పరిస్థితిలో మార్పురావాలని వారు కోరుకుంటున్నారు.

(873)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ